పాలిటిక్స్‌ కన్నా ప్రొఫెషన్‌ బెటరనుకున్నా

Published: Fri, 07 Feb 2020 18:26:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పాలిటిక్స్‌ కన్నా ప్రొఫెషన్‌ బెటరనుకున్నా

డాక్టర్‌గా ఉండటమే బెస్ట్‌

దేశాన్ని మార్చడం ముగ్గురి వలల్లనే అవుతుంది

రోగులు క్షేమంగా ఇంటికెళ్లడం సంతోషాన్నిస్తుంది

ఓపెన హార్ట్‌ విత ఆర్కేలో కిమ్స్‌ సీఈవో డాక్టర్‌ భాస్కరరావు


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో అతి పెద్ద ఆసుపత్రుల గ్రూపుల్లో కిమ్స్‌ ఒకటి. అతి కొద్ది కాలంలోనే అగ్రశ్రేణి ఆసుపత్రిగా ఎదిగిన కిమ్స్‌ సీఈఓ డాక్టర్‌ భాస్కరరావుతో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ 7-7-14న ఏబీఎనలో ప్రసారమయింది. ఆ వివరాలు...ఆర్కే: వెల్‌కం టు ఓపెన్‌హార్ట్‌. నమస్కారం డాక్టర్‌ గారు

భాస్కరరావు: నమస్కారం


ఆర్కే: డాక్టర్‌గా పాపులర్‌గా అవటం, ఒక సంస్థను నడపటం వేర్వేరు అంశాలు. వీటిని మీరు ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు?

భాస్కరరావు: డాక్టర్‌గా వృత్తి ప్రారంభించినప్పుడు- పెద్ద డాక్టరు అవ్వాలి. ఎక్కువ సర్జరీలు చేయాలని ఉండేది. పెద్ద ఆసుపత్రి కట్టాలని నాకు మొదట లేదు. ఆ తర్వాత అనుకోకుండా ఆసుపత్రి స్థాపించాను.


ఆర్కే: డాక్టర్‌గానే మీకు సంతృప్తి ఎక్కువంటారు?

భాస్కరరావు: అవును. అడ్మినిస్ట్రేషన్ అనేది థాంక్‌లెస్‌ జాబ్‌. ఎవ్వరినీ సంతృప్తి పర్చలేం. పేషెంట్లు అయితే నూటికి 98 మందికి న్యాయం చేయగలం. అందుకే డాక్టర్‌గా ఉండటమే బెస్ట్‌!


ఆర్కే: ఇప్పుడు రోజుకు ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారు?

భాస్కరరావు: రెండు, మూడు ఆపరేషన్‌లు చేస్తున్నాను. రోజూ దాదాపు ఏడు గంటలపాటు సర్జరీల్లో బిజీగా ఉంటాను. నాలుగైదు గంటలు అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తాను. ఓ అరగంట హాస్పిటల్‌లో రౌండ్స్‌ వేస్తాను.


ఆర్కే: ఎన్ని వేల ఆపరేషన్‌లు చేశారు?

భాస్కరరావు: నేను సొంతంగా 16వేల ఆపరేషన్‌లు చేశాను. నేను ఇన్‌వాల్వ్‌ అయిన ఆపరేషన్‌లు స్టూడెంట్‌ లైఫ్‌నుంచి అసిస్ట్‌ చేసిన కేసులతో సహా 30వేలదాకా ఉంటాయి.


ఆర్కే: ఎలాంటి ఆపరేషన్లు చేసినప్పుడు తృప్తి అనిపిస్తుంది?

భాస్కరరావు: చిన్నపిల్లలకు సర్జరీలు చేయటం చాలా కష్టం. అలాంటివి చేసినప్పుడు తృప్తిగా అనిపిస్తుంది. కొన్ని ఎమర్జెన్సీలుంటాయి. ఆ టైమ్‌లో చేయకపోతే ప్రాణాపాయం ఉంటుంది. అలాంటి వారికి ఆపరేషన్‌లు చేసి వారు సక్సెస్‌పుల్‌గా ఇంటికెళ్లినపుడు చాలా సంతోషంగా ఉంటుంది.


