నీరు పారని కాలువలు

ABN , First Publish Date - 2022-06-30T05:25:45+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని సాగనీటి కాల్వల్లో నీరు పారడడం లేదు.

నీరు పారని కాలువలు
గడివేములలో కేసీ కెనాల్‌ తూముల దుస్థితి

  1. మూడేళ్లుగా మరమ్మతుల ఊసే లేదు 
  2. టీజీ, కేసీలకు సాగని లైనింగ్‌ పనులు
  3. దశాబ్దాలుగా ఎల్లెల్సీ మరమ్మతులు
  4. ఏటా చివరి ఆయకట్టుకు అందని నీరు 
  5. జీవో.365 జారీ.. తడిసి మోపెడైన వ్యయం 

కర్నూలు (అగ్రికల్చర్‌), జూన 29:  

ఉమ్మడి జిల్లాలోని సాగనీటి కాల్వల్లో నీరు పారడడం లేదు. మూడేళ్లుగా శాశ్వత మరమ్మతులు చేయడం లేదు. దీంతో అరగొరగానే నీరు పారుతోంది. చివరి ఆయకట్టు ఎండిపోతోంది. ఈ నెలాఖరుకు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కాలువలకు నీరు విడుదల చేస్తామని గత నెలలో జరిగిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. మరి  8 లక్షల ఎకరాలకు సాగునీటి మాట ఏమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. 


ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పనులు ఆరంభమయ్యాయి. సాగునీటి కాలువల్లో నీరు పారుతుందని నమ్మకం కలగడం లేదు. గత నెలలో జరిగిన ఐఏబీ సమావేశంలో ఈ నెల చివరికిగాని, జూలై ఆరంభంలో గాని జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని తీర్మానించారు. కానీ నీరు పారేందుకు కాలువలు అనుకూలంగా లేవు. చాలా కాలువలకు గండ్లు పడి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నీరు వదిలితే పక్కన ఉన్న పొలాలు మునిగిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత మూడేళ్లుగా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి కాలువలకు శాశ్వత మరమ్మతులు చేయలేదు. దీంతో కాలువలకు పూర్తి స్థాయిలో నీరు వదిలే పరిస్థితి లేదు. 2009లో కేసీ కెనాల్‌, ఎల్లెల్సీ, హంద్రీనీవా, తెలుగుగంగ, ఎస్సార్బీసీ తదితర కాలువలకు భారీగా గండ్లు పడ్డాయి. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేసి.. వాటితోనే ఏటా అరకొరగా సాగునీరును అందిస్తున్నారు. కేసీ కెనాల్‌ గండ్లను శాశ్వతంగా పూడ్చేందుకు ఆసియా అభివృధ్ది బ్యాంకు నుంచి రూ.550 కోట్ల రుణం వస్తుందని, నీటి పారుదల శాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులతోనే  పుణ్యకాలం గడిచిపోయేలా ఉంది. హంద్రీనీవా ప్రధాన కాలువతో పాటు పందికోన, ఇతర పంట కాలువల పనుల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చకచకా జరిగిన పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో చేసిన పనులు తామెందుకు కొనసాగించాలనే కక్ష ధోరణితో 365 జీవోను జారీ చేసి మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. అయితే ఈ పనులకు సంబంధించిన వ్యయం తడిసి మోపెడయింది. రూ.250 కోట్లతో ఎస్టిమేషనను  తయారు చేస్తున్నామని సంబంధిత ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నిధులు ఇచ్చే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ తదితర ప్రధాన కాలువల పరిస్థితి కూడా ఇదే విధంగా నెలకొంది. 

కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతుల వెతలు: 

బ్యారేజీకి 100 మీటర్ల దూరంలో కాలువకు పడిన గండిని శాశ్వతంగా పూడ్చకుండా తాత్కాలిక మరమ్మతులతోనే మమ అనిపించారు. ఈ ప్రాంతంలోనే కాలువ లైనింగ్‌ కొట్టుకుపోయింది. ఆర్‌.కొంతలపాడు సమీపంలో కాలువ లైనింగ్‌ పోయింది. నీరు వదిలితే  తెగిపోయే ప్రమాదం ఉంది. ఆర్‌కే దుద్యాల 4 కి.మీల వద్ద కాలువగట్టుపై ముళ్లకంపలు పెరిగిపోయి పగుళ్లు ఇచ్చింది. 8.16, 18 నెంబరు కి.మీ వద్ద 200 మీటర్లకు పైగా కాలువ లైనింగ్‌ ఛిద్రమై రాళ్లు తేలాయి. నిడ్జూరు, మునగాలపాడు వంతెన సమీపంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 5,7,9,15 కి.మీల దగ్గర అసలు కాలువకు లైనింగే లేదు. కర్నూలు నగరంలోని కాలువ ప్రవేశించే ప్రాంతం నుంచి 2 కి.మీలకు పైగా కాలువలో ఎక్కడ పడితే.. అక్కడ చెత్త పేరుకుని పోయింది. నగర పరిధిలో డ్రైనేజీ నీరు పెద్ద మొత్తంలో కెనాల్లోకి వదులుతుండటంతో పూడికతో పాటు చెత్త భారీగా పేరుకుపోయింది. పడిదెంపాడు సమీపంలో రెండు చోట్ల కాలువకు  గండి పడింది. దాన్ని  పూడ్చలేదు. నంద్యాల పరిధిలో సంతజూటూరు నుంచి చాగలమర్రి వరకు కాలువ అధ్వానంగా తయారైంది. ఈ ప్రాంతంలో రబ్బరు, పూల చెట్లు పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ ప్రాంత పరిధిలోని కాలువ షెట్టర్లు 5 దశాబ్దాలకు పైగా మరమ్మతులకు నోచుకోలేదు. దీని వల్ల ఏటా వర్షాకాలంలో కాలువకు గండ్లు పడుతున్నాయి. సుంకేసుల జలాశయం నుంచి  కేసీ కాలువ  చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తున్నారు. కనీసం జలాశయాన్నైనా పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.  

