విద్యార్థుల కోసం యూ ట్యూబ్ చానల్... నెలకు లక్ష ఆదాయం!

ABN , First Publish Date - 2020-11-17T15:12:21+05:30 IST

‘మీ దగ్గర ఆదాయ మార్గాలు అనేకం ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా...

విద్యార్థుల కోసం యూ ట్యూబ్ చానల్... నెలకు లక్ష ఆదాయం!

న్యూఢిల్లీ: ‘మీ దగ్గర ఆదాయ మార్గాలు అనేకం ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా నడుచుకుంటారు. అదే మీ దగ్గర ఆదాయ మార్గాలు లేనపుడు మీరు అనుకున్నట్లు జీవితం మారుతుంది’ అని అంటారు యూట్యూబర్ అమరేష్ భారతి. బీహార్‌లోని సమస్తీపూర్ పరిధిలోని ఒక చిన్న గ్రామానికి చెందిన అమరేష్ భారతి గ్రామంలోనే 7వ తరగతి వరకూ చదువుకున్నారు. ఆ తరువాత అమరేష్ తల్లిదండ్రులు కుటుంబంతో సహా ఢిల్లీకి తరలివెళ్లారు. అతని తండ్రి రూ. 3 వేల వేతనంతో డ్రైవర్‌గా పని చేసేవారు. అమరేష్ గ్రామంలో ఉంటున్నప్పుడు వారి ఇంట్లో విద్యుత్ ఉండేది. 


అయితే ఢిల్లీ వచ్చాక వారి ఇంటికి విద్యుత్ సౌకర్యం లేదు. మూడేళ్ల పాటు విద్యుత్ లేకుండానే కాలం గడిచింది. ఇన్ని కష్టాలను ఎదుర్కొంటూనే అమరేష్ చదువు కొనసాగించాడు. 12వ తరగతి పూర్తిచేశాక అమరేష్ ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా 35 మంది విద్యార్థులు అమరేష్ దగ్గర ట్యూషన్‌లో చేరారు. ఇలా విద్యార్థులకు చదువు చెబుతూనే అమరేష్ సీఏలో చేరాడు. ఈ సమయంలో అతని దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు యూట్యూబ్ చానల్ ప్రారంభించాలని సలహా ఇచ్చారు. ఇదిమెదలు అమరేష్ యూ ట్యూబ్ చానల్ ప్రారంభించి, విద్యా సంబంధిత వీడియోలను పోస్టు చేస్తూ వచ్చారు. దీనితోపాటు విద్యార్థులలో స్ఫూర్తి కలిగించేలా అనేక వీడియోలను కూడా రూపొందించి, అప్‌లోడ్ చేస్తూ వచ్చారు. వారానికి 10 వీడియోల చొప్పున పోస్టు చేశారు. వీటికి విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా అమరేష్ మాట్లాడుతూ తాను నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాసులకు మంచి స్పందన వస్తున్నదని, తన వీడియోలను విద్యార్థులు వీక్షిస్తున్నరని అన్నారు. ప్రస్తుతం తన చానల్‌కు 6 మిలియన్లకు మించిన సబ్‌స్క్రైబర్లు ఉన్నారని తెలిపారు. అలాగే 45 మందికి ఉద్యోగ అవకాశం కల్పించానని పేర్కొన్నారు. ప్రస్తుతం యూట్యూబ్ కారణంగా తనకు నెలకు లక్ష రూపాయల వరకూ ఆదాయం వస్తున్నదని అమరేష్ తెలిపారు.

Updated Date - 2020-11-17T15:12:21+05:30 IST