నా అంత్యక్రియలకు రండి.. అంటూ ఓ పాప ఇన్విటేషన్ ఇచ్చింది

Published: Fri, 07 Feb 2020 18:48:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నా అంత్యక్రియలకు రండి.. అంటూ ఓ పాప ఇన్విటేషన్ ఇచ్చింది

మహేష్‌బాబు మా అంబాసిడర్.. కారణాలివే..

లోకల్‌గా ఉండే వాళ్లు కూడా బెదిరించేవాళ్లు

మా నాన్న గోత్రం కలవకపోతే వాళ్ల పెళ్లికి కూడా వెళ్లే వాడు కాదు

వెంకయ్యనాయుడుతో ఓపెనింగ్‌ చేయించా.. ఒక్కరూ మాట్లాడలేదు

మా కుక్క కూడా ఎందుకీ రోజు ఇంట్లోనే ఉన్నావన్నట్లు చూస్తుంది

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రెయిన్‌బో హాస్పిటల్ చైర్మన్ కంచర్ల రమేష్


లండన్‌లో ప్రముఖ డాక్టర్‌గా హ్యాపీగా ఉన్నారాయన. కానీ... అంతటితో సంతోషపడలేదు. ఏదో చేయాలనే తపనతో స్వదేశంలో అడుగుపెట్టారు. పిల్లల హాస్పిటల్‌ను ప్రారంభించి దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలిపారు. ఆయనే హైదరాబాద్‌లోని ‘రెయిన్‌బో’ హాస్పిటల్‌ చైర్మన్‌ కంచర్ల రమేష్‌. ఆయనతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ.. 23-04-2017న చేసిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కే’.

 

ఆర్కే: హాస్పిటల్‌ విస్తరణలో బాగా బిజీ అయినట్టున్నారు?

రమేష్: అవును. అయితే అగ్రెసివ్‌గా వెళ్లడం లేదు. నిర్మాణాత్మకంగా, క్యాలిక్యులేటెడ్‌గా వెళుతున్నాం. దేశంలో పిల్లల ఆసుపత్రుల అవసరం చాలా ఉంది.

 

ఆర్కే: ప్రాణాలు పోతున్నప్పుడు ఆసుపత్రికి వస్తారు. కానీ మీరు ప్రాణాలకు పురుడు పోస్తున్నారు. పసిపిల్లలతో ఆ అనుభవం ఎలా ఉంటుంది?

రమేష్: ఎంబిబిఎస్‌ పూర్తయ్యాక చిల్డ్రన్‌ హెల్త్‌కేర్‌ చేస్తే బాగుంటుందని ఉండేది. కానీ ఒకవిధమైన బెరుకు ఉండేది. పిల్లలను డీల్‌ చేయడం కొంచెం కష్టం కదా అనిపించేది. అప్పుడు చెన్నైలోని ‘ఎగ్మోర్‌ చిల్డ్రన్‌ హాస్పిటల్‌’లో ఎనిమిది నెలలు పనిచేశాను. అక్కడ వర్క్‌ చేయడం మొదలుపెట్టాక కంఫర్ట్‌నెస్‌ వచ్చింది. వర్క్‌ని ఎంజాయ్‌ చేయడం మొదలుపెట్టాను.

 

ఆర్కే: మీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటి?

రమేష్: పల్లెటూరి నుంచి వచ్చాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలో చిన్న గ్రామం మాది. మా నాన్న సర్పంచ్‌గా పనిచేశారు. వ్యవసాయం చేస్తున్నా ఆయనకు పిల్లలను బాగా చదివించాలని ఉండేది. మా పంచాయతీలో పెద్దగా చదువుకున్న వారు లేరు. పిల్లలకు ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, చదువులు అనే విజన్‌ ఉండేది ఆయనకు. మా మేనమామలు బిజినెస్‌ చేసేవారు. వాళ్లతో ఎప్పుడూ వాదించేవాడు, పిల్లలకు కావాల్సింది చదువు, బిజినెస్‌ కాదు అని. మా అన్నయ్య రవీంద్రనాథ్‌ ముందుగా మెడిసిన్‌ పూర్తి చేశారు. గ్లోబల్‌ హాస్పిటల్‌ పెట్టారు. ఆయన ప్రభావం నాపైన చాలా ఉంది. ఎండీ పూర్తి చేశాక లండన్‌ వెళ్లాను. ఎనిమిదేళ్లు అక్కడే ఉన్నాను. అక్కడి మేజర్‌ హాస్పిటల్స్‌లో పనిచేశాను. కాన్ఫిడెన్స్‌ బాగా బిల్డప్‌ అయింది.

