ltrScrptTheme3

ప్రజారాజ్యానికి కుక్కలా కాపలా కాశా

Feb 7 2020 @ 17:39PM

చిరంజీవికి అనుభవ రాహిత్యమే సమస్య

ప్రజారాజ్యాన్ని గెలిపించి ఉంటే మార్పు వచ్చేది

రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకోళ్లాలనుకున్నాను

సిద్ధాంతాలను నిజంగా నమ్మితే ఏ పరిస్థితులూ చెడగొట్టవు

26-11-12న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో డాక్టర్‌ మిత్రా


మీ కుటుంబ నేపథ్యం?

నెల్లూరులో పుట్టాను. మా నాన్న డాక్టర్‌ రామచంద్రారెడ్డి. ఆయన ప్రకటిత కమ్యూనిస్టు. ఆ వాతావరణంలోనే పెరిగాను. సుందరయ్యగారు మా పెదనాన్న. చాలా ప్రేమ, అదేసమయంలో క్రమశిక్షణ. నాపై ఆయన ప్రభావం చాలా ఉంది. 67లో జరిగిన చేగువేరా హత్య నన్ను చాలా కలచివేసింది. అది నా జీవితాన్నే మార్చేసింది. 16 ఏళ్ల వయసులో సీపీఎం సభ్యత్వం తీసుకున్నాను.


మధ్యలో పార్టీకి ఎందుకు దూరమయ్యారు?

నేను 1978లో ఇంగ్లండ్‌ వెళ్లాను. తర్వాత 87లో నా భార్యకు మాస్కో చూపించాలని వెళ్లాను. విమానం దిగగానే సోషలిస్టు గాలిని గుండెనిండా పీల్చుకున్నాను. కానీ, దిగినంతసేపు కూడా ఆ ఫీలింగ్‌ లేదు. హోటల్లో సూట్‌కేసులు కొట్టేయడం.. అంతా అరాచకమే. లంచగొండితనం, జాతి వివక్షపై ప్రశ్నించాను. నిరాశతో పార్టీకి దూరమయ్యాను.


దేశంలో ఈ తరం కమ్యూనిస్టులను చూస్తే ఏమనిపిస్తోంది?

మనుషులు తాము ఎదిగే పరిసరాలతో ప్రభావితమవుతారు. అయితే.. సిద్ధాంతాలను నిజంగా నమ్మితే వాళ్లను ఏ పరిస్థితులూ చెడగొట్టవు. సుందరయ్యగారి సమయంలో ఆదర్శవంతులైన వ్యక్తులు చాలా పార్టీలలో ఉండేవారు.


మధ్యలో ఇంగ్లండ్‌ ఎందుకు వెళ్లారు?

మెడిసిన్‌ పూర్తయ్యాక నెల్లూరు వెళ్లి ప్రజావైద్యశాలలో చేరాలని మొదట అనుకున్నాను. అక్కడ చేరితే మూడేళ్లు పనిచేయాలనేది నిబంధన. పీజీ సీటు వస్తే వెళ్లి, మళ్లీ వస్తానని సుందరయ్యగారిని అడిగాను. ఆయన కుదరదన్నారు. దాంతో వేరే దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. విమానం టికెట్‌ డబ్బు స్నేహితులే ఇచ్చారు.


మరి కాంబోడియా వెళ్లడానికి కారణం?

1989లో ఇండియా వచ్చేద్దామని లండన్‌లో ఇల్లు అమ్మేసి సామాన్లు సర్దేసుకున్నాను. అప్పట్లో టీవీలో కాంబోడియా ఇయర్‌ 10 అనే కార్యక్రమం వచ్చింది. కాంబోడియాలో మొత్తం 60 లక్షల జనాభా ఉంటే, అమెరికా బాంబుదాడుల్లో 10 లక్షల మంది చనిపోయారు. తర్వాత ఖ్మేర్‌రోజ్‌ పట్టణం మొత్తం కమ్యూనిస్టుల చేతుల్లో ధ్వంసమైంది. మరో 10 లక్షల మందిని పొలాల్లో కొట్టి చంపేశారు. ఇదంతా చూసి ఏదో చేయాలనిపించింది. మర్నాడు నిర్మాతకు ఫోన్‌ చేసి సాయం చేస్తానన్నాను. ఓ ట్రస్టుకు వైద్య సలహాదారుగా అవకాశం వచ్చింది. కాంబోడియా వెళ్తే, అక్కడ 2లక్షల మందికి కాళ్లులేవు. వాళ్లకిస్తున్న కృత్రిమ కాళ్లు సరిగా లేవు. అందుకే అక్కడ కృత్రిమకాళ్లు పెట్టే కేంద్రం ఏర్పాటుచేశాను.

ఇంత సేవా మార్గంలో వెళ్లాక.. మళ్లీ ఇక్కడి రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు?

