మేల్కోకుంటే మరింత ముప్పు

ABN , First Publish Date - 2021-11-26T07:53:17+05:30 IST

జిల్లాలోని చెరువులన్నీ నిండిపోయాయి. ఇప్పటికే 521 చెరువులకు గండ్లు పడ్డాయి. బుధవారం ఒక్కరోజే 65 చెరువులు దెబ్బతిన్నాయి.

మేల్కోకుంటే మరింత ముప్పు

భారీ వర్షాలతో ఇప్పటికే జిల్లా అతలాకుతలమైపోయింది. అన్ని శాఖల్లో సుమారు రూ.వెయ్యి కోట్ల నష్టం కలగడంతో పాటు వరద కారణంగా పదిమంది ప్రాణాలు వదిలారు. ఇప్పటికీ తిరుపతి, చిత్తూరు నగరాల్లోని చాలా కాలనీలు వరద నీటిలోనే మగ్గుతున్నాయి. జిల్లాకు వరద చేసిన గాయం తగ్గకముందే మరో ప్రమాదం వచ్చి పడుతోంది.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకుంటే జిల్లాకు పెద్ద ముంపు పొంచివుంది.

ప్రమాదంలో పలు చెరువులు

జిల్లాలోని చెరువులన్నీ నిండిపోయాయి. ఇప్పటికే 521 చెరువులకు గండ్లు పడ్డాయి. బుధవారం ఒక్కరోజే 65 చెరువులు దెబ్బతిన్నాయి. మళ్లీ వర్షం వస్తే నిండిన చెరువులు మరిన్ని తెగే అవకాశాలు లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జలవనరులశాఖ నిస్తేజంగా ఉంది. ఒక్క చెరువులోనూ పనులు చేయలేదు. కట్టలను పటిష్ఠం చేయలేదు.వర్షాలు వరుసగా కురవడంతో చెరువులకు గండ్లు పడి రహదారుల మీద ప్రవాహం అధికమైంది. ఫలితంగా గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.

అవగాహన కల్పించడంలో విఫలం 

వరద కారణంగా జిల్లాలో ఇప్పటివరకు పదిమంది ప్రాణాలొదిలారు. విద్యుత్‌ షాక్‌తో, గోడ కూలి చనిపోయినవారి విషయంలో అధికారుల పాత్ర లేకపోయినా.. ప్రవాహాల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయినవారి విషయంలో మాత్రం యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రవాహం అధికంగా ఉన్నచోట దాటొద్దని స్థానిక వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీసుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి, అవసరమైతే ప్రవాహం తగ్గే వరకు అక్కడ రాకపోకల్ని అడ్డుకునేలా ఒకర్ని నియమించి ఉండొచ్చు. గల్లంతైన వారిని గుర్తించడంలోనూ అధికారుల వైఫల్యం కనిపిస్తోంది. బంగారుపాళ్యంలో, తిరుపతిలో గల్లంతైనవారి మృతదేహాలను ఇంకా గుర్తించలేకపోయారు. అయినవారికి చివరిచూపు భాగ్యం కలిగించలేకపోతున్నారు. 

నిర్వహణ లేక కొట్టుకుపోయిన రహదారులు

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రహదారులను పట్టించుకోవడం లేదు. ఏడాదికోసారి విడుదల చేయాల్సిన నిర్వహణ  నిధుల్ని మంజూరు చేయడం లేదు. దీంతో వరదలకు ముందే రహదారులన్నీ ఛిద్రమయ్యాయి.వరుస వర్షాలు పడడంతో అధిక ప్రవాహం కారణంగా చాలాచోట్ల రహదారులు తెగిపోయాయి. సుమారు 300 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆర్‌అండ్‌బీ పరిధిలో 161 ప్రాంతాల్లో 295 కిలోమీటర్ల మేర.. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 277 కిలోమీటర్ల మేర 116 రోడ్లు దెబ్బతిన్నాయి.


Updated Date - 2021-11-26T07:53:17+05:30 IST