డాక్టర్‌ వీఏఏ లక్ష్మీ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ

ABN , First Publish Date - 2021-12-02T06:00:06+05:30 IST

జీజీహెచ్‌లో దీర్ఘకాలం గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించి, ప్రస్తుతం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యకళాశాలలో పనిచేస్తున్న గుంటూరు నగరం సాంబశివపేటకు చెందిన డాక్టర్‌ వీఏఏ లక్ష్మీ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

డాక్టర్‌ వీఏఏ లక్ష్మీ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ

మెడికో విద్యార్థిని ఆత్మహత్య కేసులో క్లీన్‌ చిట్‌

నెల్లూరులో పనిచేస్తూ ముందస్తుగానే ఉద్యోగానికి గుడ్‌బై 

గుంటూరు, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): జీజీహెచ్‌లో దీర్ఘకాలం గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించి, ప్రస్తుతం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యకళాశాలలో పనిచేస్తున్న గుంటూరు నగరం సాంబశివపేటకు చెందిన డాక్టర్‌ వీఏఏ లక్ష్మీ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొంతకాలం క్రితం డాక్టర్‌ లక్ష్మీ గుంటూరు మెడికల్‌ కళాశాలలో పనిచేసే సమయంలో ఒక మెడి కో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రొఫెసర్‌ లక్ష్మీతోపాటు కుటుంబసభ్యులు వివాదంలో చిక్కుకున్నారు. అనంతరం ఆ కేసులో తమతప్పేది లేదని న్యాయస్థానంలో వాదన వినిపించుకోగా కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి కేసు కొట్టివేసింది. కోర్టులో కేసు కొనసాగే సమయంలో నెల్లూరుకు బదిలీచేయగా అక్కడ కొంతకాలంపాటు విధులు నిర్వహించి ముందస్తు పదవీ విరమణ తీసుకున్నారు. కాగా కొవిడ్‌ సమయంలో ప్రొఫెసర్‌ లక్ష్మీ సేవలందించటంపై అక్కడి కలెక్టర్‌ కేవీ చక్రధర్‌బాబు నుంచి ప్రశంసలందుకున్నారు. ఆ కేసు మూలంగా ప్రొఫెసర్‌ లక్ష్మీ భర్త డాక్టర్‌ జి.విజయసారధి అప్పట్లో తాను నిర్వహిస్తున్న ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇక నుంచి నగరంలోనే ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు డాక్టర్‌ లక్ష్మి పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-02T06:00:06+05:30 IST