డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల పంపిణీలో జాప్యం వెనుక రహస్యం ఇదేనా?

ABN , First Publish Date - 2020-09-23T17:02:50+05:30 IST

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేదోళ్లకు అందడం కలేనా? నేతలకు డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్‌ రూమ్ ఇల్లు వస్తుందా! పూర్తయిన ఇళ్ల పంపిణీలో జాప్యం వెనుక మతలబు ఏమిటి? కొందరు

డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల పంపిణీలో జాప్యం వెనుక రహస్యం ఇదేనా?

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేదోళ్లకు అందడం కలేనా? నేతలకు డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్‌ రూమ్ ఇల్లు వస్తుందా! పూర్తయిన ఇళ్ల పంపిణీలో జాప్యం వెనుక మతలబు ఏమిటి? కొందరు నేతలు  వసూళ్ల పర్వం కొనసాగించడం దేనికి సంకేతం? ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వసూళ్లపై ఎలాంటి చర్చ సాగుతోంది? ప్రత్యేక కథనం...


ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఇళ్ల కేటాయింపులో కొందరు నేతలు వసూలు దందాకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఒక్కో లబ్ధిదారుడి నుంచి 50 వేల రూపాయలకు తగ్గకుండా అక్రమార్కులు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు ఇప్పటివరకు 3 వేల 346 ఇళ్లు మంజూరు కాగా, కేవలం  455 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పనులు నత్తనడకనే కొనసాగుతుండటంతో ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. పైగా పూర్తయిన పనుల నాణ్యతలోనూ డొల్లతనం కనిపిస్తోంది.


జిల్లాలో 445 డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఏడాది అయింది. అయినా వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదు. వీటి కేటాయింపులపై ఉద్దేశపూర్వక జాప్యం జరుగుతోంది. వందల సంఖ్యలో నిర్మాణాలు పూర్తికాగా, వేల సంఖ్యలో పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.  దీంతో ఎవరికీ కేటాయించినా మిగతా వర్గాల్లో వ్యతిరేకత తప్పదన్న భావనతో  ఎమ్మెల్యేలు  మౌనంగా ఉంటున్నారు. పూర్తయిన ఇళ్లను పంపిణీ చేసే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో గూడు లేని అనేక మంది పేదలు తమకు ఇల్లు ఇవ్వాలని చోటామోటా లీడర్ల వెంట తిరుగుతున్నారు. ఇదే అదనుగా కొందరు నేతలు.. మీకే ఇల్లు ఇప్పిస్తామని అందినంత దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.


ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటంతోనే  కేటాయింపులు వాయిదా పడుతున్నట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కనీసం 4వేల నుంచి 5వేల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయితేనే కొంతమేరకు ఒత్తిడి తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో మావల, ఉట్నూర్‌, జైనథ్‌ మండలాలతోపాటు జిల్లా కేంద్రంలోని కేఆర్‌కే కాలనీలో నిర్మాణాలు పూర్తయినా కేటాయించే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు నిర్మాణం పూర్తయిన ఇళ్లను కొందరు లబ్ధిదారులు ప్రారంభానికి ముందే కబ్జా చేస్తున్నారు. ఏడాదిపాటుగా ఎదురుచూసిన అధికారులు కేటాయించకపోవడంతో స్థానిక నేతల అండతో కబ్జా చేసి నివాసం ఉంటున్నారు. అయినా సంబంధిత అధికారులు నోరు మెదపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్థానిక నేతలు ఇళ్లను కబ్జా చేస్తూ తమకు డబ్బులు ఇచ్చినవారికి అనధికారికంగానే అంటగడుతున్నారు. అందినకాడికి దండుకుంటూ చక్రం తిప్పుతున్నారు.


డబుల్ ఇళ్ల దళారులు ఒక్కో ఇంటికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. డబ్బులు ఇస్తేనే ఇళ్లు కేటాయిస్తామని నమ్మబలకడంతో అనేకమంది అమాయక ప్రజలు అప్పుజేసి మరీ ముడుపులు ముట్టజెబుతున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతోంది. అయినా నియోజకవర్గస్థాయి నేతలు నోరు మెదపడం లేదు. తమ అనుచరుల వసూలు దందాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. ఇదంతా మాములేనంటూ తేలికగా తీసుకుంటున్నారు. బోథ్‌ మండలంలో ఓ అధికార పార్టీ నేత డబుల్ ఇళ్ల కేటాయింపు పేరిట ప్రజల నుంచి బహిరంగంగానే వసూలు చేశారు. ఈ విషయాన్ని అదే పార్టీకి చెందిన ఎంపీపీ తుల శ్రీనివాస్‌ కొద్దిరోజుల క్రితం జిల్లా పరిషత్ సమావేశంలో ప్రస్తావించారు. పేదల నుండి డబ్బులు వసూలు చేయడం ఏమిటని నిలదీశారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీపీనే వసూళ్ల తీరును బయట పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఇప్పటికే కొన్ని మండలాల్లో పేదల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధికారులు జాబితాను సిద్ధం చేశారు. ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్లు కావాలంటున్న వారిలో పార్టీ నాయకులే ఉండటంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరి దళారుల డబ్బు వసూళ్లపై ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తారో లేదో చూడాలి.

Updated Date - 2020-09-23T17:02:50+05:30 IST