‘మందు’ మారింది!

ABN , First Publish Date - 2022-02-25T08:42:36+05:30 IST

‘మందు’ మారింది!

‘మందు’ మారింది!

మొత్తం బేవరేజెస్‌ కార్పొరేషన్‌కే బదిలీ

డిపోలు, స్టాక్‌, వ్యాపారం అన్నీ సంస్థకే

మేనేజర్‌ నుంచి ఓనర్‌గా మారిన ‘కంపెనీ’

రుణం మంజూరుకు బీవోబీ కొత్త మెలిక

ఆదాయాన్ని చూసి 40 వేల కోట్లు ఇవ్వలేం

వ్యాపారమంతా ఎక్సైజ్‌ కమిషనర్‌ పేరిటే!

మరి.. కార్పొరేషన్‌కు అప్పులు ఇచ్చేదెలా?

బీవోబీ షరతులతో దిగి వచ్చిన సర్కారు


అప్పుల కోసం సర్కారు మరో తప్పు

అప్పు దొరికితే చాలు.. ఏ తప్పు చేసేందుకైనా సిద్ధం! చేసిన తప్పు ‘చెల్లుబాటు’ కాకపోతే ఇంకో తప్పూ చేస్తాం! తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాం! అప్పు పుట్టాలి.. అంతే! ఇదీ... రాష్ట్ర ప్రభుత్వ దా‘రుణ’ దాహం! 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని 29 మద్యం డిపోలు, వాటిలోని మద్యం నిల్వలు, మద్యం వ్యాపారం, ఇతర చరాస్తులు, సరఫరాదారులతో కుదిరిన ఒప్పందాలు... వీటన్నింటికీ ప్రభుత్వమే యజమాని! బేవరేజెస్‌ కార్పొరేషన్‌... కేవలం ఒక ‘మేనేజర్‌’ బాధ్యతలు నిర్వహిస్తుంది! ఇది... మొన్నటి వరకు ఉన్న విధానం! జగన్‌ సర్కారు పద్ధతి మార్చేసింది. మొత్తం మద్యం వ్యాపారానికి బేవరేజెస్‌ కార్పొరేషన్‌నే యజమానిగా మార్చింది. ఇది చేసింది సదరు కార్పొరేషన్‌పై ప్రేమతో కాదండోయ్‌! ఆ కార్పొరేషన్‌ను అడ్డు పెట్టుకుని, అడ్డగోలుగా అప్పులు తెచ్చుకునేందుకే ఈ యాజమాన్య బదిలీ! రూ.40,000 కోట్లు అప్పులు తెచ్చుకోవడమే లక్ష్యం! దీనికోసం మద్యం వ్యాపారాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో ఇచ్చింది. రుణ నాటకంలో ఇది తొలి అధ్యాయం. ఇక... ఆ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చుకోవడం రెండో అంకం! రాష్ట్రాభివృద్ధి, రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ల విషయంలో ఇదే జరిగింది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ విషయంలోనూ అదే జరగనుంది.

