మన టీకాపై డ్రాగన్‌ పంజా

ABN , First Publish Date - 2021-03-02T07:06:04+05:30 IST

భూతల ఘర్షణలతోనే కాదు, సైబర్‌ దాడులతో కూడా ప్రత్యర్థి దేశాలను దెబ్బతీసి, ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలను సాధించాలని చైనా కుట్రలు చేస్తోంది. మాల్‌వేర్‌ను పొరుగుదేశాల లక్ష్యాల సిస్టమ్స్‌లోకి చొప్పించి వాటిని దెబ్బతీసేందుకు

మన టీకాపై డ్రాగన్‌ పంజా

భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ సంస్థలపై సైబర్‌ దాడి

మేధో సంపత్తి హక్కులను దెబ్బతీయడమే లక్ష్యం

వ్యాక్సిన్‌ సరఫరా పోటీని దెబ్బతీసే కుతంత్రం

చైనా ప్రభుత్వ సహకారంతో సైఫర్మా అటాక్‌

ముంబైలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థల హ్యాక్‌

నిరుడు అక్కడ గ్రిడ్ల వైఫల్యానికి కారణమిదే

జపాన్‌, అమెరికా సంస్థ అధ్యయనంలో వెల్లడి


న్యూఢిల్లీ, మార్చి 1: భూతల ఘర్షణలతోనే కాదు, సైబర్‌ దాడులతో కూడా ప్రత్యర్థి దేశాలను దెబ్బతీసి, ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలను సాధించాలని చైనా కుట్రలు చేస్తోంది. మాల్‌వేర్‌ను పొరుగుదేశాల  లక్ష్యాల సిస్టమ్స్‌లోకి చొప్పించి వాటిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్న రెండు అగ్రశ్రేణి భారతీయ సంస్థలు- సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఐఐ), భారత్‌ బయోటెక్‌లపై డ్రాగన్‌ సైబర్‌ దాడులకు పాల్పడింది. అమెరికన్‌ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఆధ్వర్యంలో సింగపూర్‌, టోక్యో ప్రధానకేంద్రాలుగా పనిచేస్తున్న సైఫర్మా అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. చైనా ప్రభుత్వ అండదండలతో నడిచే స్టోన్‌ పాండా (దీనికే ఏపీటీ 10 అని కూడా పేరు) ఈ దాడికి పథక రచన చేసింది.


భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ సంస్థల ఐటీ వ్యవసలు, సరఫరా యంత్రాంగపు  సాఫ్ట్‌వేర్‌లు చాలా బలహీనంగా ఉన్నట్లు, వాటిలో అనేక లోపాలు కూడా ఉన్నట్లు కనుగొని వాటిని టార్గెట్‌ చేసినట్లు సైఫర్మా తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రా జెన్‌కాలతో కలిసి వ్యాక్సిన్‌ను తయారు చేసి అనేక ప్రపంచదేశాలకు అందించిన సీరమ్‌ను చైనా ప్రధానంగా లక్ష్యం చేసుకుందనీ, భారత ఫార్మాస్యూటికల్‌ సంస్థలను, వాటి మేధాసంపత్తి హక్కులను దెబ్బతీయడమే ఉద్దేశమని సైఫర్మా చీఫ్‌ ఎగ్జిక్యూటిక్‌ కుమార్‌ రితేశ్‌ చెప్పారు. ‘సీరమ్‌ పబ్లిక్‌ సర్వర్లు, వెబ్‌ సర్వర్లన్నీ చాలా బలహీనంగా ఉన్నాయి. తమ వెబ్‌ అప్లికేషన్‌, కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ చాలా బలహీనంగా ఉన్నట్లు ఆ సంస్థే తెలిపింది. 


ఇది చాలా ఆందోళనకరం. డ్రాగన్‌ ఈ విషయం తెలుసుకుని గురిపెట్టింది’ అని ఆయన వివరించారు. తమ అధ్యయనంలో తేలిన విషయాలను భారత ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్‌ మంత్రిత్వ శాఖలోని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ)కి తెలియపరిచామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ దాడులకు పాల్పడుతున్న 750 సైబర్‌ క్రిమినల్‌ సంస్థలు, వ్యక్తుల కార్యకలాపాలను  సైఫర్మా నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. సుమారు 2000కు పైగా సైబర్‌ దాడుల ఆచూకీ కనిపెట్టి వివిధ ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోందీ సైఫర్మా! కాగా- చైనా భద్రతా విభాగం ఆధ్వర్యంలోనే ఈ ఏపీటీ10 పనిచేస్తోందని 2018లోనే అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. మైక్రొసాఫ్ట్‌ కూడా చైనా, ఉత్తర కొరియా, రష్యా సంస్థల హ్యాకింగ్‌ కార్యకలాపాలను రెండేళ్ల కిందట బయటపెట్టింది. 


ముంబై చీకటి వెనుక కూడా..!

నిరుడు అక్టోబరు 12న ముంబైలో కొన్ని గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కీలక వర్కింగ్‌ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరోజున సరఫరా నిల్చిపోవడానికి, గ్రిడ్ల వైఫల్యానికి కారణం చైనా జొప్పించిన మాల్‌వేరే కారణమని మసాచుసెట్స్‌లోని సోమర్‌విల్లేలో ఉన్న ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ సంస్థ నివేదికను న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. తూర్పు లద్దాఖ్‌లో కయ్యానికి కాలుదువ్వి, ఉద్రికత్తలు కొనసాగుతున్న సమయంలో భారత్‌పై ఒత్తిడి పెంచి సరిహద్దుల విషయంలో మరీ అంత దూకుడు వద్దనిచ తమ జోలికి రావొద్దని ఓ సంకేతం పంపాలన్న కుట్రతో... ముంబైలో విద్యుత్‌ గ్రిడ్లపై సైబర్‌ దాడి చేయించినట్ల్లు నివేదిక విశ్లేషించింది.