ఆర్కే: కొందరు డాక్టర్లు కేసులను ఎందుకు రిజెక్ట్‌ చేస్తున్నారు? బతికినా బతకకపోయినా తన వద్దకు వచ్చిన వారిని కాదనకుండా చేయాలి కదా!

భాస్కరరావు: క్రిటికల్‌ కేసులను హ్యాండిల్‌ చేయాలంటే సర్జన్‌ ఒకడే సరిపోడు. ఒక వ్యవస్థ ఉండాలి. మానవ వనరులు ఉండాలి. మౌలిక సదుపాయాలు ఉండాలి. టెక్నాలజీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు కేసు ఫెయిలయినా పేషెంట్లు అర్థం చేసుకుంటారు. లేకపోతే మనకు కూడా గిల్టీగానే ఉంటుంది.


ఆర్కే: హాస్పిటల్‌ సక్సెస్‌ రేటు దెబ్బతింటుందనే భయంతో క్రిటికల్‌ కేసులను పుచ్చుకోరనే అపవాదు కూడా ఉంది కదా!

భాస్కరరావు: బాగా అనుభవమున్న సర్జన్‌ అయినా, మౌలిక సదుపాయాలు లేకపోతే రిజెక్ట్‌ చేస్తారు.


ఆర్కే: నీలోఫర్‌ హాస్పిటల్‌లో ఎక్కువ మంది పిల్లలు చనిపోతూ ఉంటారు. అందరూ తిరస్కరించిన కేసులను మా దగ్గరకు తీసుకువస్తారు.. వారు చనిపోతే మా అకౌంట్‌లో వేస్తారని వారు అంటూ ఉంటారు..

భాస్కరరావు: అవును. కార్పొరేట్‌ ఆసపత్రుల్లో ఖర్చును భరించలేనివారు ఉంటారు. వారు ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వెళ్తారు. ఆపరేషన్‌ చేసిన తర్వాత గాడ్జెట్స్‌ అవసరం. సర్కారు ఆసుపత్రుల్లో ఆ టెక్నాలజీ లేదు.


ఆర్కే: కిమ్స్‌ పెట్టాలని ఎందుకు అనుకున్నారు?

భాస్కరరావు: నేను రంగరాయ ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుకున్నాను. ఆ తర్వాత ఆసే్ట్రలియా వెళ్లి వచ్చాను. వెల్లూరు హాస్పిటల్‌లో, నిమ్స్‌లో పనిచేశా. మనం ఎంత చేసినా ప్రభుత్వ సంస్థల్లో కొన్ని పరిమితులుంటాయి. అందువల్ల, ఉత్సాహం పోతుంది. వృత్తిలో ఇంకా రాణించాలంటే ప్రయివేటు ఆస్పత్రి పెట్టడం మంచిదని భావించాను. మా నాన్నగారు గుండె సమస్యతో మరణించారు. అందువల్ల ఆయన పేరిట నెల్లూరులో ఒక ఆసుపత్రి ప్రారంభించాను. హైదరాబాద్‌ నుంచి వారానికి ఓ రోజు వెళ్లి సర్జరీలు చేసేవాడిని. దానికి బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత రాజమండ్రిలో పెట్టా. పది మంది స్నేహితులతో కలిసి కిమ్స్‌ ప్రారంభించాను. మొదట్లో 120 బెడ్స్‌ ఉండేవి. ఇప్పుడవి వెయ్యి బెడ్స్‌ అయ్యాయి.


ఆర్కే: మిగతా హాస్పిటల్స్‌తో పోలిస్తే మీ దగ్గర ఫీజు తక్కువ ఉంటుందా?

భాస్కరరావు: మా వద్ద 25 నుంచి 30 శాతం వరకు ఫీజులు తక్కువగా ఉంటాయి.

పాలిటిక్స్‌ కన్నా ప్రొఫెషన్‌ బెటరనుకున్నా

ఆర్కే: కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగుల్ని పిప్పి పీల్చేస్తున్నాయనే అపవాదు ఉంది. దాని నుంచి మీరు బయటపడ్డారా?

