Mohanlal : ‘దృశ్యం 3’ కు రంగం సిద్ధం..

Published: Sun, 14 Aug 2022 12:17:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Mohanlal : దృశ్యం 3 కు రంగం సిద్ధం..

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ (Mohnanlal).. నటించిన ‘ఎలోన్ (Alone), మాన్‌స్టర్ (Monster)’ మలయాళ చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. ఆయన మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన హిస్టారికల్ ఫాంటసీ మూవీ ‘బరోజ్’ (Barroz) కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఆయన నటించిన ఆంథలాజికల్ మూవీ ‘ఓలవుమ్ తీరవుమ్’ (Olavum Theeravum) సినిమాకి సైతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరో మూడు చిత్రాలు ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఆయన తాజా చిత్రం ‘రామ్’ (Ram) పార్ట్ 1 ఈ మధ్యే సెట్స్ పైకి వెళ్ళింది. వీటన్నిటితో పాటు అభిమానులు పండుగ చేసుకొనే వార్త ఏంటంటే.. ‘దృశ్యం 3’ (Drishyam 3) చిత్రానికి కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోనీ పెరుంబావూర్ (Antony Perumbavur) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఫ్రాంచైజీలో ఇదే ఆఖరి చిత్రం అవడం విశేషం. ‘దృశ్యం 3’ కంక్లూజన్ గా పోస్టర్ లో మెన్షన్ చేశారు మేకర్స్. 

2013 లో విడుదలైన ‘దృశ్యం’ (Drishyam) చిత్రం మొదటి భాగం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జార్జ్ కుట్టి అనే ఓ మధ్యతరగతి కేబుల్ ఆపరేటర్.. భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తుంటాడు. అంతలో ఆ కుటుంబానికి వరుణ్ హత్యకేసు రూపంలో కష్టాలు ఎదురవుతాయి. ఆ పరిస్థితుల్లో జార్జ్ కుట్టి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అన్నదే కథాంశం. ఇదే సినిమాను అన్ని దక్షిణాది భాషలతో పాటు, హిందీలోనూ రీమేక్ చేయగా.. అక్కడ కూడా సూపర్ హిట్ సాధించింది. అలాగే ఇదే సినిమాను చైనీస్, సింహళ, ఇండోనేషియన్ భాషల్లో సైతం రీమేక్ చేశారు. ఆయా భాషల్లోనూ సినిమాకి మంచి స్పందన దక్కింది. దాంతో ఈ సినిమాకి రెండో భాగాన్ని ప్రకటించి 2020లో ఓటీటీలో విడుదల చేశారు. మొదటి భాగాన్ని మించి చిత్రం సూపర్ హిట్ అయింది. తెలుగు, కన్నడ భాషల్లో కూడా చిత్రం రీమేక్ అయింది. రెండు భాషల్లోనూ ‘దృశ్యం 2’ (Drishyam 2) అద్భుత విజయం సాధించింది. వరుణ్ హత్యకేసును ఆరేళ్ళ తర్వాత తిరగతోడడంతో జార్జ్ కుట్టి కుటుంబానికి మళ్ళీ కష్టాలెదురవుతాయి. ఈ సారి జార్జ్ కుట్టి ఇంకెంత తెలివిగా తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు అన్నదే కథాంశం. దర్శకుడు జీతుజోసెఫ్ (Jeethu Joseph) అద్భుతమైన కథాకథనాలతో తన ప్రతిభను చాటుకున్నాడు. 

ఇక ఇప్పుడు ‘దృశ్యం’ చిత్రానికి మూడో భాగం తీయడానికి జీతు జోసెఫ్ రెడీ అవుతున్నాడు. రెండో భాగం సూపర్ హిట్టయిన సందర్భంలో మూడో భాగానికి మంచి ఐడియా ఎప్పుడు తడుతుందో అప్పుడే సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలిపాడు దర్శకుడు. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. మరో అద్భుతమైన కథాంశంతో మూడో భాగం తెరకెక్కనుందని సమాచారం. వరుణ్ హత్య కేసు నుంచి మరోసారి తెలివిగా తప్పించుకొని.. అతడి తల్లిదండ్రులకు తీవ్ర నిరాశను కలిగించిన జార్జ్ కుట్టికి మరోసారి ఇదే కేసు విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే మూడో భాగం కథాంశం. సో మరోసారి జార్జ్ కుట్టికి ప్రభాకర్, గీతా దంపతుల నుంచి కష్టాలు తప్పవన్నమాట. ప్రస్తుతం మోహన్ లాల్ తో ‘రామ్’ మొదటి భాగాన్ని తెరకెక్కిస్తున్న జీతు జోసెఫ్.. అది పూర్తవగానే దృశ్యం 3 ను సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. మరి తెలుగులో కూడా ‘దృశ్యం 3’ వస్తుందేమో చూడాలి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International