టీడీపీ నేత తోటలోకి డ్రైనేజీ నీరు

ABN , First Publish Date - 2022-09-24T05:28:43+05:30 IST

తెలుగు యువత అనంతపురం జిల్లా కార్యదర్శి పరిమి చరణ్‌ కుమార్‌కు చెందిన అరటి తోటలోకి వైసీపీ స్థానిక నేతలు డ్రైనేజీ నీటిని మళ్లించారు.

టీడీపీ నేత తోటలోకి డ్రైనేజీ నీరు
అధికారులను ప్రశ్నిస్తున్న పరిమి చరణ్‌, టీడీపీ నాయకులు

ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర

పంచాయతీ అధికారుల ద్వారా 

కాలువ తవ్వించిన వైసీపీ నేతలు

హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు 

కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన

యాడికి, సెప్టెంబరు 23: తెలుగు యువత అనంతపురం జిల్లా కార్యదర్శి పరిమి చరణ్‌ కుమార్‌కు చెందిన అరటి తోటలోకి వైసీపీ స్థానిక నేతలు డ్రైనేజీ నీటిని మళ్లించారు. ఆయనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు రాయలచెరువు గ్రామ పంచాయతీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ పని చేశారని బాధితుడు వాపోయారు. ఆయన తెలిపిన కథనం మేరకు.. జిల్లాలోని యాడికి మండలంలో ఉన్న రాయలచెరువు ప్రాంతానికి చెందిన చరణ్‌ కుమార్‌ అరటి తోటలో గ్రామ పంచాయతీ అధికారులు, వైసీపీ నాయకులు కలిసి యంత్రాల సాయంతో కొన్ని రోజుల కిందట డ్రైనేజీ కాలువను అక్రమంగా తవ్వారు. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో తాము ఆ పనులను చేయించలేదని పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పరిమి చరణ్‌ హైకోర్టును ఆశ్రయించి, అధికారులకు నోటీసులు పంపారు. హైకోర్టు నోటీసులను కూడా లెక్క చేయకుండా పంచాయతీ అధికారులు, వైసీపీ నేతలు నాలుగురోజుల క్రితం చరణ్‌ తోటవద్దకు  పారిశుధ్య కార్మికులను పంపించారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రైనేజీ నీటిని చరణ్‌ తోటలోకి మళ్లించారు. దీంతో 0.56 ఎకరం అరటి పంటలో మురుగునీరు చేరింది. శుక్రవారం తోటవద్దకు వెళ్లి పరిశీలించిన చరణ్‌, అరటిలో మురుగునీరు ఉండడాన్ని చూసి పంచాయతీ కార్యదర్శికి ఫోన చేశారు. దీంతో ఆయన తనకు సబంధం లేదని, తాను ఆ పని చేయించలేదని తెలిపారు. దీంతో ఆగ్రహించిన పరిమి చరణ్‌.. పంచాయతీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఆయనకు మద్దతుగా టీడీపీ నాయకులు అక్కడకు చేరుకొని బైఠాయించారు. సమాచారం అందుకున్న ఎంపీడీవో(ఎ్‌ఫఏసీ) వెంకటేశ్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి టీడీపీ నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. డ్రైనేజీ నీటిని ఎవరు మళ్లించారో వెల్లడించాల్సిందేనని టీడీపీ నాయకులు పట్టుబట్టారు. దీంతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.  

దెబ్బతీయాలని


చూస్తున్నారు : పరిమి చరణ్‌ 

రాయలచెరువు గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు కుమ్మక్కయి తనను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని చరణ్‌ అన్నారు. అందుకే అరటి తోటలోకి డ్రైనేజీ నీటిని మళ్లించారన్నారు. పారిశుధ్య కార్మికులు తోటలోకి డ్రైనేజీ నీటిని మళ్లించారని ప్రత్యక్షంగా చూసిన ఓ బాలుడు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే తనపై అక్రమంగా 11 కేసులు పెట్టారని, వాటికి భయపడకుండా టీడీపీలో చురుకుగా పనిచేస్తున్నానని, అందుకే ఆర్థికంగా దెబ్బతీయాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని అన్నారు.  




Updated Date - 2022-09-24T05:28:43+05:30 IST