కరువు భత్యమూ కరువే

Dec 6 2021 @ 01:59AM

పెండింగ్‌ డీఏల ఖాతాలో మరొకటి

ఇప్పటి వరకు 5 డీఏలు బకాయి 

మరో రెండు కాగితాలకే పరిమితం

పూర్తిస్థాయిలో జరగని చెల్లింపులు 

కరోనాతో ఫ్రీజ్‌ చేసిన డీఏలూ

దీపావళి ముందే చెల్లించేసిన కేంద్రం

ఆ ఊసే ఎత్తని రాష్ట్ర సర్కారు 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కరోనా కారణంగా ఫ్రీజ్‌ చేసిన డీఏలను కేంద్ర ప్రభుత్వం చెల్లించేసింది. దీపావళి కానుకగా మరో డీఏ కూడా ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖుషీగా ఉన్నారు. రాష్ట్రంలోని 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన పెండింగ్‌ డీఏల ఖాతాలో మరో డీఏ చేరిందని వాపోతున్నారు. కరువు భత్యానికీ కరువే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగే నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆరు నెలలకోసారి ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) ఇస్తోంది. ఆ డీఏ ఉద్యోగుల మూల వేతనంలో చేరడంతో పెరిగిన ధరలకు అనుగుణంగా వారి జీతంలోనూ పెరుగుదల ఉంటుంది. దీంతో ఉద్యోగులకు ఎంతో కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం కరువు భత్యం చెల్లింపులు కూడా పంచవర్ష ప్రణాళికలాగా అయిపోయాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే ఇవ్వాల్సిన డీఏలను రానున్న సంవత్సరాల్లో చెల్లిస్తామంటూ చేతులు దులుపుకోవడంతో ఆవేదన చెందుతున్నారు. 


కాగితాలకే చెల్లింపులు పరిమితం 

1-7-2018 పెండింగ్‌ డీఏను, 1-1-2019 డీఏను ప్రభుత్వం చెల్లించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల వేతనంలో డీఏ కలిసింది. అయితే 60 నెలల డీఏ ఎరియర్స్‌ ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. కేవలం ఈ రెండు డీఏల చెల్లింపులు పేపరు మీదే కనిపిస్తున్నాయి కానీ పూర్తి స్థాయి చెల్లింపులు జరగలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లింపులు చేపట్టామని చెబుతున్న రెండు డీఏలు కాగితాలకే పరిమితం అయ్యాయని చెబుతున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు 90 నగదు చెల్లింపులు చేసి, 10 శాతం వారి ప్రాన్‌ ఖాతాలో జమ చేయాలని.. అదే పాత పెన్షన్‌ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉందని, పింఛనర్లకు నగదు చెల్లింపులు చేయాల్సి ఉందని, అయితే జీతంలో డీఏలు కలిసినా ఎరియర్స్‌ చెల్లింపులు ఇప్పటి వరకు ఏవీ జరగలేదని వాపోతున్నారు. చెల్లింపులు పూర్తిగా జరగకుండానే పేపర్ల మీద మాత్రం చూపి డీఏలు ఇచ్చామనడం ఎంతవరకు సబబని అన్నారు. అంటే... రాష్ట్ర ప్రభుత్వం పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏల సంఖ్య 7కు చేరింది. 


ఓవైపు కరోనా.. మరోవైపు ధరలు 

కరోనా పరిస్థితులు, పెరిగిన నిత్యావసరాల ధరలు తమను వెంటాడుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఆరునెలలకోసారి ఇవ్వాల్సిన కరువు భత్యం సంవత్సరాల తర్వాత ఇవ్వడం ఏంటో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన డీఏలకు చెల్లింపులు జరగలేదని మండిపడుతున్నారు. కరోనాతో తమ తోటి ఉద్యోగులు చాలా మందిని కోల్పోయామని, ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాపోతున్నారు. కరోనా పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు డీఏలు చెల్లిస్తోంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించడంలేదని మండిపడుతున్నారు. కరోనా పరిస్థితులు రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఉంటాయని, అలాగే రాష్ట్రాలకు ఆర్థిక వనరులు ఉంటాయి కదా అని ఉద్యోగులు వాపోతున్నారు. 


కేంద్రం చెల్లించినా.. 

కేంద్రం ఉద్యోగులకు డీఏ చెల్లించినప్పుడల్లా.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డీఏలు ఎప్పుడు ఇస్తుందోనని ఎదురు చూడటంతో సరిపోతోందని వాపోతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన డీఏలు ఎన్నో లెక్కించుకుంటూ, తమకు రావలసిన ఆర్థిక ప్రయోజనం ఎప్పుడు వస్తుందో అంటూ నిట్టూరుస్తున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి ప్రభుత్వం ఉద్యోగులకు డీఏలు చెల్లించాలి. అయితే 1-7-2019 నుంచి 1-7-2021 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏలు చెల్లించలేదు. అంటే 5 డీఏలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ఐదు డీఏల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా కారణంగా మూడు డీఏలు ఉద్యోగులకు చెల్లించకుండా ఫ్రీజ్‌ చేసింది. ఇటీవల ఆ ఫ్రీజ్‌ను ఎత్తివేసి ఉద్యోగులకు డీఏలు చెల్లించింది. కరోనా ఇబ్బందుల వల్ల కేంద్రం మూడు డీఏలు ఫ్రీజ్‌ చేసింది కాబట్టి తామూ చేస్తున్నామన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు డీఏలు ఫ్రీజ్‌ చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేయలేదు. అయితే ఇటీవల కేంద్రం చెల్లింపులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫ్రీజ్‌ను ఎత్తివేయలేదు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.