తూతూమంత్రం

ABN , First Publish Date - 2021-09-16T06:46:19+05:30 IST

కీలకమైన డీఆర్సీ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కనీస చర్చ కూడా జరగలేదు.

తూతూమంత్రం
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి విశ్వరూప్‌, వేదికపై మంత్రులు బాలినేని, సురేష్‌, ఎంపీ మాగుంట, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

సమస్యల ప్రస్తావనే లేని డీఆర్సీ సమావేశం 

ఇసుక విధానాన్ని తప్పుపట్టిన ప్రజాప్రతినిధులు

ప్రభుత్వ పాలసీపై ఽవైసీపీ నేతలే ధ్వజం 

దాడులు ఆపాలంటూ సెబ్‌ అధికారులకు హుకుం 

వెలిగొండ విషయంలో టీడీపీపై విమర్శలు

జిల్లాలో పాలన, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై స్పందన కరువు

ఎంతో ముఖ్యమైన డీఆర్సీ సమావేశం మొక్కుబడిగా సాగింది. ప్రభుత్వ ఇసుక విధానంపై జిల్లాలోని అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. అంతేగాక స్థానికంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న సెబ్‌ అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ట్రాక్టర్లలో ఇసుక రవాణాను అడ్డుకుంటే ఒప్పుకోబోమంటూ హుకుం జారీచేశారు. ఇంకోవైపు వెలిగొండ ప్రాజెక్టు కోసం టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలను హేళన చేశారు. గెజిట్‌ అంశాన్ని ప్రస్తావించారు తప్ప రాయలసీమలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకు  నీటిసమస్య ఎదురయ్యే విషయాన్ని మాత్రం ఎవ్వరూ ప్రస్తావించలేదు. ఇక జిల్లాలో పాలన తీరు, ఆయా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుతెన్నులపై డీఆర్సీ సమావేశంలో కనీస చర్చ కరువైంది. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి విశ్వరూప్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతోపాటు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యులు హాజరుకాగా.. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు. 

 (ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

కీలకమైన డీఆర్సీ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కనీస చర్చ కూడా జరగలేదు. అయితే జిల్లాలో తక్షణ  సమస్యలకు అనుగుణంగా సాగర్‌ నీటి సరఫరా, వెలిగొండ ప్రాజెక్టు, ఇసుక విధా నంపై అధికంగా చర్చించారు. కారణాలు ఏమైనా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి విశ్వరూప్‌ అధ్యక్షతన బుధవారం ప్రకా శం భవన్‌లో డీఆర్సీ సమావేశం జరిగింది. ఒక పద్ధతి ప్రకారం సమావేశాన్ని నిర్వహించేందుకు కలెక్టర్‌ ప్రయ త్నించినప్పటికీ సఫలం కాలేకపోయారు. ఇసుక రవాణా ను అధికారులు అడ్డుకోవటంపై ప్రధాన చర్చ జరిగింది. ఎస్‌ఎన్‌పాడు, దర్శి ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, వేణుగో పాల్‌  ఈ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. స్థానిక వనరుల నుంచి సొంత అవసరాల కోసం ఇసుక తీసుకె ళ్తున్న ప్రజలను అడ్డుకోవటం, భారీగా జరిమానాలు వేయటం సమంజసం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 


స్థానికులను అడ్డుకుంటే కుదరదు

ఇసుక సమస్యపై మంత్రి బాలినేని కూడా స్పందిస్తూ జేపీ వెంచర్‌ అనే ప్రైవేటు సంస్థకు ఇసుక విక్రయాన్ని ప్రభుత్వం అప్పజెప్పిన తర్వాత వారికి అండగా మీరెందుకు స్పందిస్తున్నారంటూ సెబ్‌ అధికారులను ప్రశ్నించారు. మీరు అక్రమ లిక్కర్‌ విక్రయాన్ని, నాటుసారా తయారీని అడ్డుకోండి చాలంటూ ఆ శాఖ అధికారులపై వ్యంగ్యాస్ర్తాలతో విమర్శలు కూడా చేశారు. ట్రాక్టర్లతో ఇసుక తోలుకునే స్థానికులను అడ్డుకుంటే కుదరదని హెచ్చరించారు. సమావేశంలో పాల్గొన్న ఒకరిద్దరు మినహా మిగిలిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులంతా మంత్రి సూచనలను సమర్థించారు.  సెబ్‌ జిల్లా అధికారి ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేసి అమ్ముకునే వారినే పట్టుకుంటున్నామని, చిన్న చిన్న అవసరాలకు ఇసుక తోలుకునే వారిని అడ్డుకోవటం లేదని చెప్పే ప్రయత్నం చేయగా ఎవరూ వినిపించుకోలేదని తెలిసింది. అంతేగాక వేలాది రూపాయల జరిమానాను వేయటాన్ని వెంటనే నిలిపివేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులకు గట్టిగా సూచించినట్లు తెలిసింది. దీంతో అధికారులు ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ముందుకు పోతున్నామని చెబుతూ అక్రమ రవాణాను ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిలిపివేయటమా లేదా అన్న విషయంపై హామీ ఇవ్వకుండా మిన్నకుండిపోయినట్లు సమాచారం. 