భాస్కరరావు: కార్పొరేట్‌ హాస్పిటల్‌కు వెళితే దోపిడీ అనీ, అన్నీ అమ్మేసుకోవాల్సిందేననే నానుడి ఉంది. మా హాస్పిటల్‌లో అలా ఉండదు. నేను నెలకు అరవై లక్షల రూపాయల వరకు డిస్కౌంట్ల రూపంలో ఇస్తుంటాను. ఏమైనా ప్రజల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ గురించిన చైతన్యం రావాల్సి ఉంది. మనం తాగే కప్పు కాఫీ ఖర్చు నెలకు 600 రూపాయలు. అంటే సంవత్సరానికి 7,200. ఇదే సొమ్ముతో ఒక కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల వరకూ మెడిక్లెయిమ్‌ ఇన్సూరెన్స్‌ చేయించుకోవచ్చు. బైక్‌ కొంటే, ఇల్లు కడితే ఇన్స్యూరెన్స్‌ చేయిస్తాం. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చెల్లించం. ఆరోగ్యం ఉచితంగా అందాలనే భావన బలంగా నాటుకుపోయింది.


ఆర్కే: ప్రస్తుతం ఉన్నవాటిలో బెస్ట్‌ మోడల్‌ ఏమిటి?

భాస్కరరావు: మునుముందు ఇన్స్యూరెన్స్‌ చేసుకోకపోతే సామాన్యులు బతకలేరు. అందువల్ల అందరూ ఇన్సూరెన్స్‌ కట్టాలి. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒత్తిడి ఉండాలి.


ఆర్కే: ఆరోగ్యశ్రీకి మోటివేషన్‌ మీరే కదా?

భాస్కరరావు: అవునండి. రాజశేఖర్‌రెడ్డి గారు నాకు పర్సనల్‌గా తెలుసు. అగర్వాల్‌ గారని హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉండేవారు. ఆయన పట్టుబట్టారు. నా దగ్గరకు మూడు సార్లు వచ్చారు. అలా పుట్టిందే ఆరోగ్యశ్రీ. అయితే కొందరు బాస్కరరావు కోసమే రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడని ఆరోపణలు చేశారు. మన రాష్ట్రంలోని 2 కోట్ల 23 లక్షల కుటుంబాలకు- ప్రతి ఫ్యామిలీకి మూడువేల రూపాయల చొప్పున ఏడువేల కోట్ల రూపాయలు ఇన్స్యూరెన్స్‌ చెల్లిస్తే రోగులందరూ ఏ ఆసుపత్రికైనా వెళ్లి చికిత్స తీసుకోవచ్చునని సూచించాను. చాలా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. అమెరికన్‌లు కూడా పరిశీలించి వెళ్లారు.


ఆర్కే: ఆరోగ్యశ్రీ వచ్చాక కొన్ని హాస్పిటల్స్‌ తాము చేయనివి కూడా చేశామని చెప్పి క్లెయిమ్స్‌ పెట్టుకొని డబ్బు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి అవి మీ దృష్టికి వచ్చాయా?

భాస్కరరావు: అవి అంత తీవ్రమైన ఆరోపణలు కాదండి. మిగతా గవర్నమెంటు పథకాలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ పారదర్శకంగా సాగుతుంది.


ఆర్కే: మీ నేపథ్యమేమిటి? అసలు మెడిసిన్‌ చదవాలని ఎందుకనిపించింది?

భాస్కరరావు: నాది చాలా లోయర్‌ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీ. ముగ్గురు బ్రదర్స్‌ము. ఇద్దరు సిస్టర్స్‌. మా మదర్‌కు పిల్లల్ని చదివించాలనే ఒక బలమైన కోరిక. మా ఊళ్లో 5వత తరగతి వరకే ఉంది. అందుకే మేమంతా మా మామయ్య వాళ్ల ఊరు బుచ్చిరెడ్డిపాలెంలో ఉండి చదువుకున్నాం. చదువు మాకు బాగా అబ్బింది. మా నాన్న గారు కూడా ఆర్థికంగా బాగా సపోర్టు చేసి చదివించారు. మా పెద్దన్నయ్య ఇంజనీరు అయ్యాడు. రెండో బ్రదర్‌ అగ్రికల్చర్‌ బిఎస్సీ. సెకండ్‌ బ్రదర్‌ మెడిసిన్‌ చేద్దామంటే రాలేదు.

