Advertisement

ఆమె ఆహార్యాన్ని తొలగించింది

Oct 15 2020 @ 00:27AM

ఈ రోజెందుకో 

శుభోదయంలా లేదు

సూర్యకాంతిలో శోభ లేదు

ఆకాశానికి ముందే తెలుసనుకుంటాను

రెండ్రోజులుగా ఏకధారగా విలపిస్తూనేఉంది

ముద్రపట్టడం. మరచిపోయిన

నాట్యవిలాస భంగిమలు

బిత్తరపోయి దిక్కులు చూస్తున్నాయి.


కూచిపూడి ఉనికి 

ఆమె ఊపిరిలో తెలిసేది

నృత్యరీతిని మనికి

ఆమెతో సహవాసం చేసేది

అక్షరాభ్యాసాన్ని ఆమె అడుగులతో చేసింది

ఆచార్యత్వానికి అధిష్ఠాన దేవత అయింది


శ్రీరాముడైన శోభ

జగదానందకారకమైంది

వివేకానందమయమైన శోభ

మేదిని ముఖచిత్రం పైన

‍భారతాత్మను ముద్రించింది

కావ్యాలు అంకితమిచ్చే కాలంలో

కళకు జీవితాన్ని అంకితమిచ్చింది


ఇప్పుడు

విశ్రాంతి మందిరంలో

ఆమె ఆహార్యాన్ని తొలగించింది

నృత్య చూడామణి శోభానాయుడు

నాట్య ప్రదర్శననే కాదు, 

జీవనాటకాన్ని ముగించింది

తెర దించిన రవీంద్రభారతి

విషణ్ణవదనయైఉంది

చప్పట్లు నిశ్శబ్దపు లోగిళ్ళలో

విడిది చేశాయి


నవరస నటభామిని

శోకరసాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళింది

సత్యభామ

రెండోసారి దివికి చేరింది

మళ్ళీ భామాకలాపం ఉంటుందా?

ఏమో! భగవంతుణ్ణే అడగాలి


– డా. వోలేటి పార్వతీశం

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.