వెలిగొండపై టీడీపీ నేతలది అవగాహన రాహిత్యమని విమర్శలు 

సమావేశంలో వెలిగొండ ప్రాజెక్టు అంశంపై చర్చ జరిగింది. ఆ సందర్భంగా తూర్పు ప్రాంతానికి చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సరైన అవగాహన లేకుండా ఈ విషయంపై మాట్లాడుతున్నారని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు అవగాహన ఉండి కూడా ప్రాణత్యాగం చేస్తామంటూ శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అంతకుముందు మంత్రి సురేష్‌ మాట్లాడుతూ గెజిట్‌లో వెలిగొండను చేర్చకపోవటం అక్షరలోపమని కేంద్ర అధికారులు చెప్పడాన్ని, సవరించమని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాయటాన్ని ప్రస్తావించారు. ఈ విషయంపై పశ్చిమప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు చేసిన ప్రయత్నాలను విమర్శిస్తూ మాట్లాడారు. అయితే సీమ కోసం చేపట్టిన ఎత్తిపోతల పథకం ద్వారా వెలిగొండకు నీటి కేటాయింపులో అన్యాయం జరుగుతుందని, టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంకు రాసిన లేఖను కానీ, ఆ అంశాన్ని కానీ ఏమాత్రం ప్రస్తావించకపోవటం గమనార్హం. 


సాగర్‌ నీటిపై..

సాగర్‌ నీటి విడుదల, షెడ్యూల్‌ ప్రకటించకపోవటం, జిల్లాకు రావాల్సిన స్థాయిలో నీరు రాకపోవటం తదితర అంశాలపై ఎమ్మెల్యేలు బలరాం, వేణుగోపాల్‌, సుధాకర్‌బాబు మాట్లాడారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకి అవసరమైన నీటిని తీసుకోవాలని సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. ఈ నీటి వినియోగంలో సాగర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల మధ్య సమన్వయం లేదని బలరాం విమర్శించారు. కాలువల మరమ్మతులు జర గకపో వటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తదనంతరం గృహ నిర్మాణ ం, కొవిడ్‌ అంశాలపై స్వల్ప చర్చ జరిగింది. 


 పాలనపై చర్చ శూన్యం

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఆయా శాఖల పరిధిలో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పాలనా తీరుతెన్నులపై ఈ సమావేశంలో కనీసం చర్చ కూడా జరగలేదు. ఉదయం 10.50 ప్రాంతంలో ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2.25 సమయంలో ముగించేశారు. ఆ వెంటనే ఇన్‌చార్జ్‌ మంత్రి హడావుడిగా వెళ్లిపోయారు. ప్రతిసారీ ఇదే తంతు. ప్రస్తుతం జిల్లాలో రేషన్‌ కార్డులు, ఫించన్లు, విద్యుత్‌ బిల్లులు లాంటి అనేక సంక్షేమ పథకాల సమస్యలను ప్రజలు ఎదుర్కొం టున్నారు. అంతేగాక భూఆక్రమణలకు సంబంధించి అనేక విమర్శలు ఉన్నాయి. ఏ అంశాలపైనా చర్యకు అవకాశం ఇవ్వలేదు. కందుకూరు ఎమ్మెల్యే మహీధరరెడ్డి సింగరాయకొండ ప్రాంతంలో సక్రమంగా పనిచేయని కాంట్రాక్టర్‌కి పనులు ఇవ్వటాన్ని ప్రశ్నించగా, గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు భూఆక్రమణలపై విచారణ  పూర్తిస్థాయిలో న్యాయబద్ధంగా జరగటం లేదంటూ అనేక సూచనలు చేశారు.



Updated Date - 2021-09-16T06:46:19+05:30 IST