ఆదాయంలో తిరకాసు: ‘ఔను... మద్యం ఆదాయం నుంచే అమ్మ ఒడిలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం’ అని సర్కారు ఎప్పుడో అంగీకరించింది. పాతికేళ్లపాటు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తెస్తోంది. ‘ఏం చూసుకుని కార్పొరేషన్‌కు అప్పులు ఇవ్వాలి?’ అని బ్యాంకులు ప్రశ్నించగా... మద్యంపై వచ్చే పన్ను ఆదాయాన్ని తెలివిగా రెండు ముక్కలు చేసి, ‘స్పెషల్‌ మార్జిన్‌’ అనే పెద్ద ముక్కను బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయంగా చూపించింది. దీనిపై 2021 నవంబరు 9వ తేదీన ప్రభుత్వం జీవో నెంబరు 313ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం స్పెషల్‌ మార్జిన్‌ రూపంలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.6,000 కోట్ల ఆదాయం అందుతుంది. ఈ ఆదాయాన్ని చూపించి రూ.40,000 కోట్లు అప్పు తేవాలని జగన్‌ ప్రభుత్వం భారీ స్కెచ్‌ వేసింది. ఆ ఆదాయాన్ని చూసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఇప్పటికే జగన్‌ సర్కార్‌కు భారీగా అప్పులిచ్చినట్లు సమాచారం. అయితే... బీవోబీకి ఇప్పుడు కొత్తగా కొన్ని సందేహాలు వచ్చాయి. స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో కార్పొరేషన్‌కి ఆదాయం వచ్చినట్లుగా చూపిస్తున్నారు సరే! కానీ... ఆ కార్పొరేషన్‌కంటూ సొంతంగా వ్యాపార లావాదేవీల్లేవు కదా? రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్సైజ్‌ కమిషనర్‌ పేరిటే మొత్తం వ్యవహారం, వ్యాపారం జరిగిపోతోంది!  లిక్కర్‌ డిపోలు, మద్యం స్టాకు, వాహనాలు, ఇతర ఆస్తులు అన్నీ కమిషనర్‌ పేరుమీదే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ను నమ్మి వేల కోట్లు అప్పు ఎలా ఇస్తాం? అని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రశ్నించింది. రాష్ట్రంలో మద్యం వ్యాపారం మొత్తం బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ పేరు మీదే జరగాలని, వ్యాపార కార్యకలాపాలన్నీ కార్పొరేషన్‌ పరిధిలోనే సాగాలని, ఆస్తులన్నీ కార్పొరేషన్‌ పేరు మీద ఉంటేనే అప్పు ఇస్తామని తేల్చి చెప్పింది. దాంతో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ పరిధిలో ఉన్న మద్యం వ్యాపారాన్ని, ఆస్తులను కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటైన కార్పొరేషన్‌కు బదిలీ చేస్తూ హుటాహుటిన జగన్‌ సర్కారు జీవో ఇచ్చేసింది. మద్యం సరఫరాదారులతో ఎక్సైజ్‌ కమిషనర్‌ కుదుర్చుకున్న ఒప్పందాలూ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కి బదిలీ చేశారు. ప్రభుత్వంతో సరఫరాదారులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని వారి ఆమోదం లేకుండా కార్పొరేషన్‌కి బదిలీ చేయవచ్చా అనేది ప్రశ్నార్థకం. బుధవారం జారీ చేసిన ఈ ఉత్తర్వులు 2021 నవంబరు 9వ తేదీ నుంచి... అంటే, అప్పుల కోసం మద్యం ఆదాయాన్ని ముక్కలు చేసిన రోజు నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొనడం విశేషం.


ఆదాయం మాత్రం ఖజానాకే: వ్యాపారం, ఆస్తులు, ఒప్పందాలు అన్నింటినీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కి బదలాయించినప్పటికీ... మద్యం ఆదాయం మాత్రం ఖజానాకే వస్తుంది. ఎందుకంటే ఆదాయం నేరుగా కార్పొరేషన్‌ ఖాతాకు వెళ్తే... 35 శాతం మొత్తాన్ని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌గా కట్టాల్సి ఉంటుంది. దీన్ని తప్పించుకునేందుకే లిక్కర్‌పై వచ్చే ఎలాంటి ఆదాయమైనా ఖజానాకే రావాలంటూ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ చట్టం-1993కి 2012లో సవరణ చేశారు. ఒకవేళ ఆదాయం బేవరేజెస్‌ కార్పొరేషన్‌కి వెళ్లాలంటే  తిరిగి ఈ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. 


ఎస్‌బీఐ నుంచి నేర్చుకున్న పాఠమేనా!

ఏపీఎ్‌సడీసీకి ఆస్తులు బదిలీ చేసి... ఎస్‌బీఐ కన్సార్షియం నుంచి సర్కారు అప్పు లు తెచ్చుకొంది. అయితే... ఏపీఎ్‌సడీసీ వ్యవహారంపై కేంద్రం కన్నెర్ర, కేంద్ర ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగం నుంచి ఏపీఎ్‌సడీసీ మోడల్‌కు అనుమతి రాకపోవడంతో ఎస్‌బీఐ వెనక్కి తగ్గింది. ఏపీఎ్‌సడీసీకి మిగిలిన రూ.1800 కో ట్లు అప్పు ఇవ్వబోమని ఆ బ్యాంకులోని 11 మంది వాటాదారులు ఎదురుతిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఎస్‌బీఐ అప్పు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌కి అప్పులిచ్చేందుకు బీవోబీ కొత్త షరతులు పెట్టింది.

Updated Date - 2022-02-25T08:42:36+05:30 IST