ltrScrptTheme3

‘డబుల్‌’ లేట్‌ !

Oct 24 2021 @ 23:35PM
గుండ్లకుంట శివారులో నిర్మించిన ఇళ్లు

  • ఏడేళ్లు గడిచిపోయినా కలగానే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
  • సొంతింటి కోసం పేదల ఎదురుచూపులు 
  • పెరిగిన ధరలతో ఇళ్ల నిర్మాణానికి ముందుకురాని కాంట్రాక్టర్లు 


షాద్‌నగర్‌రూరల్‌:  సొంతింటి కోసం పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. డబుల్‌బెడ్‌రూం ఇంటిలోకి అడుగుపెట్టాలనుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉండి గూడులేని ప్రతి పేదవాడికి అన్నిసౌకర్యాలతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు అమలుకునోచుకోవడం లేదు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని చాలాగ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లల్లో పేదలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు చేసినా.. నిర్మాణం విషయంలో అడుగు ముందుకు పడలేదు. 


రెండో పర్యాయం 2700 ఇళ్లు మంజూరు

కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత షాద్‌నగర్‌ నియోజకవర్గానికి రెండోపర్యాయం 2700 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశారు. అందులో షాద్‌నగర్‌ పట్టణానికి 1700ఇళ్లు, ఆరు మండలాలకు 1000ఇళ్లు మంజూరయ్యాయి. షాద్‌నగర్‌ పట్టణానికి మంజూరైన ఇళ్లను హజీపల్లి శివారులోని గుండ్లకుంట శివారు, సోలీపూర్‌ శివారు, దూసకల్‌ శివారుల్లో 1700 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. నందిగామలో 120ఇళ్లు, తిమ్మాపూర్‌లో 60ఇళ్లు కూడా పూర్తి కావచ్చాయి. 


మండలాలకు మంజూరైన ఇళ్లు

జిల్లేడు-చౌదరిగూడ మండలంలోని జిల్లేడుకు 60 ఇళ్లు, తూంపల్లికి 20, ఎదిర 20, పెద్దఎల్కిచర్ల 20, రావిర్యాల 20 ఇళ్లు మంజూరయ్యాయి. నందిగామ మండలంలోని వీర్లపల్లి గ్రామానికి 20, రంగాపూర్‌కు 25, మేకగూడ 30, నందిగామ 120, నర్పప్పగూడ 20, మామిడిపల్లి 20, కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్‌కు 60, మల్లాపూర్‌కు 20, గూడూర్‌కు 20, ఇన్మూల్‌నర్వ 40, కేశంపేట మండలంలోని అల్వాల్‌కు 20, లింగందన 10, నిడదవెల్లి 30, లేమామిడి 20, పుట్టోనిగూడ 10, కొందుర్గు మండలంలోని ఆగిర్యాలకు 20, వెంకిర్యాల 20, మహదేవ్‌పూర్‌ 30, ముట్పూర్‌ 20, టేకులపల్లి 20, చెర్కుపల్లి 20 ఇళ్లు మంజూరయ్యాయి. ఇళ్ల నిర్మాణం మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. దేవునిపల్లి గ్రామంతోపాటు గ్రామ పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడలో ఇళ్లులేని పేదలు కూలిపోయిన ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రంగారెడ్డిగూడలో చెన్నయ్య, అతని సోదరుడు శిథిలావస్థకు చేరిన ఇంటిలో కాలం గడుపు తున్నారు. దేవునిపల్లి గ్రామంలో కూడా ప్లాస్టిక్‌ కవర్లు ఇంటిపై కప్పుకుని నివసిస్తున్నారు. తమకు ఇల్లు కావాలని ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో పేదలు ఉన్నారు.


డంపింగ్‌ యార్డు పక్కన డబుల్‌ ఇళ్లు

సోలీపూర్‌ శివారులో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పక్కనే డంపింగ్‌ యార్డు ఉంది. అక్కడి నుంచి దాన్ని త్వరగా ఎత్తివేయాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎలికట్ట-షాద్‌నగర్‌ మధ్యలో నూతనంగా డంపింగ్‌యార్డు నిర్మాణం చేపట్టారు. అక్కడ పనులను త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు.


ముందుకురాని కాంట్రాక్టర్లు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. పెరిగిన స్టీల్‌, సిమెంట్‌ ధరలతో తాము ఇళ్ల నిర్మాణం చేపట్టలేమని చేతులెత్తేస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షల 4వేలు చెల్లిస్తుంది. అందులో 12శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా డబ్బుతో ఇంటి నిర్మాణం సాధ్యం కాదని అంటున్నారు. 


ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెతలు 

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సంగతి అటుంచితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెతలు వర్ణనాతీతం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఏకంగా గృహ నిర్మాణశాఖను సీఎం కేసీఆర్‌ రద్దు చేశారు. దాంతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చాలావరకు అందలేదు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లలోనే లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతిపై విచారణ చేసి లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తామని చెప్పి ఏడేళ్లు గడుస్తున్నా అతీగతి లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి గృహ నిర్మాణశాఖ అధికారుల లెక్కల ప్రకారం నియోజకవర్గంలోని ఉమ్మడి మండలాల్లోని ఫరూఖ్‌నగర్‌, కొందుర్గు, కొత్తూరు, కేశంపేట మండలాల్లో వివిధ దశల్లో ఉన్న 310 ఇళ్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. నిర్మాణం పూర్తయిన 20ఇళ్లకు బిల్లులు చెల్లించాల్సి ఉందని అప్పట్లో సంబంధిత అధికారులు చెప్పారు.


ఇల్లు ఎప్పడు కూలుతుందో తెలియదు

పేదరికం వల్ల ఇల్లు కట్టుకొలేకపోతున్న. ఉన్న ఇల్లు కాస్త కూలిపోయేలా ఉంది. వాన వచ్చినప్పుడు కురవకుండా ఇంటిపై ప్లాస్టిక్‌ కవర్‌ కప్పుకొని కాలం గడుపుతున్నాం. భార్య పిల్లలతో ఇంట్లో పడుకోవాలంటే ఎప్పుడు కూలుతుందోనని భయం వేస్తుంది. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. 

- ద్యాలం మల్లయ్య, రంగారెడ్డిగూడ


డబుల్‌ బెడ్‌రూం మంజూరుచేయాలి

 అన్నదమ్ములం వేరుపడడం వల్ల మేము గుడిసె వేసుకున్నాం. దానిపై ప్లాస్టిక్‌ కవర్‌ కప్పుకొని అందు లోనే ఉంటున్నాం. కూతురుకు పెండ్లి చేయడంతో అల్లుడు వచ్చినా, ఇదే గుడిసెలో ఉండాల్సి వస్తుంది. వర్షం వస్తే రాత్రిళ్లు మేల్కొని ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం డబుల్‌బెడ్‌ రూం ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నా.

- డి. చెన్నయ్య, రంగారెడ్డిగూడFollow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.