పూడికతీత.. బాయ్‌కాట్‌

ABN , First Publish Date - 2022-01-18T14:00:43+05:30 IST

నాలాల పూడికతీత పనులపై సందిగ్ధం నెలకొంది. టెండర్లలో పాల్గొనవద్దని కాంట్రాక్టర్లు నిర్ణయించిన నేపథ్యంలో ఈ యేడాది పనులు జరుగుతాయా, లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది

పూడికతీత.. బాయ్‌కాట్‌

 టెండర్లకు స్పందన కరువు

 పాల్గొనవద్దని కాంట్రాక్టర్ల నిర్ణయం

 బిల్లులు పెండింగ్‌లో ఉండడమే కారణం

 కొనసాగుతోన్న విజిలెన్స్‌ విచారణ

 50 శాతం చెల్లింపునకు ఇటీవల ఓకే

 కాంట్రాక్టర్ల తీరుపైనా విమర్శలు


హైదరాబాద్‌ సిటీ: నాలాల పూడికతీత పనులపై సందిగ్ధం నెలకొంది. టెండర్లలో పాల్గొనవద్దని కాంట్రాక్టర్లు నిర్ణయించిన నేపథ్యంలో ఈ యేడాది పనులు జరుగుతాయా, లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పలు జోన్లలో ప్రతిపాదనలు రూపొందించి టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించినా  స్పందన లేదని ఇంజనీరింగ్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. కొన్ని సర్కిళ్లలో మాత్రం ఒకటి, రెండు బిడ్‌లు దాఖలైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే వర్షాకాలంలో పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 


ప్రతి యేటా చేపట్టే నాలాల పూడికతీతలో అవినీతి, అక్ర మాలు జరుగుతాయన్న ఆరోపణలున్నాయి. 2021 సంవత్సరానికి సంబంధించిన పూడికతీత పనులపై పౌరుల నుంచి ఫిర్యాదులు అందాయంటూ అధికారులు విజిలెన్స్‌ విచారణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు ప్రొఫార్మాల్లో ఇంజనీర్లను విజిలెన్స్‌ అధికారులు వివరాలు అడిగినట్టు తెలిసింది. పూర్తిస్థాయిలో సమాచారం రాలేదని, మరిన్ని వివరాలు రావాల్సి ఉందని విజిలెన్స్‌ విభాగం చెబుతోంది. ఈ క్రమంలో ఉన్నతాధికారులకు నివేదిక  సమర్పణలో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. 


ముంపు ముప్పు నేపథ్యంలో..

2020 అక్టోబర్‌లో గ్రేటర్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ముంపు ముప్పునకు వ్యర్థాలు తొలగించక పోవడమూ కారణంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో 2021లో పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. రూ.45 కోట్లతో గతేడాది పూడికతీత పనులు చేపట్టారు. పలు ప్రాంతాల నుంచి పనుల తీరుపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ విచారణ మొదలైంది. ఈ క్రమంలో విచారణ పూర్తయ్యే వరకు బిల్లులు చెల్లించవద్దని అన్ని జోన్ల అధికారులకు సూచించారు. దీంతో గత డిసెంబర్‌ వరకు పైసా కూడా చెల్లించ లేదు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెడితే ఆర్థికంగా నష్టపోతామన్న కాంట్రాక్టర్ల విజ్ఞప్తి మేరకు 50శాతం బిల్లుల చెల్లింపునకు ఉన్నతాధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో పూడికతీత పనుల టెండర్లను బహిష్కరించాలని కాంట్రాక్టర్ల సంఘం నిర్ణయించింది. కొన్ని సర్కిళ్లలో అధికారుల సూచన మేరకు ఒకటి, రెండు బిడ్‌లు దాఖలైనట్టు సమాచారం.


మార్చి, ఏప్రిల్‌కైనా...

2022కు సంబంధించి ఇప్పటికీ టెండర్‌ ప్రక్రియ పూర్తవలేదు. కొన్ని సర్కిళ్లలో ప్రతిపాదనలూ సిద్ధం చేయలేదని కేంద్ర కార్యాలయంలోని ఓ అధికారి చెప్పారు. సాధారణంగా టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలనుంచి రెండు నెలలు పడుతుంది. కాంట్రాక్టర్ల అనాసక్తి నేపథ్యంలో ఈ యేడాది మార్చి, ఏప్రిల్‌ నాటికి ఏజెన్సీల ఎంపిక పూర్తవుతుందా, లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


తప్పులు బయటపడతాయనే..

టెండర్‌ బహిష్కరించాలన్న కాంట్రాక్టర్ల తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి, అక్రమాల ఆరోపణలున్న నేపథ్యంలో విచారణ తప్పదని చెబుతున్నారు. విజిలెన్స్‌ విచారణతో తప్పులు బయటపడతాయనే కొందరు అధికారుల సూచన మేరకు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనవద్దని నిర్ణయం తీసుకున్నారని, అయినా సమగ్ర విచారణ జరిపి అక్రమాలపై నివేదిక ఇస్తామని విజిలెన్స్‌ విభాగం చెబుతోంది. ‘కాంట్రాక్టర్ల నిర్ణయం ఒక రకంగా బ్లాక్‌ మెయిల్‌ చేయడమే. 50 శాతం బిల్లులు చెల్లించేందుకు అంగీకరించాం. ఇంకా వారికేం ఇబ్బంది’ అని ఓ అధికారి పేర్కొన్నారు.

Updated Date - 2022-01-18T14:00:43+05:30 IST