Pakistan : దొంగలకు పగ్గాలు అప్పగించడం కన్నా అణు బాంబు వేయడం ఉత్తమం : ఇమ్రాన్ ఖాన్

ABN , First Publish Date - 2022-05-14T21:29:52+05:30 IST

అధికారాన్ని దొంగలకు అప్పగించడం కన్నా పాకిస్థాన్‌

Pakistan : దొంగలకు పగ్గాలు అప్పగించడం కన్నా అణు బాంబు వేయడం ఉత్తమం : ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : అధికారాన్ని దొంగలకు అప్పగించడం కన్నా పాకిస్థాన్‌ మీద అణు బాంబు వేయడం ఉత్తమమని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహరీక్-ఈ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అన్నారు. ఆయన తన బనిగల నివాసంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పాకిస్థానీ మీడియా శనివారం వెల్లడించింది. 


దొంగలను దేశం మీద రుద్దుతుండటం చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. వీరికి అధికారాన్ని అప్పగించడం కన్నా అణు బాంబును వేయడం ఉత్తమయ్యేదన్నారు. గత పాలకుల అవినీతి కథలను తనకు చెప్పే శక్తిమంతులైనవారు ఇప్పుడు తనకు సలహాలు ఇస్తున్నారన్నారు. ఇతరులపై వచ్చే అవినీతి ఆరోపణలపై దృష్టి పెట్టడానికి బదులుగా తన ప్రభుత్వ పని తీరుపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారని చెప్పారు. మే 20న లాంగ్ మార్చ్ ద్వారా రాజధాని నగరం ఇస్లామాబాద్‌ (Islamabad)లోకి ప్రవేశించకుండా తమను ఏ శక్తీ ఆపలేదన్నారు. దిగుమతి అయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి, నిజమైన స్వాతంత్ర్యం పొందడం కోసం 20 లక్షల మందికి పైగా ఈ కవాతులో పాల్గొంటారని చెప్పారు. 


అధికారంలోకి వచ్చిన దొంగలు న్యాయ వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారన్నారు. ఈ నేరగాళ్ళ కేసులను ఇప్పుడు ఏ ప్రభుత్వ అధికారి దర్యాప్తు చేస్తారని ప్రశ్నించారు. 


ఇదిలావుండగా, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇమ్రాన్ తన ప్రసంగాలతో ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఇమ్రాన్ మాట్లాడుతున్నారన్నారు. గత ప్రతిపక్షాలను, ప్రస్తుత ప్రభుత్వాన్ని దొంగలు, బందిపోట్లు అంటూ ఇమ్రాన్ పదే పదే మాట్లాడుతుండటం వల్ల దేశంలో విభజన ఏర్పడిందన్నారు. 


Read more