 

నేను మూడోవాడ్ని. అప్పటికే మా బ్రదర్‌ కృష్ణయ్య కాంట్రాక్టులు చేసి ఆర్థికంగా బలోపేతమయ్యారు. సపోర్టు ఆయన నుంచి మొదలైంది.! ఆయనకు గవర్నమెంటు జాబ్‌ వచ్చింది. అయితే గవర్నమెంటు జాబ్‌లో చేరితే కుటుంబాన్ని సజావుగా చూడలేరని చదువుకు పెట్టిన అప్పులు తీర్చలేమని, కాంట్రాక్టులు చేస్తూ, కుటుంబాన్ని పైకి తీసుకువచ్చారు. నన్ను డాక్టరును చేయాలని మా బ్రదర్‌కు కోరికగా ఉండేది. మేం ముగ్గురం చదువుకుంటే దాని విలువ తెలిసివచ్చింది. వందల ఎకరాల భూములున్నా ఆ విలువ రాదు.


ఆర్కే: ప్రాక్టీసు చేస్తున్న మీకు సర్పంచి అవ్వాలని ఎందుకనిపించింది?

భాస్కరరావు: పవర్‌ ముగ్గురి వద్ద ఉంటుంది. ఒకరు కలెక్టరు, రెండు సీఎం, మూడు పీఎం. దేశాన్ని మార్చాలనుకుంటే ఈ ముగ్గురికీ నిమిషం కూడా పట్టదు. అయితే, సర్పంచి అయ్యాక మనమేమీ చేయలేమని తెలిసొచ్చింది. రోడ్లు వేసినా, రక్షితనీటి పథకాన్ని నిర్మించినా ఆనందం లేదు. ప్రొఫెషన్‌ బెటరని డిసైడ్‌ అయ్యాను.


ఆర్కే: ఇప్పటికీ మీ అన్నదమ్ములు ముగ్గురూ ఉమ్మడిగానే ఉన్నారా?

భాస్కరరావు: కలిసే ఉన్నాం. ఈ రోజుకు కూడా మా మధ్య డిస్కషన్స్‌, ఆర్గ్యుమెంట్స్‌ జరుగుతుంటాయి. అయినా ఎక్కడా సమస్యలు తలెత్తవు. మా పెద్ద బ్రదర్‌ కృష్ణయ్య మమ్మల్ని చదివించి పెంచారు కాబట్టి ఆయనదే చివరి మాట. వివాదాలు ఎక్కువగా ఆడవాళ్ల దగ్గరి నుంచి వస్తాయి. కాని వారు మమ్మల్ని ప్రభావితం చేయలేక పోయారు. వారు కూడా మమ్మల్ని పట్టించుకోరు. వేర్వేరు ఇళ్లల్లో ఉన్నా ఏదైనా ఆయన చెప్పినట్లు వినాల్సిందే.


ఆర్కే: ఆస్తులన్నీ ఉమ్మడిగానే ఉన్నాయా?

భాస్కరరావు: ఆస్తులు ఎక్కడున్నాయి ఏంటీ అనేది మాక్కూడా తెలియదు. అంతా సంపాదించింది ఆయనే . మేమంతా ఖర్చుపెట్టడమే తప్ప ఎవరికి వారు సంపాదించుకోవటం, అది నాది, ఇది నాది అనే విభజన భావన లేనేలేదు.


ఆర్కే: ఇంట్లో ఆడవాళ్లతో ఏమీ సమస్యలు రావా? మీది అరెంజడ్‌ మ్యారేజా ? లవ్‌ మ్యారేజా?

