ఒక మాస్కు బెటరా.. లేక రెండా...?

ABN , First Publish Date - 2021-04-17T22:21:43+05:30 IST

మాస్కులతో కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చన్న విషయం మనందరికీ తెలుసు! ఒకటికి బదులు రెండు మాస్కులు ధరిస్తే మరింత ప్రభావశీలంగా ఉంటుందని, వైరస్ కణాలను జల్లెడపట్టి దూరంగా ఉంచే సామర్థ్యం రెట్టింపవుతుందని తాజాగా అధ్యయనంలో వెల్లడైంది.

ఒక మాస్కు బెటరా.. లేక రెండా...?

వాషింగ్టన్: మాస్కులతో కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చన్న విషయం మనందరికీ తెలుసు! అయితే.. ఒకటికి బదులు రెండు మాస్కులు ధరిస్తే మరింత ప్రభావశీలంగా ఉంటుందని, వైరస్ కణాలను జల్లెడపట్టి దూరంగా ఉంచే సామర్థ్యం రెట్టింపవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్‌కెరోలినా హెల్త్ కేర్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రెండు మాస్కుల కారణంగా వైరస్ కణాలు.. నోరు, ముక్కులోకి ప్రవేశించలేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వివరాలు జేఏఎమ్ఏ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. 


అయితే..మాస్కుల్లోని పొరల సంఖ్య పెంచడం వల్ల మాత్రమే రక్షణ పెరగదని యూనివర్శిటీ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.  ముక్కు, నోరు చుట్టూ మాస్కు సరిగ్గా అమరేటట్టుగా చూడాలని, ఎటువంటి ఖాళీలు ఏర్పడకుడదని వారు సూచించారు. వివిధ రకాల పదార్థాలతో తయారైన మాస్కులను, వివిధ రకాలుగా పరీక్షించి వారు ఈ విషయాలను వెల్లడించారు. కాటన్ వస్త్రంతో చేసిన మాస్కును, సర్జికల్ మాస్కును కలిపి వినియోగిస్తే మంచి ప్రయోజనం ఉన్నట్టు కూడా ఈ అధ్యయనంలో తేలింది. రెండు మాస్కులు వదులుగా ధరిస్తే ఆశించిన ఫలితం ఉండదని, దీనికి బదులు ముఖానికి సరిగ్గా అమరే ఒక మాస్కు వల్లే ఎక్కువ ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.  

Updated Date - 2021-04-17T22:21:43+05:30 IST