మూడేళ్లకే మునిగింది

ABN , First Publish Date - 2022-08-12T05:57:44+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ దుర్మార్గపు పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

మూడేళ్లకే మునిగింది
కోస్గి పట్టణంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్‌ షర్మిల

- కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

- కేసీఆర్‌ కుటుంబానికే బంగారు తెలంగాణ 

- రూ.5 వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులవుతారా 

- రాష్ర్టాన్ని  బీర్లు, బార్లు, అప్పుల తెలంగాణగా మార్చారు 

- కేసీఆర్‌ను ప్రశ్నించేందుకే వైఎస్సార్‌టీపీ స్థాపన

- ప్రజాప్రస్థాన పాదయాత్రలో వైఎస్‌ షర్మిల

కోస్గి, ఆగస్టు, 11:  తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ దుర్మార్గపు పాలన కొనసాగుతోందని  వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.  ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ కేవలం అయిదేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నా ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించారని, రైతులకు ఎన్ని లక్షల రుణం ఉన్నా ఒకేసారి రుణమాఫీ చేశారని అన్నారు.  కేసీఆర్‌ కుటుంబానికి, కాంట్రాక్టరు మెగా కృష్ణారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల కోసమేనా తెలంగాణ సాధించుకున్నది అని ఆమె ప్రశ్నించారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా గురువారం నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని హకీంపేట్‌ ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసున్నారు. మార్గమధ్యలో వరి నాట్లు వేస్తున్న మహిళా రైతులతో కలిసి నాటు వేశారు. అక్కడి నుంచి సర్జాఖాన్‌పేట్‌కు చేరుకున్నారు. వైఎస్సార్‌టీపీకి అండగా ఉంటే రాజన్న సంక్షేమ పాలన అందిస్తానని భరోసా కల్పించారు.  అనంతరం కోస్గి పట్టణంలోని శివాజీ చౌక్‌ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో ప్రతీ వర్గాన్ని మోసం చేశారన్నారు. రుణమాఫీ చేస్తానని రైతులను, వడ్డీలేని రుణాలు అంటూ మహిళలను, కేజీ టూ పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను, ఇంటికో ఉద్యోగం,  నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు లేని వాళ్లకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, భూమి లేని వారికి మూడె కరాల భూమి, 57 ఏళ్లకు పెన్షన్‌, పోడు పట్టాలు ఇస్తామని, ఉచిత ఎరువులు ఇస్తామంటూ ఇవ్వకుండా మోసం చేశారన్నారు. కేసీఆర్‌ తాను ఇచ్చిన హామీల్లో ఒక్క హామీనైనా పూర్తిస్థాయిలో అమలు చేశారా అని ఆమె ప్రశ్నించారు.  కేసీఆర్‌ సీఎం అయ్యాక అన్ని పథకాలు బంద్‌ పెట్టి రైతు బంధు పేరుతో ఎకరాకు రూ. 5 వేలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. రూ.5 వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులవుతారా అని ప్రశ్నించారు. ఏ వర్గాన్ని ఆదుకోలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్‌దని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పాలనలో రైతుకు బీమా రావాలంటే 60 ఏళ్లలోపే చనిపోవాలని, కేసీఆర్‌ మాత్రం 69 ఏళ్లు ఉన్నా పదవులు అనుభవించవచ్చట అని ఎద్దేవా చేశారు.  మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని  కేసీఆర్‌ చేతుల్లో పెడితే నాలుగు లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.  మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మూడేళ్లలోనే మునిగిపోయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం ప్రాజెక్టులు, కాంట్రాక్టులు మెగా కృష్ణారెడ్డికి కేసీఆర్‌ ఇస్తున్నారని, కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, పాలమూరు వంటి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని ప్రాజెక్టులు ఆయనే చేస్తున్నారని, ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తికి, ఒక కంపెనీకి 80 శాతం పనులను కేసీఆర్‌ ఇస్తున్నారంటే కమీషన్ల కోసమే ఆయనకు అన్ని ప్రాజెక్టులు ఇస్తున్నారని ఆరోపించారు.  అనంతరం కోస్గి నుంచి షర్మిల పాదయాత్ర మండల పరిధిలోని ముశ్రీఫాకు చేరుకుంది.  కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తమ్మలి బాల్‌రాజ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు నీలం రమేశ్‌, జిల్లా పరిశీలకులు బెజ్జంకి అనిల్‌, వికారాబాద్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ సుధారాణి, పరిగి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కోళ్ల యాదయ్య,  కోస్గి మండల అధ్యక్షుడు గౌస్‌పాష, నాయకులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  




Updated Date - 2022-08-12T05:57:44+05:30 IST