మరణంలేని మహాజన పాట ఉపాలి

ABN , First Publish Date - 2020-10-10T05:51:22+05:30 IST

పాటను తమకంటే ముందు పాడిన కళాకారుల్లా పాడాలని అనుకరించిన వాళ్లు వందలు వేలు. ఆ మార్గాన్ని తిరస్కరించి తానే స్వయంగా ఒక కొత్త శైలిని సృష్టించుకున్న....

మరణంలేని మహాజన పాట ఉపాలి

పాటను తమకంటే ముందు పాడిన కళాకారుల్లా పాడాలని అనుకరించిన వాళ్లు వందలు వేలు. ఆ మార్గాన్ని తిరస్కరించి తానే స్వయంగా ఒక కొత్త శైలిని సృష్టించుకున్న బహుజన వాగ్గేయకారుడు ఎర్ర ఉపాలి. పాటలో మన చరిత్రను చెప్పాలని, అది ఈ దేశ మూలవాసులను మేల్కొల్పాలనే ఒక తాత్విక చింతన ఉపాలి ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. అందుకే అతడి పాట సిసలైన వాస్తవాన్ని పట్టిచూపింది. కులం ఆసరాగా జరిగిన మనువాద రాజకీయాల బండారాన్ని బట్టబయలు చేసింది. అదే ఉపాలికి ఒక ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని అందించింది. అతడు పాట కోసం అప్పటి దాకా నడిచిన దారులను వెతకలేదు. సరికొత్తగా పుట్టుకొచ్చాడు. చరిత్రను గొంతెత్తి గానం చేశాడు. రాజ్యాధికారానికి దూరం చేయబడ్డ జాతులు అంతరిస్తాయన్న కాన్షీరాం మాటను సాంస్కృతిక రంగంలో అందరికంటే ఎక్కువగా గుర్తించినవాడు ఉపాలి. 


విప్లవ శిబిరం నుండి పాట పదునెక్కిందేమోగాని, కులసమస్యను అంతగా పట్టించుకోలేక పోయింది. విప్లవ కమ్యూనిస్టు పార్టీలు దాన్ని అంత సీరియస్‌ అంశంగా పరిగణించలేదు. అందుకే దళిత వాగ్గేయకారులు సైతం కులం మీద కంటే, తమది కాని వర్గ సమస్య మీదే ఎక్కువగా పాటలు రాశారు. కానీ ఒక ఊపు ఊపిన ఆ ఉద్యమాలు, ఆ పాట క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. కుల సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు కనుకే, ఉపాలి తన కాలంలో బలమైన ముద్ర వేసిన పెద్దపెద్ద కళాకారుల పంథాను సైతం తృణీకరించాడు. అతడిది బహుజన ప్రేమ. కేవలం తాను పుట్టిన మాదిగ జాతిని మాత్రమే అతడు ప్రేమించలేదు. ఈ సమాజంలో తరాలుగా దగాపడుతున్న బాధిత కులాలన్నింటిని అక్కున చేర్చుకున్నాడు. అందుకే సబ్బండ కులాల బాధను, గాథను పాటలుగా మలిచాడు. బహుజన కులాలంటే బీసీలు, ఎస్సీలు మాత్రమే కాదని అట్టడుగున ఉపకులాలైన చిందు, డక్కలి, బైండ్ల వంటి సన్న, చిన్న సామాజిక సమూహాలను కూడా ఎర్ర ఉపాలి పాట గుండెలకు హత్తుకుంది. ఆ పాటలను అతడు ఆలపించేటపుడు ఒక పేగుబంధపు ప్రేమ కనిపించేది. బహుజనుల మధ్య ఏర్పడవలసిన ఐక్యతను అతడి పాట అప్రయత్నంగా బోధించేది. ఉపాలికి ఆత్మాభిమానం ఎక్కువ. ఎంతటి పేదరికాన్నైనా పంటి కిందే అదిమి పట్టుకుని, గొప్ప ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చేవాడు. దళితుల్లో బాగుపడిన కులాలు, దళితుల్లోనే వెనుకబడిన కులాల సంక్షేమాన్ని పట్టించుకోవాలని భావించేవాడు కనుకే ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఆణిముత్యాల్లాంటి పాటలు రాశాడు. దండోరా ఉద్యమానికి తాను మాదిగ డప్పై దరువేశాడు. ఎమ్మార్పీయస్‌ ఉద్యమానికి మార్చ్‌ఫాస్టింగ్‌ సాంగ్‌ వంటి ‘మాదిగ మహావీరులారా...ఆదిజాంబవుని వారసులారా’ అనే పాటను అందించాడు. అది నేటికి ఊరూరా దండోరా ఉద్యమంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మాదిగ అమరవీరులు మాదిగ మహాజన రాజ్యాన్ని కలగన్నారని సూత్రీకరించాడు ఉపాలి.


నిజానికి అది అతడి కల కూడా. పాటను పట్టించుకోకపోవడం వల్ల బహుజన ఉద్యమం ఎంతో నష్టపోయింది. దళిత కళాకారులంతా తమ విముక్తి కోసం తాము ఏమీ చేసుకోలేక పోయారు. కారణం స్పష్టత లేకపోవడం. కానీ, సైద్ధాంతిక స్పష్టత కలిగిన ఉపాలి పాటను అంబేద్కరీకరిం చాడు. ఆ మార్గాన్ని అందిపుచ్చుకోవాల్సిన బహుజనులు, ఓట్ల ప్రభావంలో కొట్టుకుపోతు న్నారని ఆవేదన చెందాడు. వారికోసం తన పాటను ఒక శక్తివంతమైన ఆయుధంగా మలిచి ఎన్నో అద్భుతమైన పాటలు అల్లాడు. తెలంగాణ నేలకు ఉన్న జానపద వారసత్వాన్ని అంది పుచ్చుకుని బహుజన ఉద్యమంలో చెరగని ముద్ర వేసిన ఉపాలి పాటలు, ఈ దేశ మూలవాసులందరికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. తెలుగు నేల మీద నిర్మితమయ్యే బహుజన ఉద్యమానికి ఉపాలి పాటలే దిశానిర్దేశం చేస్తాయి. మూలవాసి విముక్తి సిద్ధాంతాన్ని బోధించి, చారిత్రక సాంస్కృతిక ఉద్యమానికి పునాదులు వేస్తాయి. అందుకే పొలిటికల్‌ ఎడ్యుకేషన్‌ లాంటి, మాదిగ డప్పులాంటి ఉపాలి పాటకు మరణం లేదు. 


డా.పసునూరి రవీందర్‌

(నేడు ఎర్ర ఉపాలి వర్ధంతి, ఆలేరు రాఘవపురంలో స్తూపం ఆవిష్కరణ సందర్భంగా)

Updated Date - 2020-10-10T05:51:22+05:30 IST