 

ఆర్కే: టాప్‌ పొజిషన్‌లో ఉన్న వారిలో చాలా మందిని చూస్తే చదువులో యావరేజ్‌గా ఉన్నా ఆ తరువాత బిజినెస్‌లో లేక తమ వృత్తిలో సక్సెస్‌ అవుతున్నారు. ఎందుకలా?

రమేష్: ఇక్కడ అలాంటి వారు చాలా మంది కనిపిస్తారు. చిన్నప్పటి లైఫ్‌ డిఫరెంట్‌. హార్డ్‌ వర్కింగ్‌ నేచర్‌, కమిట్‌మెంట్‌, చేయాలనే ధృక్పథం ఉన్నప్పుడు తప్పక సక్సెస్‌ అవుతాం.

 

ఆర్కే: లండన్‌లో ఉన్నప్పుడు కేన్సర్‌తో బాధపడుతున్న ఒక పాప ఇన్విటేషన్‌ ఇచ్చిందని, అది మీలో చాలా మార్పును కలిగించిందని అంటారు. ఏంటది?

రమేష్: అవును. నేను అక్కడ హాస్పిటల్‌లో రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు ఆ పాప కీమోథెరపీ కోసం చేరింది. చాలా బబ్లీగా ఉంది. ఆ వార్డు వేరే వాళ్లు చూస్తున్నారు. అయినా రోజు పలకరించే వాణ్ణి. మూడు రోజుల తరువాత ఆ పాప ఒక ఇన్విటేషన్‌ కార్డు ఇచ్చింది. అది బర్త్‌డే కార్డు అనుకున్నాను. కాసేపయ్యాక తెరిచి చదివి ఆల్‌మోస్ట్‌ కుప్పకూలిపోయాను. ఆ పాప ఇచ్చిన కార్డు ‘ఇన్విటేషన్‌ టు ఫ్యునెరల్‌ (అంత్యక్రియలకు ఆహ్వానం)’. తన ఫ్యునెరల్‌కు రమ్మని ఆహ్వానిస్తోంది. వెంటనే తన వార్డుకు వెళ్లి చూశాను. ఏడేళ్ల పాప. వ్యాధి అడ్వాన్స్‌ స్టేజ్‌లో ఉంది. నొప్పి నుంచి ఉపశమనం కోసం హాస్పిటల్‌లో ఉంచారు. ఆ సంఘటన చాలా డిస్టర్బ్‌ చేసింది.

 

ఆర్కే: ప్రారంభంలో ఫైనాన్షియల్‌గా కూడా బాగా ఇబ్బంది పడినట్టున్నారు?

రమేష్: బాగా... ఫైనాన్షియల్‌గా మేం మిడిల్‌క్లాస్‌ నుంచి వచ్చిన వాళ్లమే. మా అన్నయ్య కూడా ఆ సమయంలో ఇబ్బందుల్లోనే ఉన్నాడు. ఉన్న డబ్బులన్నీ పెట్టేశాం. బ్యాంక్‌లోన్స్‌ కట్టడం కష్టమయింది. మూడు కోట్ల అప్పు నాలుగున్నర కోట్లకు చేరింది. ఆ సమయంలో ఏడాది కష్టపడాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ అప్పటికీ లాభాలు రాకపోతే మళ్లీ లండన్‌ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ కష్టానికి ఫలితం దక్కింది. ఏడాదిలో ప్రాఫిట్స్‌ వచ్చాయి. ఈ సమయంలోనే ఆంధ్రాబ్యాంక్‌ చైర్మన్‌ వసంతగారు చాలా హెల్ఫ్‌ చేశారు. కొలీగ్స్‌ అందరూ బాగా పనిచేశారు.

