ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను భవనాల ప్రగతిని ప్రశ్నిస్తున్న ఈఈ వీరంనాయుడు
జూన్ 30నాటికి ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే
అధికారులకు పీఆర్ ఈఈ వీరంనాయుడు ఆదేశం
చీడికాడ, మే 21 : ‘నాకు ఎవరూ కథలు... కహానీలు చెప్పవద్దు, ఈ ఏడాది జూన్ 30 నాటికి ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తిచేయాల్సిందే’ అని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరంనాయుడు అధికారులను ఆదేశించారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలపై ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో శనివారం ఇక్కడి ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయాల వారీగా ప్రభుత్వ భవనాల నిర్మాణాల ప్రగతిని తెలుసుకున్నారు. అనంతరం ఒక్కొక్కరూ ఒక్కో తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కాంట్రాక్టర్ల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను చెబుతున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లపై ఆయన మండిపడ్డారు. ఎవరూ కథలు చెప్పకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు. లేనిపక్షంలో శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఈఈ డి.వెంకటరావు, ఏఈ శరగడం పరదేశినాయుడు తదితరులు పాల్గొన్నారు.