సామర్లకోట జలాశయం
- కాకినాడకు తలనొప్పిగా మారిన మంచినీటి వృథా
- అరట్లకట్ల, సామర్లకోట జలాశయాల ద్వారా నగరానికొచ్చే నీళ్లకు లీకుల బెడద
- రోజూ పైప్లైన్ల ద్వారా ఎనిమిది లక్షల మిలియన్ లీటర్లు వృథాగా పోతున్న వైనం
- వృథా అరికట్టడానికి కొత్తగా రూ.7.07 కోట్లతో వైర్లెస్ డిజిటల్ ఫ్లో మీటరింగ్ విధానం
- జలాశయాల నుంచి పంపుహౌస్, ఓవర్హెడ్లకు వెళ్లే పైప్లైన్ల లీకేజీలు టెక్నాలజీతో గుర్తింపు
- స్మార్ట్‌సిటీ నిధులతో స్విట్జర్లాండ్ నుంచి మీటర్ల కొనుగోలుకు నిర్ణయం
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లా కేంద్రం కాకినాడకు తరచూ ఎదురవుతున్న తాగునీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయిదు లక్ష లకుపైగా జనాభా ఉన్న నగరానికి డిమాండ్‌కు తగ్గట్లుగా మంచినీటి సరఫరా చేయడం కార్పొరేషన్‌కు తలకుమించిన భారంగా మారింది. వేసవిలో అనేక ప్రాంతాల్లో నిత్యం దాహం కేకలే. ముఖ్యంగా అందు బాటులో నీళ్లున్నా లీకుల బెడదతో వృథాగా పోతుందే ఎక్కువ. ఈనేపథ్యంలో వృథా అరికట్టడానికి కొత్తగా వైర్లెస్ డిజిటల్ ఫ్లో మీటరింగ్ విధానం ప్రవేశపెడుతున్నారు. రూ.7.70 కోట్లతో స్విట్జర్లాండ్ నుంచి ఈ మీటర్లు కొనుగోలు చేయనున్నారు. వీటిని జలాశయాలు, పంపుహౌస్‌ల వద్ద బిగించి అక్కడ పంపింగ్ చేసేదెంత? ఇక్కడకు వచ్చేదెంత? తదితర లెక్కలు ఆన్లైన్ మీటర్ రీడిండ్ ద్వారా లెక్కిస్తారు.
వృథాకు చెక్ పడేనా..
అయిదు లక్షలకుపైగా ఉన్న కాకినాడ నగర జనాభాకు గోదావరి నీళ్లే తాగునీటికి ఆధారం. కాలువల ద్వారా వచ్చే గోదావరి జలాలను అధికారులు సామర్లకోటలో సాంబమూర్తి రిజర్వాయర్, అరట్లకట్లలో మరో జలాశయంలో నిల్వ చేస్తున్నారు. సాంబమూర్తి రిజర్వాయర్ నీటిని కాకినాడ, పెద్దాపురం ప్రాంతాలకు, అరట్లకట్ల నుంచి పూర్తిగా కాకినాడకు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ రెండు జలాశయాల నుంచి కాకినాడ విక్టోరియా వాటర్‌వర్క్స్, సురేష్‌నగర్ పంపుహౌస్‌కు నీటిని పంపింగ్ చేస్తారు. ఇక్కడ నీటిని పూర్తిస్థాయిలో శుద్ధిచేసి అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులకు ఎక్కిస్తారు. అక్కడి నుంచి ఇంటింటికీ తాగునీటి సరఫరా చేస్తా రు. ఈ ప్రక్రియలో అడుగడుగునా నీటి వృథా ఎక్కువగా జరుగుతోంది. జలాశయాల నుంచి ముడి నీటిని పంపింగ్ చేసిన తర్వాత శుద్ధి జరిగే పంపుహౌస్‌లకు వచ్చేవరకు పదిహేను కిలోమీటర్ల మధ్య లో పైప్లైన్లకు భారీగా లీకులు జరుగుతున్నాయి. పైపుల సామర్థ్యం తగ్గిపోవడం, రంధ్రాలు, బయటకు కనిపించకపోవడం, గోదావరి కాలువలు, పంటపొలాల అడుగున పైపులు ఉండడంతో నీటి వృథాను అరికట్టలేని పరిస్థితి. దీంతో జలాశయాల నుంచి పంపింగ్ చేసిన నీటి పరిమాణం పంపుహౌస్‌ల వద్దకు వచ్చేసరికి భారీగా తగ్గిపోతోంది. దీంతో నీటికొరత తీవ్రమవుతోంది. వేసవిలో గోదావరి కాలువల ద్వారా జలాశయాలకు నీరు వచ్చేదే తక్కువ.. ఆపై లీకులతో పంపుహౌస్‌ల వద్దకు వచ్చేసరికి ఇంకా తగ్గిపోతోంది. తీరా శుద్ధిచేసిన తర్వాత వాటర్‌ట్యాంకులకు వెళ్లే దారిలో మరికొంత వృథా అవుతోంది. ఇలా రోజుకు ఎనిమిది లక్షల మిలియన్ లీటర్ల నీళ్లు వృథా అవుతున్నాయి. ఈనేపథ్యంలో మున్ముందు తాగునీటి సమస్య మరింత తీవ్రం అవకుండా, నీటివృథాను అరికట్టడానికి అధికారులు కొత్తగా వైర్లెస్ డిజిటల్ ఫ్లో మీటరింగ్ విధానం అమలుచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం స్విట్జర్లాండ్ దేశం నుంచి రూ.7.07 కోట్ల విలువైన మీటర్లు కొనుగోలు చేయబోతున్నారు. ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇవి అందుబాటులోకి రాగానే రెండు జలాశయాల వద్ద పంపింగ్ జరిగే ప్రదేశంలో ఈ మీట ర్లు బిగిస్తారు. కాకినాడలోని రెండు పంపుహౌస్‌ల వద్ద ఇంకొన్ని బిగిస్తారు. ఆ తర్వాత ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల వద్ద మరికొన్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా ఏరోజుకారోజు జలాశయాల నుంచి ఎంత నీటిని పంపుహౌస్‌లకు పంపింగ్ చేశారో ఈ మీటర్లు రీడింగ్ నమోదు చేస్తాయి. ఆ నీళ్లు పంపుహౌస్‌ల వద్దకు చేసేసరికి ఎంత పరిమాణం వచ్చిందో ఇక్కడి మీటర్లు రీడింగ్ లెక్కిస్తాయి. తద్వారా అక్కడ పంప్ చేసినంత నీళ్లు ఇక్కడకు వచ్చాయా? లేదా? లేకపోతే ఎంత పరి మా ణం, ఎక్కడ నీళ్లు వృథా అయ్యాయో ఈ మీటర్లు సూచిస్తాయి. వీటిని సర్వర్‌కు లింకు చేసి కాకినాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆన్లైన్ ద్వారా సమీక్షించి, మంచినీటి వృథాకు చెక్ పెట్టనున్నారు.