సాహా వ్యాఖ్యలు బాధించలేదు.. రాహుల్ ద్రవిడ్

ABN , First Publish Date - 2022-02-21T23:47:48+05:30 IST

జట్టు ఎంపికలో ఇకపై తన పేరును పరిగణనలోకి తీసుకోబోమని, కాబట్టి రిటైర్ అయిపొమ్మని కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు

సాహా వ్యాఖ్యలు బాధించలేదు.. రాహుల్ ద్రవిడ్

న్యూఢిల్లీ: జట్టు ఎంపికలో ఇకపై తన పేరును పరిగణనలోకి తీసుకోబోమని, కాబట్టి రిటైర్ అయిపొమ్మని కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు సూచించారంటూ వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలపై ద్రవిడ్ స్పందించాడు. సాహా వ్యాఖ్యలు తనను బాధించలేదని పేర్కొన్నాడు. ఇండియన్ క్రికెట్‌కు అతడు అందించిన సేవలు, సాధించిన విజయాలపై తనకు ఎంతో గౌరవముందన్నాడు. ఆటగాళ్లతో తాను నిత్యం మాట్లాడుతుంటానని, అంతమాత్రాన తాను చెప్పే ప్రతీ దానినీ ప్రతిసారి ఏకీభవిస్తారని తాను అనుకోవడం లేదన్నాడు. కొన్ని సందర్భాల్లో కఠినంగా కూడా మాట్లాడాల్సి వస్తుందని, అంతమాత్రాన దాని లోపలికి వెళ్లి తీవ్రంగా ఆలోచించాల్సిన పనిలేదన్నాడు.


జట్టును ఎంపిక చేయడానికి ముందు ప్రతీ ఆటగాడితో మాట్లాడడం తనకు అలవాటని అన్నాడు. ఇలా మాట్లాడినప్పుడు ఆటగాళ్లు కొన్నిసార్లు బాధపడడం సహజమేనని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. రిషభ్ పంత్ ఇప్పటికే నంబర్ వన్ కీపర్‌గా నిరూపించుకున్నాడని, కాబట్టి సాహాకు అవకాశాలు రావడం కష్టమేనని అన్నాడు.  పంత్ నంబర్ వన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడని, ఇప్పుడు యువ వికెట్ కీపర్ (కేఎస్ భరత్)ను రెడీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అంతమాత్రాన సాహాపై తనకున్న గౌరవం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు.

Updated Date - 2022-02-21T23:47:48+05:30 IST