 

ఆర్కే: రీసెంట్‌గా నెంబర్‌వన్‌ అవార్డు వచ్చినట్టుంది?

రమేష్: 2011 నుంచి మేం నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాం.

 

ఆర్కే: హాస్పిటల్‌కు బాగా పేరున్నా... ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారని అంటారు నిజమేనా?

రమేష్: మా హాస్పిటల్‌కు వచ్చే వాళ్లు అప్పటికే రెండు, మూడు హాస్పిటల్స్‌ తిరిగి వస్తారు. అప్పటికే జబ్బు క్రిటికల్‌ స్టేజ్‌లో ఉంటుంది. ఇంటెన్సివ్‌ కేర్‌లో పెట్టాల్సి వస్తుంది. ఒక్కోసారి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను కాపాడటానికి రెండు, మూడు నెలలు ఇంటెన్సివ్‌లో ఉంచాల్సి వస్తుంది. అలాంటప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చవుతుంది. ఆ ఖర్చు పేషెంట్లు భరించలేని స్థితిలో ఉన్నప్పుడు మేం చాలాసార్లు సహాయం చేస్తుంటాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం అందిస్తుంటాయి. హాస్పిటల్‌ 33 శాతం, పేషెంట్‌ 33 శాతం, ఫౌండేషన్‌ 33 శాతం భరించి వైద్యం అందించిన సందర్భాలు ఉన్నాయి.

 

ఆర్కే: కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా? ట్రస్ట్‌ క్రియేట్‌ చేశారా?

రమేష్: మా ఊర్లో ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటుకు సపోర్టు చేశాం. ప్రైమరీ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ను ప్రారంభించాం. నీలోఫర్‌ హాస్పిటల్‌కు కొంత ఎక్విప్‌మెంట్‌ కొనిచ్చాం. ‘స్పర్శ్‌’ అని ఎండ్‌ ఆఫ్‌ ద లైఫ్‌ కేర్‌ సంస్థ ఉంది. దానికి కూడా కొంత సపోర్టు చేస్తాం అని చెప్పాం.

నా అంత్యక్రియలకు రండి.. అంటూ ఓ పాప ఇన్విటేషన్ ఇచ్చింది

ఆర్కే: గతంలో డాక్టర్‌కు దగ్గరకు వెళితే కూర్చోబెట్టి మాట్లాడి అన్ని వివరాలు కనుక్కుని మందులిచ్చే వారు. ఇప్పుడు ఒక నిమిషం కూడా కూర్చోకముందే ‘ఈ పరీక్షలన్నీ చేయించుకు రండి’ అని టిక్కులు కొట్టి ఇస్తున్నారు? ఇది కరెక్టేనా?


రమేష్: నేను కూడా ఏకీభవిస్తాను. వచ్చిన వాళ్లందరికీ టెస్టులు రాయడం కరెక్ట్‌ కాదు. పేషెంట్‌, డాక్టర్‌ రిలేషన్‌షిప్‌ను కంప్లీట్‌గా రివైజ్‌ చేయాల్సిన అవసరం ఉంది. అది డాక్లర్ల వైపు నుంచి రావాలి. పేషెంట్ల వైపు నుంచి రావాలి. మీడియా కూడా కృషి చేయాలి.


ఆర్కే: హాస్పిటల్‌ పెట్టాక వైద్యంలో మీకు బాగా సంతృప్తిని కలిగించిన సంఘటనలు ఉన్నాయా?

రమేష్: ఇంటెన్సివ్‌ కేర్‌ మొదలుపెట్టాక 1.5 కేజీ పిల్లలు కూడా బతికే వాళ్లు కాదు. ఇప్పుడు 75 శాతం పిల్లలను రక్షిస్తున్నాం. ఇది బిగ్‌ అచీవ్‌మెంట్‌.

