సందేశం తీర్చని సందేహాలు

ABN , First Publish Date - 2020-07-01T07:21:11+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగ ళవారం సాయంత్రం 4గంటలకు ప్రజలకు సందేశం ఇస్తారని ముందస్తు సమాచారం అందినప్పుడు ఆయన అత్యంత బృహత్తరమైన ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపించాయి...

సందేశం తీర్చని సందేహాలు

భారత్- చైనాల మధ్య నిజంగా యుద్ధం జరిగే అవకాశాలు లేకపోయినప్పటికీ ఆ పేరుతో జాతీయవాదాన్ని వ్యాప్తి చేసేందుకు మోదీ సర్కార్ తీవ్రయత్నాలు చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ అది ప్రజలు నమ్మేలా చేయడం, రేగుతున్న ప్రశ్నలకు జవాబివ్వడం అంత సులభం కాదు. ఇప్పటికే నెహ్రూలా మోదీ తప్పిదాలు చేస్తున్నారని వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. నెహ్రూకు దేశభక్తి బ్రాండ్ అవసరం కాలేదు కాని మోదీకి దేశభక్తి బ్రాండ్ అవసరం కదా?


ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగ ళవారం సాయంత్రం 4గంటలకు ప్రజలకు సందేశం ఇస్తారని ముందస్తు సమాచారం అందినప్పుడు ఆయన అత్యంత బృహత్తరమైన ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కొంతమంది మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని భావిస్తే, మరికొందరు చైనాపై కీలక ప్రకటన ఉంటుందని ఊహించారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ప్రధానమంత్రి దేశానికి ఇచ్చిన ఆరవ సందేశం ఇది. కానీ గత 50 రోజులుగా ఆయన ప్రజలకు ఎలాంటి సందేశమూ ఇవ్వలేదు. అంతమాత్రాన ప్రజలకు వచ్చిన లోటేమీ లేదు. అఖిలపక్ష సమావేశం పేరుతోనూ, వీడియో కాన్ఫరెన్స్ పేరుతోనూ ఆయన అడపాదడపా ఏదో ఒక రూపంలో ప్రజలకు తన వాణిని వినిపిస్తూనే ఉన్నారు. ఆదివారం ఆయన ‘మన్ కీ బాత్’ పేరుతో సుదీర్ఘమైన ప్రసం గాన్ని చేశారు. అది ఆకాశవాణిలో చేసిన ప్రసంగం అయినప్పటికీ దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. మళ్లీ మంగళవారం ఆయన దూరదర్శన్‌లో సందేశం ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చింది?


సరిహద్దుల్లో ఏమి జరుగుతుందన్న విషయం ప్రభుత్వం చెప్పకపోయినప్పటికీ ఆధునిక సమాజంలో జరిగిన ఘటనలు దాచేస్తే దాగని సత్యాలు. లద్దాఖ్‌లో 423 మీటర్ల లోపలికి చైనా చొచ్చుకువచ్చిందని, హెలిపోర్టు కూడా నిర్మించిందని, ఫింగర్ 4-8 ప్రాంతాల్లో భారత పెట్రోలింగ్‌ను అడ్డుకుంటోందని జాతీయ పత్రికలు ఉపగ్రహ చిత్రాలు తెప్పించుకుని మరీ రాశాయి. మరో వైపు భారత్ కూడా సైన్యంతో పాటు క్షిపణులను ప్రయోగించే ట్యాంకుల్ని మోహరించిందని వార్తలు వస్తున్నాయి. చైనా సరిహద్దుల్ని అతిక్రమించలేదన్న ప్రధానమంత్రి ప్రకటనపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత వాటికి గట్టిగా జవాబిచ్చే బదులు రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ఏదో ఒక చైనా సంస్థ నిధులు ఇచ్చే విషయంపై సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడే రాద్ధాంతం సృష్టించడం అనుమానాలు కలిగిస్తోంది. ఈ దేశంలో అక్రమంగా ఏ సంస్థకైనా విదేశాలనుంచి నిధులు వచ్చి ఉంటే ఆ విషయంలో ప్రకటన చేసి తగిన చర్య తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎలాగూ ఉంటుంది. కాని దాని బదులు బిజెపి నేతలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌పై రచ్చకెక్కి మోదీ చైనాపై చేసిన ప్రకటన నుంచి దృష్టి మళ్లించే యత్నం చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా వెనక్కు తగ్గకుండా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, వాటి అనుబంధ సంస్థలు చైనా కమ్యూనిస్టు పార్టీతో ఏర్పర్చుకున్న సంబంధాలు, పిఎం కేర్ ఫండ్‌కు చైనా కంపెనీలనుంచి వచ్చిన విరాళాల గురించి ప్రస్తావించారు. రెండు పార్టీలు వీధుల్లో కీచులాటలాడుకుని, దేశభక్తిపై పరస్పరం శంకించుకుని బురద జల్లుకోవడం వల్ల అసలు సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉన్నదన్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలిసే అవకాశాలు లేకుండా పోయాయి. మధ్య మధ్యలో ఏదో ఒక సందర్భంలో ‘సరిహద్దుల్లో కన్ను వేసిన వారికి బుద్ధి చెబుతాం..’ అని ప్రకటిస్తే సరిపోతుందని ప్రధాని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కార్గిల్‌లో చొరబాటు జరిగినప్పుడు విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ప్రతినిధులు చాలా చురుకుగా ఉండి సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను వివరించేవారు. కొన్ని పర్వత ప్రాంతాలను పాకిస్థాన్ ఆక్రమించుకోవడం, మళ్లీ భారత్ వాటిని స్వాధీన పరుచుకోవడాన్ని కళ్లకు కట్టినట్లు పిఐబిలో ప్రతి రోజూ చెప్పేవారు. పైగా ప్రతిపక్ష నేతల సమావేశంలో రక్షణ శాఖ అధికారులు పాల్గొని చిత్రపటాలతో వివరించేవారు. ప్రతిపక్ష నేతలతో కొన్ని అంతరంగిక సమావేశాలు కూడా జరిగేవి. కాని గత నెల నుంచీ సరిహద్దుల్లో కీలక పరిణామాలు జరుగుతున్నా ఏంజరుగుతుందన్న విషయంలో అస్పష్టత నెలకొంది.


ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి తాజా సందేశంలో భారత- చైనా సంఘర్షణ తీరుతెన్నులను వివరిస్తారని ఊహించిన వారికి కొంత నిరాశే కలిగింది. పోనీ ప్రతిపక్ష సభ్యులను విశ్వాసంగా తీసుకుని ఆంతరంగిక సమావేశాలు నిర్వహించినా బాగుండేది. విచిత్రమేమంటే నెహ్రూ, వాజపేయి హయాంలోలాగా ప్రభుత్వాలు పారదర్శకత పాటించడం లేదు. ప్రతిపక్షాల్లో కూడా ప్రామాణికత లేకుండా పోయింది. భారత- చైనా యుద్ధ సమయంలో బిజెపి నేత అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వాన్ని చీల్చిచెండాడడమే కాకుండా పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయించారు. మాజీ రక్షణ మంత్రి శరద్ పవార్ అన్నట్లు 45వేల చదరపు కిలోమీటర్లు చైనాకు ధారాదత్తం చేసిన కాంగ్రెస్‌కు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత లేకపోవచ్చు. నిజానికి కాంగ్రెస్ హయాంలో జరిగిన అనేక పాపాల మూలంగానే ఆ పార్టీ ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడమే కాకుండా ప్రశ్నించలేని, నిలదీయలేని స్థితిలో పడిపోయింది. అయినా రాహుల్ మొదలు కాంగ్రెస్ నేతలు పలువురు శరపరంపరలుగా చేస్తున్న వ్యాఖ్యలు, సంధిస్తున్న ప్రశ్నలు ప్రభుత్వంలో ఉన్న వారిని ఎంతోకొంత ఆత్మరక్షణలో పడవేసినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌కు జవాబు చెప్పడం అనవసరమని సర్కార్ భావిస్తుండవచ్చు కాని భారత దేశంలో చైనా రాయబారిని ఇంటర్వ్యూ చేసిన పీటీఐ వార్తా సంస్థపై విరుచుకుపడడం దేనికి? చైనాతో ఘర్షణను భారత దేశమే కవ్వించిందని, భారత దేశమే సరిహద్దును అతిక్రమించిందని పీటీఐతో చైనా రాయబారి అన్నారు. చైనా సరిహద్దు అతిక్రమించిందని ప్రధానమంత్రి కూడా అనలేదు కదా.. ఇంతకీ భారత సైనికులు ఎక్కడ మరణించారు? వారే చైనా భూభాగంలోకి వచ్చి ఘర్షణ పడ్డారన్న చైనా రాయబారి చేసిన బూటకపు ప్రచారాన్ని వాస్తవాలతో ఖండించేందుకు ప్రభుత్వానికి ఏది అడ్డుపడింది? అలా చేసే బదులు పీటీఐకి ప్రసారభారతి చందాలు ఆపివేస్తామని హెచ్చరించడం, ఆ సంస్థను దేశ వ్యతిరేక సంస్థగా చిత్రించడం సరైనదా? ఈ దేశంలో ప్రశ్నించిన వారందర్నీ దేశ వ్యతిరేకులుగా చిత్రిస్తారా? ఆనాడు నెహ్రూను ప్రశ్నించిన వాజపేయిని కాని, కార్గిల్ యుద్ధ సమయంలో వాజపేయిని ప్రశ్నించిన వారిని కాని ఇలా దేశ వ్యతిరేకులుగా ప్రకటించి ఉంటే ఇవాళ ఎవరు మిగిలేవారు?


