ఆవు పేడతో అద్భుతాలు చేస్తూ.. అతను ప్రతి నెలా ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-03-16T14:03:48+05:30 IST

ఇటీవల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్..

ఆవు పేడతో అద్భుతాలు చేస్తూ.. అతను ప్రతి నెలా ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..

ఇటీవల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఆవు పేడతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్‌ను సమర్పించారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  ఈ బ్రీఫ్‌కేస్‌ను రాయ్‌పూర్‌లోని ఏక్ పహల్ అనే సంస్థ తయారు చేసింది. దీని వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్. అతని బృందం 10 రోజుల కష్టపడి ఈ బ్రీఫ్‌కేస్‌ను సిద్ధం చేసింది. రితేష్ గత 3 సంవత్సరాలుగా ఆవు పేడతో.. చెప్పులు, పర్సులు, బ్యాగులు, విగ్రహాలు, డయాస్, ఇటుకలు, పెయింట్స్ మొదలైన వాటిని తయారు చేస్తున్నాడు. హోలీ కోసం, అతను ఆవు పేడ నుండి పర్యావరణ అనుకూలమైన అబిర్, గులాల్‌ను సిద్ధం చేశాడు. ఈ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఈ ఉత్పత్తులతో అతను ప్రతి నెలా రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. 23 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చాడు. రితేష్ ఈ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. రితేష్ ఉద్యోగం మానేసిన తరువాత గో సేవలో చేరాడు. 41 ఏళ్ల రితేష్ విద్యాభ్యాసం రాయ్‌పూర్‌లో జరిగింది. 2003లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత అతను చాలా కాలం వివిధ కంపెనీలలో పనిచేశాడు. ఈ సందర్భంగా రితేష్ మాట్లాడుతూ.. సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన చాలా కాలంగా తన మదిలో వచ్చిందన్నారు. 



ఆవులు వీధుల్లో తిరుగుతూ చెత్త తినడం వల్ల అనారోగ్యానికి గురవుతాయి. ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఇటువంటి పరిస్థితిలో వాటి కోసం ఏదైనా చేయాలనుకున్నాను. అందుకే 2015లో ఉద్యోగం మానేసి గోశాలలో చేరి గోసేవ చేయడం ప్రారంభించాను. అక్కడ సుమారు 3 సంవత్సరాలు పనిచేశానన్నారు. జైపూర్, హిమాచల్‌లలో పేడ నుండి పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేయడానికి సంబంధించి పలు  ప్రాజెక్ట్‌లలో పని చేసే అవకాశం నాకు లభించింది. పాలు ఇచ్చే ఆవులు మాత్రమే కాకుండా పాలు ఇవ్వని ఆవుల వలన చాలా ఉపయోగముందని అప్పుడు గ్రహించాను. ఆవు పేడతో ఎన్నో రకాల విలువైన ఉత్పత్తులను తయారు చేయవచ్చని తెలుసుకున్నానన్నారు.


ఇంతలో 2018-19 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గోధన్ మోడల్‌ను ప్రారంభించింది. రితేష్.. రాయ్‌పూర్‌కు చెందిన గోధన్‌లో చేరాడు. దీని తరువాత గో సేవతో పాటు, ఆవు పేడ నుండి పర్యావరణ అనుకూల ఉత్పత్తులను సిద్ధం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. దీనిలో శిక్షణ కోసం అతను జైపూర్, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాడు. అక్కడ రితేష్ ఆవు పేడతో తయారు చేసే ఉత్పత్తులు, వాటి ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాడు. తరువాత రాయ్‌పూర్‌కు వచ్చి గోధన్‌లో  పని చేయడం ప్రారంభించాడు. రాయ్‌పూర్‌కు వచ్చిన తర్వాత స్థానికులతో కలిసి ఓ గ్రూప్‌ని ఏర్పాటు చేశానని అని రితేష్ చెప్పాడు. ఇందులో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆవు పేడతో వివిధ ఉత్పత్తులను తయారు చేసేందుకు వారికి శిక్షణ ఇచ్చాడు. వారికి అవసరమైన ముడిసరుకు అందించి, ఆవు పేడతో విగ్రహాలు, దీపాలు ఇటుకలను తయారు చేయడం ప్రారంభించాడు. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఈ ఉత్పత్తులను ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు పంపారు. ప్రజాదరణతో పాటు పాటు మంచి లాభాలు కూడా దక్కాయి. కరోనా సమయంలో దహన సంస్కారాల నిర్వహణకు కలపకు డిమాండ్ పెరిగింది. దహన సంస్కారాలకు కలపకు బదులు ఆవు పేడతో ఏదైనా తయారు చేయవచ్చనే ఆలోచన రితేష్‌కు రావడంతో ఆవు పేడతో కలపను తయారు చేయడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు 7 వేలకు పైగా దహన సంస్కారాలకు ఆవు పేడతో చేసిన కలపను అందించాడు. ఇటీవల రితేష్.. ఆవు పేడ నుండి పర్యావరణ అనుకూలమైన రంగులను హాలీ వేడుక కోసం సిద్ధం చేశాడు.  దేశమంతటా వీటిని మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం, 13 మంది మహిళలు,10 మంది పురుషులు రితేష్ దగ్గర పని చేస్తున్నారు. అతని గోధన్‌లో 400కుపైగా ఆవులు ఉన్నాయి.



Updated Date - 2022-03-16T14:03:48+05:30 IST