 

ఆర్కే: ప్రిమెచ్యూర్‌ బేబీలను కాపాడినందుకు గిన్నిస్‌ బుక్‌ అవార్డు కూడా వచ్చినట్టుంది?

రమేష్: అవును.


ఆర్కే: ప్రిమెచ్యూర్‌ బేబీలు పుట్టడానికి కారణం ఏంటి?

రమేష్: లైఫ్‌స్టయిల్‌, లేట్‌ మ్యారేజ్‌, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు... ఇవన్నీ కారణమే.

 

ఆర్కే: అంబాసిడర్‌గా మహేష్‌బాబును ఎందుకు ఎంచుకున్నారు?

రమేష్: వాళ్ల బాబును మేమే ట్రీట్‌ చేశాం. వాళ్ల పాప కూడా మా దగ్గరే పుట్టింది. వాళ్లతో కలిసి ఐదారేళ్ల జర్నీ ఉంది. తరచుగా మాట్లాడుకునే వాళ్లం. ఒకసారి మా దగ్గర ఒక పాప అడ్మిట్‌ అయింది. తనకు మహేష్‌బాబంటే ఇష్టమని వాళ్ల మదర్‌ చెప్పింది. పాప కోలుకోవడం కోసం మహేష్‌ను రమ్మని రిక్వెస్ట్‌ చేశాం. దాదాపు గంట పాటు మా హాస్పిటల్‌లో గడిపాడు. పాప బాగా రికవరీ అయింది. తరువాత మాకు అంబాసిడర్‌గా చేయమని రిక్వెస్ట్‌ చేశాం.

 

ఆర్కే: హాస్పిటల్‌ పెట్టాక చేదు అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా?

రమేష్: వరంగల్‌ జిల్లా నుంచి ఒక జంట ప్రెగ్నెన్సీ కోసం మాదగ్గరకు వచ్చారు. సహాయం చేయమని అడిగితే మా దగ్గర ఆ సౌకర్యం లేకపోయినా పక్కన ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లి చేయించాం. బేబీ పుట్టింది. సంతోషంగానే వెళ్లిపోయారు. వారం రోజుల తరువాత మళ్లీ వచ్చారు. లంగ్స్‌లో ఇన్‌ఫెక్షన్స్‌తో పాప చనిపోయింది. అప్పుడు వాళ్లు మాట్లాడిన మాటలు ఎప్పుడూ మరిచిపోలేను. ఇంకో విషయం ఏమిటంటే మరుసటి రోజు న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో కూడా వచ్చింది. చాలా బాధేసింది. తరువాత లోకల్‌గా ఉండే వాళ్లు కూడా కొంత మంది బెదిరించడం మొదలుపెట్టారు. ఇలా కాదని వెంకయ్యనాయుడుతో ఓపెనింగ్‌ చేయించా. తరువాత ఒక్కరూ మాట్లాడలేదు.

 

ఆర్కే: మీది లవ్‌మ్యారేజేనా?

రమేష్: డాక్టర్‌ని పెళ్లి చేసుకోవడానికి నేను వ్యతిరేకం. మా నాన్న గోత్రం కలవకపోతే వాళ్ల పెళ్లికి కూడా వెళ్లే వాడు కాదు. దాంతో మేం ధైర్యం చేయలేదు. ఇంట్లో చూసిన అమ్మాయినే చేసుకున్నాను.

 

ఆర్కే: మీ అబ్బాయి కూడా డాక్టరేనా?

రమేష్: మెడిసిన్‌ చదువుతున్నాడు.

 

ఆర్కే: పొలిటికల్‌ రిలేషన్స్‌ ఉన్నాయి కదా! పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచన ఉందా?

రమేష్: లేదు. ఆ అవకాశమే లేదు. అందరితో బాగుంటాను అంతవరకే.

 

ఆర్కే: హాస్పిటల్‌ ఒక్కటేనా? ఇంకా వేరే ఆశయాలున్నాయా?