తెలుగు గంగ ఆయకట్టుకు ఇదే పరిస్థితి..  

ముందుకు సాగని లైనింగ్‌ పనులు: 

తెలుగు గంగ ప్రాజెక్టు ప్రధాన కాలువ వెలుగోడు రిజర్వాయరు నుంచి ప్రారంభమై చెన్నై వరకు 407 కి.మీలు  వెళ్తుంది. ఇది దశాబ్దాల కిందట  నిర్మాణం కావడం,  పాలకులు కాలువ నిర్వహణపై శ్రద్ధ్ద పెట్టకపోవడంతో క్రమేణా తెలుగు గంగ ప్రధాన కాలువ శిథిలావస్థకు చేరింది. దీంతో స్థిరీకరించిన ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందించలేని పరిస్థితి నెలకొంది. వేలాది ఎకరాల విస్తీర్ణం ఇప్పటికీ బీడుగానే ఉంది.  ఈ కాలువకు మరమ్మతులు చేయాలని అధికారులు ఎన్నో దఫాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.  కాలువకు లైనింగ్‌ పనుల కోసం రూ.280 కోట్ల నిధులను గతంలో కేటాయించారు. వెలుగోడు ప్రాంతంలో 0 నుంచి 18 కి.మీల మద్యలో ప్రధానంగా మూడు చోట్ల పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే.. కాంట్రాక్టర్లు తమకు ప్రయోజనం చేకూర్చే  పనులను మాత్రమే పూర్తి చేశారు.  మిగిలిన పనులపై నిర్లక్ష్యం చూపారు.   ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో 50 కి.మీల పొడవునా ఈ కాలువ ఉంది. కట్ట బలహీనంగా మారి..  తెగే పరిస్థితి ఏర్పడింది.  దాదాపు 30 నుంచి 40 ప్రాంతాలను అధికారులు గుర్తించి టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వీటిని పూర్తి చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

 దశాబ్దాలు ఎల్లెల్సీ  లైనింగ్‌ పనులు : 

ఈ కాలువ  లైనింగ్‌ పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. ఈ కాలువ 1 కిమీ నుంచి 250 కి.మీల వరకు కర్ణాటక సరిహద్దులో ఉంది. 251వ కి.మీల నుంచి 350 కి.మీ వరకు ఆంధ్ర సరిహద్దు కాల్వ నుంచి 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఖరీప్‌, రబీ సీజన్లలో 1.52 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. అయితే.. కాలువ ఆధునికీకరణ పనులు 2008-09 నుంచి నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.  కాలువ ఆధునికీకరణకు రూ.180 కోట్లు విడుదల చేశారు. ఈ లైనింగ్‌ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని 16 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పూర్తి చేశారు. అయితే.. 13 సంవత్సరాలు కావస్తున్నా ఈ పనులు పూర్తి కాలేదు. మరో వైపు చేసిన పనుల్లో కూడా నాణ్యత లేక అప్పుడే పగుళ్లు ఇచ్చాయి. ఈ పనుల కోసం రూ.126 కోట్ల దాకా వ్యయం చేశారు. మిగిలిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ కాలువలో నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రస్తుతం లైనింగ్‌ పనులను కొనసాగిస్తున్నారు.   ఈ కాలువ ఆయకట్టకు కేటాయించిన 24 టీఎంసీలల్లో కర్ణాటక ప్రాంతంలో నీటి చౌర్యం కారణంగా దాదాపు 5 టీఎంసీల నీరు జిల్లాకు అందని పరిస్థితి నెలకొంది. బళ్లారి నుంచి మోకా వరకు 1 నుంచి 250 కి.మీల వరకు సుమారు 50వేల ఎకరాల అక్రమ ఆయకట్టు కర్ణాటక ప్రాంతంలో సాగులో ఉంది. దీంతో మన వాటా నీటిని అంతా అక్కడే మళ్లించుకుంటున్నారు.  