భారత్‌కు రెండుమార్లు తెలియజేశాం

చైనా హ్యాకింగ్‌ గ్రూప్‌ రెడ్‌ఈకో చర్యలను నిరంతరం మానిటర్‌ చేస్తున్న రికార్డెడ్‌ ఫ్యూచర్‌ భారత లక్ష్యాలపై గురిపెట్టిన విషయాన్ని రెండుసార్లు భారత ప్రభుత్వానికి తెలియపరిచింది.  కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ) కూడా తమ నుంచి వచ్చిన అప్రమత్త సందేశాలు అందినట్లు ధ్రువీకరించిందని వెల్లడించింది. చైనా సంస్థ రెడ్‌ఈకో పనేనని ఆనాడు ధ్రువీకరించకపోయినా ఇతరత్రా సోర్సుల నుంచి ఈ మాల్‌వేర్‌ వెళ్లినది కనబడడం లేదని, పైపెచ్చు షాడోపాడ్‌ వినియోగిస్తున్నది రెడ్‌ఈకోయేనని  రికార్డెడ్‌ ఫ్యూచర్‌ నివేదిక స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన రక్షణ, అంతరిక్ష వ్యవస్థలను కూడా చైనా లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చని, ఆ సిస్టమ్‌లను హ్యాక్‌ చేసి నిర్వీర్యం చేసేందుకు పథకాలు రచిస్తోందని కూడా నివేదిక బయటపెట్టింది. 


మన వ్యవస్థలు భధ్రం: కేంద్రం

చైనా సంస్థల ప్రోద్బలంతో జరిగిందని చెబుతున్న సైబర్‌ దాడి వల్ల ఎలాంటి విఘాతమూ కలగలేదని, పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పీవోఎ్‌సవోసీవో) కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని కేంద్ర విద్యుత్‌ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ఎలాంటి ప్రభావమూ లేదు. ఎలాంటి డేటా ఉల్లంఘనా, డేటా నష్టం జరగలేదు. అయినప్పటికీ మేం సకాలంలో సకల జాగ్రత్త చర్యలూ తీసుకున్నాం’ అని ఆ ప్రకటన వివరించింది. అయుతే నిరుటి ముంబై విద్యుత్‌ సరఫరా వ్యవహారంపై ఈ శాఖ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. 


పచ్చి అబద్ధాలవి: చైనా

భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలపైనా, విద్యుత్‌ ఇతర ఇన్‌ఫ్రా సౌకర్యాల వ్యవస్థలపైనా తాము దాడి చేసినట్లు వివిధ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీలు వెల్లడించిన నివేదికలను చైనా తిరస్కరించింది. ‘సైబర్‌ సెక్యూరిటీని గౌరవించే, అత్యంత ప్రాధాన్యమిచ్చే దేశం మాది. సైబర్‌ దాడులు మా పని కాదు. అసలు సైబర్‌ దాడుల మూలాలను కనుగొనడం అంత సులువేం కాదు. ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఊహాజనితాలు, కల్పిత కథనాలతో మమ్మల్ని నిందించడం బాధ్యతారహితం. ఇలాంటి కుయుక్తలను మేం సమర్థించం’ అని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అన్నారు. 


దాడి ఎలా..?

చైనా ప్రభుత్వ అండదండలతో నడిచే రెడ్‌ఈకో అనే సైబర్‌ ఎటాక్‌ గ్రూప్‌ ఈ దాడికి పాల్పడినట్లు రికార్డెడ్‌ ఫ్యూచర్‌ అధ్యయనం తేల్చింది. నిజానికి 2020 ప్రారంభం నుంచే భారత్‌లోని అనేక లక్ష్యాలపై రెడ్‌ఈకో గురిపెట్టింది. మే-జూన్‌ నెలల నాటికి తన దాడిని పదునుదేల్చింది. తూర్పు లద్దాఖ్‌లో గల్వాన్‌ లోయలో రెండు దేశాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరిన సమయమది. భారత్‌లో అనేక మౌలిక సౌకర్యాలను అందించే విద్యుత్‌, విమానాశ్రయ, నౌకాశ్రయాలకు చెందిన నెట్‌వర్క్‌లు, సిస్టమ్‌లు, కంప్యూటర్‌ వ్యవస్థలను హ్యాక్‌ చేసే పనిని రెడ్‌ఈకో మొదలెట్టింది. ఎన్టీపీసీ, ఐదు ప్రాంతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లు (ఆర్‌ఎల్‌డీసీ) సహా పది భారీ విద్యుత్‌ సంస్థలు, మూడు నౌకాశ్రయాలను టార్గెట్‌ చేసింది. షాడోపాడ్‌ అనే మాల్‌వేర్‌తో ఉన్న ఏక్సియోమ్యాటిక్‌ఎసింప్టోట్‌ అనే ఇన్‌ఫ్రాను రెడ్‌ఈకో ప్రయోగించింది. గ్రిడ్‌ బ్యాలెన్సింగ్‌ చేసి విద్యుత్‌ సరఫరాను సజావుగా నిర్వహించే సిస్టమ్‌లను మాల్‌వేర్‌తో దాడి చేయడంతో వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. 

Updated Date - 2021-03-02T07:06:04+05:30 IST