రమేష్: తెలిసో తెలియకో హాస్పిటల్స్‌ వైపు వచ్చాం. కొంత సాధించాం. అభినందించారు. కొంతకాలం తరువాత రిటైర్మెంట్‌ తీసుకుని పాత స్నేహితులను కలవాలి. ఊరికి వెళ్లాలి. ఏదో చేయాలని ఉంది. అగ్రికల్చర్‌ అంటే ఇష్టం ఉంది.


ఆర్కే: లండన్‌ నుంచి రాగానే రెయిన్‌బో హాస్పిటల్‌ పెట్టాలని నిర్ణయించుకున్నారా?

రమేష్: ఏడాది ముందు నుంచే దానిపై వర్క్‌ చేశాను. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో చాలామంది డాక్టర్లను కలిశాను, మాట్లాడాను. లండన్‌లో ఉండకుండా హాస్పిటల్‌ ఎందుకు అని చాలామంది నిరుత్సాహ పరిచారు. స్నేహితులు, కొంతమంది మాత్రం చాలా ఎంకరేజ్‌ చేశారు. నేను, డాక్టర్‌ ప్రసాద్‌ కలిసి హాస్పిటల్‌ ప్రారంభించాం. ప్రసాద్‌ తరువాత వేరే హాస్పిటల్‌ పెట్టుకున్నాడు.


మా హాస్పిటల్‌లో టైప్‌1 డయాబెటిస్‌ పిల్లలకు ప్రత్యేక శిక్షణ అందిస్తాం. వాళ్లే ఇన్సులిన్‌ తీసుకునేలా నేర్పిస్తాం. డయాబెటిస్‌ ఉన్న పిల్లల నిర్వహణ చాలా కష్టం. వాళ్లపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సి ఉంటుంది.


2011లో హిందూజా వాళ్లు కలిసి పనిచేద్దామని అడిగారు. కానీ అప్పుడు ధైర్యం చేయలేకపోయాం. ఆ తరువాత నెమ్మదిగా విస్తరణ మొదలుపెట్టాం.


మొదట్లో నేను 35వేలు జీతం తీసుకునే వాణ్ణి. నా లైఫ్‌స్టయిల్‌కది ఏ మాత్రం సరిపోయేది కాదు. దాంతో స్నేహితుల దగ్గర అడిగి తీసుకునే వాణ్ణి. మూడేళ్లలో 20 లక్షలు అప్పు చేశా. తరువాత తీర్చేశా. ఇప్పుడు జీతం బాగానే తీసుకుంటున్నాను కానీ, వెంకటేశ్వరస్వామిలా డబ్బు ఎప్పుడూ ఉండదు.


ఇంగ్లండ్‌లో మాదిరిగా ట్రస్ట్‌ బేస్డ్‌ సిస్టమ్‌ను ఇక్కడ డెవలప్‌ చేయాలి. జిల్లా కేంద్రాల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించే ఆసుపత్రులు రావాలి. వైద్యం కోసం గ్రామాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చే అవసరం ఉండకూడదు. ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లు బలపడాలి.


డెంగ్యూ ఫీవర్‌కు సంబంధించి మా దగ్గర నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉంది. మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ స్టేజ్‌లో ఉన్న వారిని సైతం రికవర్‌ చేసే స్థాయిలో ఉన్నాం. ఇతర హాస్పిటల్స్‌తో పోల్చితే ఇది మా అచీవ్‌మెంట్‌గా భావిస్తాం.


మరో ఐదు, పదేళ్ల తరువాత ఈ హాస్పిటల్స్‌ను రన్‌ చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు లిస్టింగ్‌కు వెళ్లడమా, మరో పార్ట్‌నర్‌ను చూసుకుని అప్పగించడమో చేయాల్సి వస్తుంది.

ఇంట్లో నేను ఖాళీగా కూర్చోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. నేను ఇంట్లో ఉంటే మా కుక్క కూడా ఎందుకీ రోజు ఇంట్లోనే ఉన్నావన్నట్లు చూస్తుంది.

 

ఆర్కే: సినిమాలకు ప్రొడ్యూస్‌ చేయాలని ఆసక్తి ఉంది.

రమేష్: మంచి క్వాలిటీ లైఫ్‌ ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్‌.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.