కలుషిత నీరు తాగి..

ABN , First Publish Date - 2021-05-07T05:56:19+05:30 IST

నగర పాలక సంస్థ పరిధిలోని 28వ వార్డు లక్ష్మీపురంలో కలుషిత నీటి సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కలుషిత నీరు తాగి..

కల్లూరు, మే 6: నగర పాలక సంస్థ పరిధిలోని 28వ వార్డు లక్ష్మీపురంలో కలుషిత నీటి సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కర్నూలు కార్పొరేషన్‌లో లక్ష్మీపురం గ్రామం విలీనమై ఏడాది గడిచినా నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్‌ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. హంద్రీనదిలోని బోరుబావుల ద్వారా సరఫరా  చేస్తున్న నీరు క్లోరినేసన్‌ చేయకుండా ప్రజలకు అందించడంతోనే అనారోగ్యాల బారిన పడుతున్నట్లు ఎస్సీ కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హంద్రీనదిలో డ్రైనేజీ నీరు కలిసి ఆ నీరు కలుషితమవుతున్నా నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని లక్ష్మీపురం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 హంద్రీనదిలో కలుస్తున్న డ్రైనేజీ నీరు 


28వ వార్డు లక్ష్మీపురం హంద్రీనదిలోని నాలుగు బోరుబావుల ద్వారా మున్సిపల్‌ అధికారులు నీరు సరఫరా చేస్తున్నారు. డ్రైనేజీ నీరు నేరుగా హంద్రీనదిలో కలుస్తోందని ఎస్సీ కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవలె జడ్పీ హైస్కూల్‌ సెప్టిక్‌ ట్యాంకు లీకై వ్యర్థాలు హంద్రీలో కలుస్తున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ కాలనీకి నీటి సరఫరా చేస్తున్న బోరుబావులోని నీరు కలుషితమైందని, క్లోరినేషన్‌ చేయకుండా విడుదల చేయడం వల్లే ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గురువారం ఎస్సీ కాలనీలోని పలువురు వాంతులు, వీరేచనాలతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు స్పందించి డ్రైనేజీనీరు హంద్రీనదిలో కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-05-07T05:56:19+05:30 IST