పెద్దమాసాన్పల్లిలో జీప్లస్ వన్ డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద వసతులు లేని దృశ్యం
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం
పట్టించుకోని అధికారులు
ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు
తొగుట, మార్చి 27 : గూడులేని నిరుపేదలకు సొంత ఇంటి కలనెరవేర్చడం కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. అధికారుల వైఫల్యం మూలంగా తొగుట మండలంలో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. మండలంలోని ఎల్లారెడ్డిపేటలో 25, పెద్దమాసాన్పల్లిలో 20, బండారుపల్లిలో 20 జీప్లస్ వన్, గుడికందుల, కానుగల్, వెంకట్రావ్పేట, గోవర్ధనగిరి తదితర గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల 4 వేలు, కనీస వసతులైన డ్రైనేజీ, సీసీరోడ్లు, తాగునీరు తదితర సౌకర్యాల కోసం అదనంగా మరో రూ.75 వేలను కలిపి మొత్తం రూ.5.79 లక్షలను మంజూరుచేసింది. కాగా 2018-19లో కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ కనీస వసతులైన పనులు చేపట్టకుండానే ఇళ్ల్ల నిర్మాణం పూర్తిచేశాడు. ఇదిలా ఉండగా గోవర్ధనగిరి, వెంకట్రావ్పేట గ్రామాల్లో నిర్మాణంతో పాటు మౌలిక వసతులు పూర్తిచేయడంతో లబ్ధిదారులకు అందజేశారు. కానీ పెద్దమాసాన్పల్లి, ఎల్లారెడ్డిపేట, బండారుపల్లిలో కనీస వసతులు కల్పించకపోవడంతో ఇళ్లలోకి వెళ్లిన లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై పీఆర్ ఏఈ రామకృష్ణారెడ్డిని వివరణ కోరగా ఎల్లారెడ్డిపేట, పెద్దమాసాన్పల్లి, గుడికందుల గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకున్నది వాస్తవమేనని చెప్పారు. సంబంధిత కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులు అందజేసి చర్యలు తీసుకుంటామన్నారు.