‘మందు’స్తు వ్యూహం

ABN , First Publish Date - 2021-02-28T05:41:46+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో నాటుసారా పంపిణీకి గుట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సారాను విచ్చలవిడిగా సరఫరా చేశారు. వాటర్‌ బాటిళ్లను మరిపించేలా అందజేశారు. ఎండలో ప్రచారానికి వచ్చిన వారికి నీళ్లు బదులు సారా పోశారు. ఇప్పుడు అదే విధంగా మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా అందజేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

‘మందు’స్తు వ్యూహం

 అధికంగా నాటు సారా దిగుమతి

మున్సిపల్‌ ఎన్నికల్లో పంపిణీకి ఏర్పాట్లు

ప్రభుత్వ అద్దె వాహనాలూ రవాణాకు వినియోగం

అనేక మార్గాల్లో గుట్టుగా తరలింపు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

మున్సిపల్‌ ఎన్నికల్లో నాటుసారా పంపిణీకి గుట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సారాను విచ్చలవిడిగా సరఫరా చేశారు. వాటర్‌ బాటిళ్లను మరిపించేలా అందజేశారు. ఎండలో ప్రచారానికి వచ్చిన వారికి నీళ్లు బదులు సారా పోశారు. ఇప్పుడు అదే విధంగా మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా అందజేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో మద్యం నిల్వలపై ఆంక్షలు ఉంటాయి. ఈ పరిస్థితిలో ముందుగానే మద్యం నిల్వలను రాజకీయ నాయకులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం షాపులు మూసివేయాలన్నది నిబంధన. ఆ సమయంలో ఏర్పడే కొరతను తీర్చేందుకు నాటు సారాను వినియోగించాలని అభ్యర్థులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒడిశా సరిహద్దు మండలాలు అన్నింటా నాటు సారా ఏరులై పారింది. ఇది గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. పార్వతీపురం సరిహద్దు ఒడిశా, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, మెంటాడ మండలాల సరిహద్దుల గుండా ఒడిశా ప్రాంతాల నుంచి సారా భారీగా మన జిల్లాలోకి వస్తోంది. ఈ కారణంగానే ఏ గ్రామ శివార్లలో చూసినా మద్యం బాటిళ్ల కంటే నాటు సారా ప్యాకెట్లు ఖాళీ కవర్లు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. 

ప్రభుత్వ అద్దె వాహనాల్లో తరలింపు

 మద్యం.. సారా తరలింపుపై ఇటు ఎక్సైజ్‌ శాఖ, అటు పోలీస్‌ శాఖలు గట్టి నిఘా పెట్టాయి. అయినా రెండో కంటికి తెలియకుండా రవాణా చేయడంపై అక్రమార్కులు దృష్టి పెడుతున్నారు. సారా నిల్వలను ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల్లో 90 శాతం మంది ప్రైవేట్‌ అద్దె వాహనాలనే వినియోగిస్తున్నారు. వీటిని  వినియోగిస్తే ఎవరికీ అనుమానం రాదని, తనిఖీలు చేయరని అభ్యర్థులు భావిస్తున్నారు. అధికారి కార్యాలయ సమయం దాటిన తరువాత ప్రభుత్వ అద్దె వాహనాలను అక్రమ వ్యాపారాలకు వినియోగించాలనుకుంటున్నారు. కొందరైతే ఇప్పటికే మొదలు పెట్టేశారు. తాజాగా కొమరాడ తహసీల్దార్‌ అద్దెకు వాడుతున్న వాహనంలో సారా పట్టుబడింది. పార్వతీపురం మండల సరిహద్దు ఒడిశా అలమండ-అడ్డుబంగి నుంచి కారులో నాటు సారా కేన్ల ద్వారా 260 లీటర్ల సారా తీసుకెళ్తుండగా పట్టుబడింది.  ఒడిశా నుంచి వస్తున్న ఈ సారా పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీలను దాటి బలిజిపేట మండలం పెదపెంకి వద్ద పట్టుబడింది. దొరకని వారెందరో!

కాగా పట్టణాలకు ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్‌ వీలర్‌ వాహనాల్లోనూ నాటు సారా సరిహద్దులు దాటి వస్తోంది. పాచిపెంట, మక్కువ, సాలూరు, మెంటాడ, పార్వతీపురం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస మండలాల ఒడిశా సరిహద్దుల నుంచి సారాను భారీగా తీసుకొస్తున్నారు. మండల కేంద్రాల్లోనే విచ్చలవిడిగా సారా అమ్మకాలు సాగుతున్నాయి.ఈ విషయం ఎక్సైజ్‌ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు పోతున్నారు. తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం షాపులు వచ్చిన తరువాత ఎక్సైజ్‌ సిబ్బందికి దొడ్డిదారిన వచ్చే అదాయానికి గండి పడిందంటున్నారు. దీంతో సారా వ్యాపారులనే ఆదాయ వనరులుగా మార్చేసుకున్నారన్న ఆరోపణ సర్వత్రా వినిపిస్తోంది. మక్కువ, కొమరాడ తదితర మండల కేంద్రాల్లోని పోలీస్‌ స్టేషన్‌కు కూత వేత దూరంలో అమ్మకాలు సాగుతున్నాయి. 

మక్కువ, పిచిపెంట, సాలూరు ఏజెన్సీ ప్రాంతాల నుంచి సాలూరు మున్సిపాలిటీకి.. మక్కువ, పార్వతీపురం ఏజన్సీ ప్రాంతాల నుంచి బొబ్బిలి మున్సిపాలిటీకి సారా చేరుతోంది. లోడుతో వెళుతున్న లారీలు, వ్యాన్ల ద్వారా సారా తరిలిస్తున్నారు. అధికారులు వినియోగిస్తున్న అద్దె వాహనాలను సైతం వినియోగిస్తున్నారు.  ఇదివరకు గంజాయి నిల్వలను, మద్యం నిల్వలను ప్రభుత్వ వాహనాల్లో తరలిస్తూ పట్టుబడ్డ కేసులున్నాయి. తాజాగా సారా తరలిస్తున్నారు. దీనిపై ఎక్సైజ్‌, పోలీస్‌ సిబ్బంది నిఘాను పటిష్టం చేయాల్సి ఉంది. 


Updated Date - 2021-02-28T05:41:46+05:30 IST