రైళ్లలో మాదక ద్రవ్యాల రవాణా

ABN , First Publish Date - 2022-05-25T06:35:29+05:30 IST

దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి గుంతకల్లు మీదుగా ప్రమాదకర మత్తు పదార్థాల రవాణా జరుగుతోంది.

రైళ్లలో మాదక ద్రవ్యాల రవాణా

గుంతకల్లు మీదుగా రాజధానికి..

నిఘా పెట్టని జీఆర్పీ, ఆర్పీఎఫ్‌

గుంతకల్లు, మే 24: దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి గుంతకల్లు మీదుగా ప్రమాదకర మత్తు పదార్థాల రవాణా జరుగుతోంది. ఇప్పటిదాకా గంజాయి పట్టుబడింది. కానీ సోమవారం కొకైన పట్టుబడటం కలకలం రేపింది. ముంబాయి, నెల్లూరు కేంద్రాలుగా గంజాయి, కొకైన లాంటి ప్రమాదకర మాదకద్రవ్యాలు రైళ్లలో రాష్ట్ర రాజధానికి తరలుతున్నాయని సమాచారం. తిరుపతి-గూడూరు-విజయవాడ, హుబ్లీ-గుంతకల్లు-విజయవాడ రూట్లలో మత్తు పదార్థాల రవాణా ఎక్కువగా జరుగుతోందని అంటున్నారు. ఈ మార్గాల్లో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలకు మాదకద్రవ్యాలను కొరియర్లు అందజేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


ఎంత దొరికింది..?

గుంతకల్లుతోపాటు సమీప పట్టణాలలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అత్యంత ఖరీదైన, ప్రమాదకరమైన కొకైనను గుంతకల్లు రైల్వే స్టేషనలో సోమవారం పట్టుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. తిరుపతి రైల్వే స్టేషనలో గత వారంలో కొకైన పట్టుబడింది. అనంతపురానికి చెందిన స్పెషల్‌ ఆపరేషన్స గ్రూప్‌ రైల్వే పోలీసులు అమరావతి ఎక్స్‌ప్రె్‌సలో ఒకరిని అరెస్టు చేశారు. అతడి నుంచి కొకైనను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించినా, నిందితుడి వివరాలు, స్వాధీనమైన కొకైన పరిమాణం తెలియజేయలేదు. గుజరాత, రాజస్థానలో పండించే గసగసాల పూవుల నుంచి సేకరించే అఫీన (కొకైన) అత్యంత ఖరీదైనది. గ్రాము ధర రూ.15 వేలదాకా ఉంటుందని చెబుతారు. 


ఇప్పటి వరకూ గంజాయే..

గుంతకల్లులో గత ఏడాది నవంబరు 11న 21 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గత నెలలో గుత్తిలో గంజాయి పట్టుబడింది. ఇవన్నీ రైలు మార్గంలోనే గుంతకల్లుకు, రాష్ట్ర రాజధానికి తరలుతున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో నమోదైన మాదకద్రవ్యాల కేసుకు ఏపీకి సంబంధం ఉందన్న విషయం బహిర్గతమైన సందర్భంలో, రైల్వే స్టేషన్లలో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించి వదిలేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు కేవలం రైలు దోపిడీదారులపై కన్నేసి ఉంచడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మాదక ద్రవ్యాల రవాణా గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ కారణంగా రైళ్లలో మత్తు పదార్థాల రవాణా ఎక్కువైందని విమర్శలు వస్తున్నాయి. 

Updated Date - 2022-05-25T06:35:29+05:30 IST