పూడిక తొలగింపు.. నత్తనడకన!

Sep 21 2021 @ 00:21AM

99 డ్రెయిన్లలో పూడిక తొలగింపు పెండింగ్‌

ఉపాధి హామీ కింద కొనసా...గుతున్న పనులు

వచ్చే సీజన్‌కి అయినా పూర్తి అయ్యేనా?


గుంటూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏటా సంభవిస్తున్న తుపాన్లు, వరదల సమయాన కృష్ణా పశ్చిమ డెల్టాలో పంటలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పూడిక తొలగింపు పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. వేలమంది కూలీలకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్న ఈ పనుల విషయంలో అటు జలవనరులు, ఇటు డ్వామా శాఖల మధ్యన సమన్వయం కొరవడింది. దీంతో గత సీజన్‌లో పనులు ఆశించినంతగా పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు కాలువలకు నీరు వదిలినందున వాటిల్లోకి ఉపాధి కూలీలు దిగి పూడిక తొలగింపు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాలువలకు నీటి విడుదల నిలిపేసేంత వరకు నిరీక్షించక తప్పని పరిస్థితి తలెత్తింది. 

నివర్‌ తుపాను సమయంలో డెల్టాలో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. దానిని పరిగణనలోకి తీసుకొన్న అప్పటి జిల్లా కలెక్టర్‌ నోటిఫైడ్‌/ నాన్‌ నోటిఫైడ్‌ డ్రెయిన్లు, కాలువల్లో పూడిక తొలగింపు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీని వలన ప్రత్యక్షంగా కూలీలకు పనిదినాలు లభ్యమౌతాయి. మరోవైపు కాలువలు, డ్రెయిన్లలో నీరు వేగవంతంగా ప్రవహించడం వలన డెల్టాలో పంటలు దెబ్బతినకుండా ఉంటాయి. తుపాన్లు వచ్చినా పెద్దగా నష్టం వాటిల్లదని అంచనా వేశారు. ఏ కాలువలు/ డ్రెయిన్లలో పూడిక తొలగించాలో ఆ వివరాలను జిల్లా నీటియాజమాన్య సంస్థకి నివేదించి ఆ సంస్థని సమన్వయం చేసుకొని పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 

నాన్‌ నోటిఫైడ్‌ డ్రెయిన్స్‌లో 263 పనులు ప్రతిపాదించగా కేవలం 64 మాత్రమే ఇప్పటిరవకు పూర్తయ్యాయి. 166 పురోగతిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 33 అసలు ప్రారంభమే కాలేదు. నోటిఫైడ్‌ డ్రెయిన్లలో 55 చోట్ల పూడిక తొలగింపు ప్రతిపాదించగా 10 పూర్తి చేశారు. 21 పనులు కొనసాగుతున్నాయి. 24 అసలు ప్రారంభం కాలేదు. కేడబ్ల్యూడీ కాలువల్లో 245 చోట్ల పనులు ప్రతిపాదించగా 182 పూర్తి చేశారు. 63 పనులు కొనసాగుతున్నాయి. గుంటూరు ఛానల్‌ పరిధిలో 49 పనులు ప్రతిపాదించగా కేవలం మూడు మాత్రమే పూర్తిచేశారు. నాలుగు చోట్ల పూడిక తొలగింపు కొనసాగుతోంది. 42 చోట్ల అసలు పనులే ప్రారంభించలేదు. ఈ విధంగా 99 వర్కులు అసలు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ మధ్యలో ఉండటంతో కాలువలు, డ్రెయిన్లలో నీరు ప్రవహిస్తోంది. ఇప్పుడు పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. జలవనరులు శాఖ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు వరకు కాలువలు, డ్రెయిన్లలో నీటి ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పటివరకు ఉపాధి హామీ కింద పూడిక తొలగింపు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం వచ్చే సీజన్‌లోనైనా ఆయా పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.