భాస్కరరావు: మాది అరేంజ్డ్‌ మ్యారేజే. మా బ్రదర్స్‌ ఇద్దరూ బంఽధువులనే చేసుకున్నారు. అందరూ బిగినింగ్‌ నుంచి తె లుసు. నేనొక్కడినే బయటి సంబంధం చేసుకున్నాను. లక్కీగా అందరూ మంచివాళ్లే దొరికారు. అందరూ చాలా క్లోజ్‌గా ఉంటారు. అందుకే ఏ సమస్యలూ లేవు.


ఆర్కే: గురవారెడ్డి గారు మీరు తోడళ్లుళ్లు కదా ? మీరిద్దరికీ కంపాటబులిటీ బాగుంటుందా?

భాస్కరరావు: సొంతంగా పెట్టుకుంటే బాగుంటుందని వెళ్లిపోయి సన్‌షైన్‌ హాస్పిటల్‌ ప్రారంభించాడు. బాగా ఎదుగుతున్నాడు. ఫ్యామిలీ పరంగా కలిసే ఉంటాం.


ఆర్కే: మీ మిసెస్‌ భవనం వెంకట్రాం కూతురు కదా!

భాస్కరరావు: అవును. ఆయన సీఎంగా ఉన్నపుడు నా పెళ్లి అయింది. మాదాల జానకీరాం గారు సంబంధం తెచ్చారు. ఆయన మాకు బంధువు.ఆయనకు ముగ్గురు అల్లుళ్లు ఉన్నా నన్నే ఎక్కువగా ఇష్టపడే వారు.


ఆర్కే: ఇప్పుడు స్టేట్‌ డివైడ్‌ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఎట్లా ఉండబోతోంది. ఆంధ్రాలో ఎలా ఉంటుంది?

భాస్కరరావు: రెండింట్లోనూ బాగుంటుంది. మాకు ఇక్కడ 1000 బెడ్లు ఉన్నాయి. ఆంధ్రాలోనూ వెయ్యి పడకల హాస్పిటల్స్‌ ఉన్నాయి. కొత్తగా, గుంటూరులో గానీ, విజయవాడలో గానీ హాస్పిటల్‌ కట్టాలని చూస్తున్నాం. ఇప్పుడున్న హాస్పిటల్స్‌ను 300 బెడ్‌ల ఆసత్రిగా తీర్చిదిద్దుతాం. సీమాంధ్రలో అడ్వాన్సు పరికరాలతో ఆసుపత్రులను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం.


ఆర్కే: మీకు పిల్లలు ఎంత మంది?

భాస్కరరావు: ఇద్దరు బాబులు. పెద్దబ్బాయి ఎంబీబీఎస్‌ చేశాడు. సూపర్‌స్పెషాలిటీ చే స్తానంటే నేనే అక్కర్లేదని హాస్పిటల్స్‌ చూసుకోమని చెప్పాను. రెండో అబ్బాయి బీబీఏ చదివి ఎంఎస్‌ ఫైనాన్స్‌ చేశాడు. ఫైనాన్స్‌ వ్యవహారాలు చూసుకోమని చెప్పాను.


ఆర్కే: నెక్ట్స్ మీరు ఏం అచీవ్‌ చేయాలనుకుంటున్నారు.?

భాస్కరరావు: మెడికల్‌ ఫీల్డులో చేయాల్సింది చాలా ఉంది. నర్సింగ్‌ స్కూలు, ఫార్మసీ, ఫిజియోథెరపీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇవ్వాలి. నర్సింగ్‌ కేర్‌ చాలా ముఖ్యమైనది. దాన్ని డెవలప్‌ చేయాలి. మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ తీసుకురావాలనేది నా సంకల్పం. శ్రీకాకుళంలో మెడికల్‌ కళాశాల తీసుకున్నాను. క్వాలిటీతో వైద్యసేవలు అందించాలని అనుకుంటున్నాను. మరో వందేళ్లపాటు హాస్పిటల్స్‌ను ముందుకు తీసుకువెళ్లేలా చూడాలనేది నా లక్ష్యం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.