ఎస్సార్బీసీ, గురు రాఘవేంద్ర, గాజులదిన్నె, హంద్రీనీవాలోనూ ఇదే పరిస్థితి:  

ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ) ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు పైగా నీరందిస్తున్నారు.   ఎల్లెల్సీ ప్రాంతంలో నీరందని ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో సాగునీటిని అందించేందుకు గురు రాఘవేంద్ర ప్రాజెక్టును నిర్మించారు.  దాదాపు 9 లిఫ్టుల ద్వారా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 50వేల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే.. కేవలం 20వేల ఎకరాలకు మాత్రమే ప్రస్తుతం సాగునీరు అందుతోంది. లిఫ్టు స్కీముల నిర్వహణను రైతు కమిటీలకే అప్పగించారు. ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో లిఫ్టు స్కీములను నిర్వహించడం తలకు మించిన భారంగా రైతులు భావిస్తున్నారు. ఈ స్కీముల నిర్వహణకు విద్యుత బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. అందువల్లనే ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో నీరందించలేని పరిస్థితి నెలకొంది. శ్రీశైలం కుడి కాలువ ద్వారా లక్ష ఎకరాలకు పైగానే సాగునీటిని అందిస్తామని చెప్పిన పాలకులు నేటికీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేదు. దీంతో రైతులు ఏటా పొలాలను బీడు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో బీడు భూములకు దాదాపు 32 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన గాజులదిన్నె ప్రాజెక్టు పూర్తిగా శిథిలమైపోయింది.  జైకా నిధులతో రూ.44 కోట్లతో చేపట్టిన పనులు నాణ్యత కోల్పోయాయి. 2011-12 నుంచి ఈ పనులు చేపట్టారు. అధికారులు ఈ పనుల గడువును పెంచుకుంటూ వచ్చారు. మరో పక్క ముగిసిన పనుల్లో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 24వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. కుడి కాలువ 36 కి.మీలు, ఎడమ కాలువ 26 కి.మీలు విస్తరించి ఉంది. జైకా నిధులతో రూ.44 కోట్లతో కుడి కాలువ 27.65 కి.మీల వరకు ఎడమ కాలువను 17.3 కి.మీ వరకు సిమెంటు లైనింగ్‌ చేశారు. నిబంధనల మేరకు ఈ ప్రాజెక్టు పనులు 2014కే పూర్తి కావాలి.  హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాలో 80వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. కేవలం 37వేల ఎకరాలకు మాత్రమే నీరందించగలమని ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 2018లో ఈ ప్రధాన కాలువకు శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల మొదలైంది. అయితే ఇది నామమాత్రమే.  23వ ప్యాకేజీ నుంచి 26వ ప్యాకేజీ వరకు కొంత వరకు పనులు పూర్తి చేసి 15వేల ఎకరాలకు నీరందిస్తున్నారు.  మంత్రి జయరాం నియోజకవర్గంలో 27, 28, 29 ప్యాకేజీల్లోని పనులు పూర్తి కాకపోవడం వల్ల 51వేల ఎకరాలకు గాను  20వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది.  


ఉమ్మడి జిల్లాలో ప్రధాన కాలువల ద్వారా అందుతున్న ఆయకట్టు వివరాలు: 

----------------------------------------------------------------------------------------

కాలువ నీరు అందించేందుకు స్థిరీకరించిన ఆయకట్టు (ఎకరాల్లో) 

----------------------------------------------------------------------------------------

కేసీ కెనాల్‌ 2,65,000

ఎల్లెల్సీ 1,51,134

తెలుగు గంగ 1,37,000

ఎస్సార్బీసీ 98,770

హంద్రీనీవా 80,000

గురు రాఘవేంద్ర 66,815

గాజులదిన్నె 32,000

ఎత్తిపోతల ద్వారా 87,453

సిద్ధ్దాపురం 23,000

--------------------------------------------------------------------------

మొత్తం 8.90లక్షల ఎకరాలు (దాదాపు)

ఇందులో కాలువల సామర్థ్యం దెబ్బతినడం వల్ల సగం విస్తీర్ణానికి మించి నీరందించలేని పరిస్థితి నెలకొంది. 

--------------------------------------------------------------------------


8 లక్షల ఎకరాలకు నీరందిస్తాం

ఈసారి వర్షాలు బాగా కురిసి జలాశయాలకు ఆశించిన మేర నీరు  చేరితే.. దాదాపు 8లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తాము. గతంలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న కాలువలకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా మరమ్మతులు చేశాము. ఆయకట్టుకు నీరందించేందు కోసం ఈ కాలువలు పటిష్టంగానే ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  జలాశయాలు, కాలువల మరమ్మతులకు ప్రభుత్వవం మా ప్రతిపాదనల మేరకు నిధులు అందిస్తున్నది. లక్ష్యం మేరకు ఈ పనులు పూర్తి చేస్తాం.

  - మురళీధర్‌ రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌: 





Updated Date - 2022-06-30T05:25:45+05:30 IST