కరోనా సెకండ్ వేవ్‌కు ఈ వైరస్సే కారణమా..?

ABN , First Publish Date - 2021-04-19T20:32:22+05:30 IST

ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్‌కు కారణమేమిటనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏడాదిగా కరోనా నిబంధనలు పాటిస్తున్న ప్రజల్లో క్రమంగా నిర్లక్ష్యం పెరగడంతో కేసులు సంఖ్య పెరుగుతోందనేది ప్రభుత్వం వాదన. అయితే..కొంతమంది నిపుణులు మాత్రం కరోనా డబుల్ మ్యూటెంట్‌యే కేసులు విపరీతంగా పెరగడానికి కారణమని చెబుతున్నారు.

కరోనా సెకండ్ వేవ్‌కు ఈ వైరస్సే కారణమా..?

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. గత రెండు వారాల్లో ఏకంగా 25 లక్షల కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 4న దేశంలో తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటింది. నాటి నుంచీ నేటి వరకూ దాదాపు ప్రతిరోజు లక్షల పైచిలుకు రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఇక గత నాలుగు రోజుల్లో రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 2 లక్షల మార్కు దాటుతోంది. సోమవారం ఒక్క రోజే ఏకంగా 2.75 లక్షల కొత్త కరోనా కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. కరోనా ఉధృతి ఈ స్థాయిలో ఉండటంతో ఆస్పత్రి బెడ్లు, ఆక్సిజన్‌కు కొరత ఏర్పడుతోంది.  చికిత్సకు అవసరమైన అత్యవసర మందులతో పాటూ టీకాలకు కటకటగానే ఉంది. అయితే.. ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్‌కు కారణమేమిటనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏడాదిగా కరోనా నిబంధనలు పాటిస్తున్న ప్రజల్లో క్రమంగా నిర్లక్ష్యం పెరిగి ప్రస్తుత స్థితికి దారితీసిందనేది ప్రభుత్వ వాదన. అయితే..కొంతమంది నిపుణులు మాత్రం కరోనా డబుల్ మ్యూటెంటే కేసులు విపరీతంగా పెరగడానికి కారణమని చెబుతున్నారు.


అసలేమిటీ డబుల్ మ్యూటెంట్...

వైరల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్న సమయంలో దీనికి కారణమైన వైరస్‌లు జన్యుపరమైన మార్పులకు లోనవుతాయి. ఇలా మార్పు చెందిన వైరస్ కొన్ని సందర్భాల్లో కొత్త లక్షణాలు సంతరించుకుని ఓ కొత్త వేరియంట్‌గా మారుతుంది. కాగా.. మహారాష్ట్రలో అధికారులు జనవరిలో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా, అమెరికా(కాలిఫోర్నియా) వేరియంట్లకు, ఈ వైరస్‌కు మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు వైరస్‌లతో పోలికలున్న తాజాగా వేరియంట్‌లో ఒకేసారి రెండు జన్యుమార్పులు(మ్యూటేషన్లు) చోటుచేసుకున్నాయి. శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను బీ.1.617 అని పిలుస్తున్నారు. 


డబుల్ మ్యూటెంట్‌తో ఎక్కువ ప్రమాదమా..?

కరోనా వైరస్ శరీరంలోని కణాల్లోకి ప్రవేశించాలంటే స్పైక్ ప్రోటీన్ అత్యంత కీలకం. బీ.1.617లోని రెండు మ్యూటెషన్లు ఈ స్పైక్ ప్రోటీన్‌లో కొన్ని మార్పులు తెచ్చాయి. దీని కారణంగా డబుల్ మ్యూటెంట్‌..రోగనిరోధక వ్యవస్థలోని యాంటీబాడీలకు చిక్కకుండా మరింత వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం సంతరించుకుంది. అయితే.. ఈ మార్పుల వల్ల వ్యాధి తీవ్రత పెరిగిందా లేక కేసుల సంఖ్య పెరిగిందా అనేది స్పష్టంగా నిరూపించగలిగే గణాంకాలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు.


దీని వ్యాప్తి ఏమేరకు..?

ఈ అంశంపై కూడా శాస్త్రజ్ఞుల్లో పూర్తి స్పష్టత లేదు. వైరస్‌ల జన్యుక్రమాన్ని కనుక్కోవడంలో భారత్ ఐరోపా దేశాలతో పోలిస్తే వెనకబడే ఉంది. దీంతో.. కొత్త వేరియంట్ ఏ మేరకు దేశంలో వ్యాపించిందనేది అంచనా వేయడం కష్టంగా మారింది. అయితే..నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో 361 వైరస్ శాంపిళ్ల జన్యుక్రమాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి తెలుసుకోవడంతో మహారాష్ట్రలో ఇటీవల కాలంలో నమోదైన కేసుల్లో 60 శాతం ఈ వైరస్ వల్లేనని బయటపడింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి వివిధ ప్రాంతాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. కాబట్టి.. మహారాష్ట్రలోని డబుల్ మ్యూటెంట్ ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు 10 రాష్ట్రాల్లో ఈ డబుల్ మ్యూటెంట్ కారణంగా కేసులు పెరిగాయనేది ప్రస్తుతమున్న వాదన. 


సెకండ్ వేవ్‌కు ఈ వైరస్‌యే కారణమా...?

ప్రస్తుత పరిస్థితికి డబుల్ మ్యూటెంట్ కారణమనే వాదనవైపే అధిక శాతం నిపుణులు మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో శాంపిళ్లను సేకరించి వైరస్ కణాల జన్యుక్రమాన్ని నిర్ధారించాకే తుది నిర్ణయానికి రావాలని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి గణాంకాలు అందుబాటులేని పరిస్థితుల్లో సెకండ్ వేవ్  కారణమేమిటనేది స్పష్టంగా చెప్పలేమంటున్నారు. అయితే.. ఈ రెండు మార్పుల కారణంగా రోగ నిరోధకశక్తిని నుంచి తప్పించుకునే శక్తి వైరస్‌ సంతరించుకుందనే దానిపై నిపుణుల్లో ఏకాభ్రిప్రాయం ఉంది.


టీకాలు డబుల్ మ్యూటెంట్‌ను అడ్డుకోగలవా..?

దీనిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యాంటీబాడీలను నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్న డబుల్ మ్యూటెంట్‌పై టీకా ప్రభావం కొంత తక్కువగా ఉంటుందనేది కొందరి వాదన. మరి కొందరు మాత్రం దీంతో ఏకీభవించట్లేదు. ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించడం లేదని, కరోనా వ్యాధి తీవ్రత తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. దీంతో..బాధితులకు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం తగ్గడంతో పాటూ మరణాలు కూడా తగ్గుతాయని వారు చెబుతున్నారు. కాబట్టి..కరోనాను ఎదుర్కొనేందుకు టీకానే అత్యంత ప్రభావశీలమైన ఆయుధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

 

Updated Date - 2021-04-19T20:32:22+05:30 IST