జయ సాహా నుంచి కీలక సమాచారం రాబట్టిన ఎన్సీబీ

ABN , First Publish Date - 2020-09-23T18:07:15+05:30 IST

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దూకుడు పెంచడం..

జయ సాహా నుంచి కీలక సమాచారం రాబట్టిన ఎన్సీబీ

ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దూకుడు పెంచడం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అరస్టయిన వారి విచారణలో కొత్త కొత్త పేర్లు వెలుగు చూస్తున్నాయి. నటి రియా చక్రవర్తి టాలెంట్ మేనేజర్ జయ సాహాను వరుసగా మూడో రోజు అధికారులు విచారిస్తున్నారు.


నటి శ్రద్దా కపూర్ కోసం సీబీడీ ఆయిల్‌ను జయ సహా సేకరించినట్లు అధికారులు గుర్తించారు. సీబీడీ ఆయిల్‌పై దేశంలో నిషేధం ఉంది. సుశాంత్‌తో పాటు రియా, నిర్మాత మధు మంతెన కోసం కూడా సీబీడీ ఆయిల్‌ను జయసాహా సేకరించినట్లుగా సమాచారం. గంజాయి మొక్కల నుంచి తీసిందే సీబీడీ ఆయిల్‌. జయసాహాను ఇప్పటికే పలుమార్లు విచారించిన అధికారులు ఆమె నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలు ఉన్న పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లను జయ సాహా బయటపెట్టారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌తోపాటు నమ్రతా శిరోద్కర్ పేరు తెరపైకి రావడంతో ఇటు టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి.


టాలీవుడ్ సెలబ్రెటీల మత్తు చిట్టాలను ఎన్సీబీ అధికారులు సేకరించినట్లు సమాచారం. డ్రగ్స్ డీలర్ కెల్విన్‌తోపాటు డ్రగ్స్ వాడిన టాలీవుడ్ నటీ నటులు, సినీ ప్రముఖుల వివరాలను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు ఎక్సైజ్ శాఖ అందించింది. ఎక్సైజ్ శాఖ చార్జ్ షీటులో పొందుపరిచిన వివరాలను ఎన్సీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2020-09-23T18:07:15+05:30 IST