దోశెయ్‌.. దోచేయ్‌!

ABN , First Publish Date - 2021-07-27T05:07:11+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ధరల దోపిడీ జరుగుతోంది. ధరపై ప్రయాణికులు ప్రశ్నించగా, కొంటే కొనండి లేదంటే వెళ్లండని నిర్వాహకులు దురుసుగా సమాధానం చెబుతున్నారు.

దోశెయ్‌.. దోచేయ్‌!
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్‌

 ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌లో చుక్కలనంటుతున్న రేట్లు

 దోశ  రూ.75, వాటర్‌ బాటిల్‌ రూ.35

ఖానాపురంహవేలీ, జూలై26: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ధరల దోపిడీ జరుగుతోంది.  ధరపై ప్రయాణికులు ప్రశ్నించగా, కొంటే కొనండి లేదంటే వెళ్లండని నిర్వాహకులు దురుసుగా సమాధానం చెబుతున్నారు. అల్పాహార హోటల్‌లో అయితే బయటి ధరల కంటే రెట్టింపు, అంతకు మించి ధరలు వసూలు చేస్తున్నారు.  హోటల్‌లో ఎక్కడా కూడా ధరల పట్టికలను ఏర్పాటు చేయలేదు. హోటల్‌లోకి వెళ్లిన వారికి నిర్వాహకులు ఎంత ధర చెబితే అంత చెల్లించాల్సి రావడం భారంగా మారింది.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రయాణికులు ఖమ్మం వస్తుంటారు. వారు బస్సు దిగిన వెంటనే అల్పాహారం తీసుకోవడానికి అనువుగా ఉందని బస్టాండ్‌లోని హోటల్‌కు వెళుతుం టారు. అయితే అక్కడ మాత్రం ధరలు మండుతున్నాయి. సాధారణంగా బయటి హోటళ్లలో భోజనం (ఫుల్‌మీల్స్‌) రూ.70 ఉండగా, బస్టాండ్‌ హోటల్‌లో రూ.100 వసూలు చేస్తున్నారు. ఆనియన్‌ దోశ బయట రూ.35 ఉండగా, అక్కడ రూ. 75 వసూలు చేస్తున్నారు. ఇక వాటర్‌ బాటిల్‌ సాధారణ ధర రూ.20 ఉండగా బస్టాండ్‌ హోటల్‌లో మాత్రం  రూ.35 దండుకుం టున్నారు. ఈ ధరలను చూసి ప్రయాణికులకు తినకుండానే కడుపు నిండుతోంది. ఇలా ఆ హోటల్‌లో అన్ని రకాల పదార్థాలపై రెట్టింపు ధరలు అమలు చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్‌ఎంకు సమస్యలు వివరించినా ఫలితం లేకుండా పోతుందని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు.  

 నిబంధనలకు విరుద్ధంగా టీ స్టాల్‌

ఆర్టీసీ నిబంధనల ప్రకారం  వారికి కేటాయించిన స్థలంలో మాత్రమే స్టాల్‌ ఏర్పాటు చేసుకోవాలి. అయితే సదరు హోటల్‌ నిర్వాహకులు మాత్రం టీ స్టాల్‌ను హోటల్‌ ప్రాంగణం బయట ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రయాణికులు తిరిగే ప్రాంతంలో టేబుల్‌, దానిపై టీ తయారీ పరికరాలు ఏర్పాటు చేయడంలో ఇబ్బందిగా ఉంది.

విచారణ నిర్వహిస్తాం.. 

సోలోమన్‌, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌, ఖమ్మం

బస్టాండ్‌ ప్రాంగణంలో ఉన్న హోటల్‌లో అధిక ధరలపై విచారణ నిర్వహిస్తాం. ధరల పట్టిక ఏర్పాటు చేయించి, బయట ఉన్న ధరలనే తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. ఒకవేళ అధిక ధరలు తీసుకుంటున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-07-27T05:07:11+05:30 IST