రాజకీయాల్లోకి లాభాపేక్షతో రాలేదు. దేశప్రజలు గౌరవంతో తలెత్తుకుని బతికేలా చేయాలని అనుకున్నాను. రష్యా, జపాన్‌, జర్మనీ.. అన్నీ ఎక్కడికో వెళ్లిపోయాయి. మన రాష్ట్రంలో మాత్రం అప్పుడప్పుడు నాటుబాంబులు తప్ప ఏమీ పేలవు. అల్లు అరవింద్‌ నాకు చిన్నతనం నుంచి ప్రాణమిత్రుడు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుని, నా దగ్గరకు వచ్చాడు. చిరంజీవికి అపారమైన ప్రజాదరణ ఉంది. రాజకీయంగా తెల్లకాగితం. ఆయన మాట ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంది. మనం సరైన రాజకీయ ఎజెండా ఈ ఉద్యమానికి ఇస్తే, కచ్చితంగా ప్రభుత్వాన్ని చేపట్టే అవకాశముందని నమ్మాను. 25 మంది మంచి పోలీసు అధికారులు, 25 మంది ఐఏఎస్‌లు ఉంటే రాషా్ట్రన్ని ఆరునెలల్లో దారిలో పెట్టచ్చని అనుకున్నాను. నిజంగా జనం ఆ పార్టీకి మాండేట్‌ ఇస్తే మార్పు వచ్చేది.


వేర్వేరు వర్గాల నుంచి వచ్చి చేరడంతో పార్టీ పల్చబడింది కదా?

అది కొంత వరకు కరక్టే. కొత్తదనం, మార్పు చూసి మొదట్లో జనం విపరీతంగా ఆకర్షితులయ్యారు. కానీ, వేరే పార్టీల్లో ఉన్నవాళ్లు ఇక్కడికొచ్చి చేరడంతో వారిలో ఆలోచన మారింది. మొదట్లో ఆల్సేషన్‌ కుక్కలా ఉండి ఎవరొచ్చినా ఏదో ఒకటి చెప్పేవాడిని. తర్వాత అందరూ కలిసి నన్ను కరిచారు.


టికెట్లకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు?

వాస్తవానికి పార్టీని నడపడానికి, పార్టీ అభ్యర్థులకు ఇవ్వడానికి కొన్ని కోట్లు అవుతాయి. వాటి కోసం పార్టీ ఫండ్‌ తీసుకుని, నియోజకవర్గాలకు పంపినమాట వాస్తవం. కానీ, సీట్లు అమ్ముకున్నారన్నది నిజమని నేను నమ్మట్లేదు. తొలిదశలో చాలామంది పారిశ్రామివేత్తలు వచ్చి డబ్బులిస్తామంటే తీసుకోబోమని చెప్పాం.


చిరంజీవి నాయకత్వ లక్షణాలపై మీ అంచనా?

నాయకులు స్వతహాగా ఉండరు. పరిస్థితులే తయారుచేస్తాయి. మధ్యలోనే చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. చిరంజీవికి అనుభవరాహిత్యం పెద్ద సమస్య. ఎన్టీఆర్‌ కూడా పార్టీ పెట్టినా, ఆయన సుప్రీం. ఇక్కడ చిరంజీవి మీద చాలా ప్రభావాలున్నాయి.


కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనాన్ని ముందే ఊహించారా?

అప్పుడు అనుకోలేదు. రెండు రకాల అవకాశాలు ఉండొచ్చనుకున్నాను. ఆ పరిస్థితుల్లో నేనుంటే ఏంచేస్తాను.. ఓడిపోతే పార్టీని కొనసాగించడంపై ఆలోచించాను. ఓటమిపై కొందరు మీడియా మిత్రులు ముందేచెప్పినా, అబ్బే.. కాదన్నాం. ఎన్నికల నాటికే పార్టీకి సరైన కేడర్‌ లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో పార్టీని నడపడం కష్టమని తేలిపోయింది.


లోక్‌సత్తా నుంచి ఎందుకు బయటికొచ్చారు?

జేపీ నాకు ప్రాణమిత్రుడు. ఆయనపై అపారమైన నమ్మకం. లోక్‌సత్తా పార్టీ పెట్టగానే... నేనే వెళ్లి చేరాను. యువకులను చూసి.. ఏదో చేద్దామనుకున్నాను. కానీ, ఆర్గనైజేషన్‌ ఏర్పాటులో అభిప్రాయ భేదాలొచ్చాయి. లోక్‌సత్తా అంటే.. గ్రామ స్థాయిలో పెద్దగా తెలియదు.


మీ లక్ష్యం?

రాజకీయాల్లో, ప్రజల్లో మార్పు తేవాలి. దానిపై ఇంకా ఆశ ఉంది. ప్రస్తుతం రాజకీయాలు గోడకు గ్రీజు పూసినట్లున్నాయి. పట్టుకోవడానికి లేదు. ఎప్పుడెలా మారుతాయో చెప్పలేం. అందుకే వాటికి సంబంధం లేకుండా.. సామాజిక సేవ చేయడానికి ప్రయత్నిస్తా.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.