ఈ పరిణామాల రీత్యా చైనాతో సంఘర్షణ విషయంలో మోదీ ప్రభుత్వం గుంభనంగానే వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పాకిస్థాన్ విషయంలో మీసాలు దువ్వినట్లుగా చైనా విషయంలో వ్యవహరించడం అంత సులభం కాకపోవచ్చు. చైనా క్రికెట్ ఆడదు కనుక క్రికెట్ మ్యాచ్‌లు రద్దు చేసే ప్రసక్తే తలెత్తదు. చైనాకు సంబంధించిన కొన్ని యాప్‌లను నిషేధించినంత మాత్రాన చైనా వ్యాపార ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రంగా మనం నిలదొక్కుకోగలిగిన పరిస్థితి లేదు. ఫార్మాస్యూటికల్స్ నుంచి ఎలెక్ట్రానిక్స్ వరకు చైనా దిగుమతులపై ఆధారపడిన మనం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని వాస్తవం చేయడం అంత సులభం కాదని, స్వదేశీ ఉత్పత్తిని పెంచేందుకు పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరచాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు అన్నారు. ప్రధానమంత్రి కొంత కాలంగా ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతున్నారు కాని దాన్ని సార్థకం చేసేందుకు ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉన్నది. భారత్- చైనాల మధ్య నిజంగా యుద్ధం జరిగే అవకాశాలు లేకపోయినప్పటికీ ఆ పేరుతో జాతీయవాదాన్ని వ్యాప్తి చేసేందుకు మోదీ సర్కార్ తీవ్రయత్నాలు చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ అది ప్రజలు నమ్మేలా చేయడం, రేగుతున్న ప్రశ్నలకు జవాబివ్వడం కూడా అంత సులభం కాదు. ఇప్పటికే నెహ్రూలా మోదీ తప్పిదాలు చేస్తున్నారని వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. నెహ్రూకు దేశ భక్తి బ్రాండ్ అవసరం కాలేదుకాని మోదీకి దేశభక్తి బ్రాండ్ అవసరం కదా?


ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే కోట్లాది వలస కార్మికులు కడగండ్లు పాలైనప్పుడు నోరు విప్పని మోదీ సర్కార్ క్రమంగా పేదల అనుకూల ప్రభుత్వంగా చిత్రించుకోవడానికి తీవ్రయత్నాలు చేస్తోంది, ఇటీవలే బిహార్‌లో గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన, ఉత్తర ప్రదేశ్‌లో ఆత్మనిర్భర్ రోజ్ గార్ యోజన పేరుతో ప్రత్యేక ఉపాధి పథకాలు ప్రకటించి వలసకార్మికులకు స్థానికంగానే ఉపాధి లభించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ దేశంలో 80కోట్లమంది ప్రజలకు 5కిలోల చొప్పున గోధుమలు, బియ్యం, కిలో పప్పు నవంబర్ వరకు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రధాని మోదీ మంగళవారం నాడు ప్రకటించారు. అంటే ఈ దేశంలో 80కోట్ల మంది ప్రజలు నెలకు 5 కిలోల చొప్పున తిండి ఖర్చు భరించలేని స్థితిలో ఉన్నారా? ఇది ఏ పరిస్థితికి అద్దం పడుతోంది? మోదీ తన సందేశంలో భాగంగా ఇప్పటి నుంచీ నవంబర్ వరకు వచ్చే పండుగల పేర్లను ప్రధానంగా బిహార్, యుపిలలో జరుపుకునే ఛట్ పూజ పేరుతో సహా ప్రధాని ప్రస్తావించారంటే ప్రజల మనోభావాలను అనుకూలంగా మార్చుకునేందుకే కావచ్చు. ఏమైనా దేశవ్యాప్తంగా అత్యధిక వలస కార్మికులున్న బిహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న విషయం ఈ నేపథ్యంలో గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు రేకెత్తినప్పుడల్లా, సమస్యలు చుట్టుముట్టినప్పుడల్లా ప్రజల మనోభావాలనో, పేద ప్రజల ఆకలినో ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం భారత దేశ రాజకీయ పార్టీలకు బాగా అబ్బిన విద్య. భారతీయ జనతా పార్టీ ఈ విద్యలో ఆరితేరిందని చెప్పక తప్పదు. ఎటొచ్చీ నేతలు ప్యాకేజీల పేరిట విడుదల చేసే కోట్లాది రూపాయలను పన్నులు చెల్లించేవారు భరించాల్సి ఉంటుంది. 


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-07-01T07:21:11+05:30 IST