జగన్‌ బినామీలతో మందులూ కల్తీ

ABN , First Publish Date - 2022-06-29T08:10:43+05:30 IST

జగన్‌ బినామీలతో మందులూ కల్తీ

జగన్‌ బినామీలతో మందులూ కల్తీ

ఆ కంపెనీ డ్రగ్‌ స్కాంను అమెరికా ఎఫ్‌డీఏ పట్టుకొంది

అవినీతిమయంగా మారిన మరో బినామీ హెటిరో: పట్టాభిరాం


అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బినామీ కంపెనీ డ్రగ్‌ కుంభకోణాన్ని అమెరికా ప్రభుత్వానికి చెందిన ఎఫ్‌డీఏ సంస్థ పట్టుకొంది. జగన్‌ బినామీలు మద్యం మాదిరిగానే మందులనూ కల్తీ చేస్తున్నారు. ప్రాణాధారమైన మందుల్లో కూడా వారి చేతివాటం ఆగడం లేదు’’ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘అరబిందో ఫార్మా కంపెనీ యజమాని పీవీ రాంప్రసాద్‌ రెడ్డి, సీఎం జగన్‌రెడ్డికి బినామీ. జగన్‌ కేసుల్లో ఏ 2గా ఉన్న విజయసాయిరెడ్డికి అరబిందో యజమాని వియ్యంకుడు. జగన్‌ ప్రభుత్వం రాగానే ఈ కంపెనీకి రాష్ట్రంలో 108, 104 వాహనాల కాంట్రాక్ట్‌ అప్పగించింది. ఇందులో రూ.300 కోట్ల కుంభకోణం చోటు చేసుకొంది. ఈ కంపెనీ తయారీ మందులు అమెరికాకు ఎగుమతి అవుతుండటంతో ఆ దేశానికి చెందిన ఎఫ్‌డీఏ ప్రతినిధులు ఇక్కడి తయారీ కేంద్రాలను సందర్శించి తనిఖీలు చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం, తెలంగాణ రాష్ట్రంలో ఈ కంపెనీకి చెందిన యూనిట్లలో తమ తనిఖీలో కల్తీ పదార్థాలను కనుగొన్నామని, దీనిని సరిదిద్దుకోవాలని ఎఫ్‌డీఏ ఈ కంపెనీకి లేఖ రాసింది. అయినా మార్పు రాకపోవడంతో ఈ ఏడాది రెండోసారి హెచ్చరిక లేఖ పంపింది. నిబంధనల ప్రకారం ఇటువంటి లేఖలు వస్తే అరబిందో కంపెనీ ఆ విషయాలను మన దేశ కేంద్ర ప్రభుత్వ సంస్థ సెబీకి తెలియచేయాలి. కాని పొడిపొడిగా సమాచారం పంపారని గుర్తించి సెబీ ఇటీవల ఈ కంపెనీకి తీవ్రమైన హెచ్చరికతో నోటీసు పంపింది. తక్షణం పూర్తి వాస్తవాలు తమకు పంపాలని సెబీ ఆదేశించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. జగన్‌ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న కంపెనీల వ్యవహార శైలి ఎలా ఉందో ఇదో ఉదాహరణ’’ అని చెప్పారు. ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయకుంటే అరబిందో ఉత్పత్తులను అమెరికాలో అడుగుపెట్టనీయబోమని ఎఫ్‌డీఏ చెప్పడం తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ‘‘జగన్‌రెడ్డి అవినీతి కేసుల్లో నిందితునిగా ఉండి మరో బినామీగా ఉన్న హెటిరో ఫార్మా కంపెనీ కూడా అవినీతిమయంగా మారింది. ఈ కంపెనీ తయారు చేసిన రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు నల్ల బజారులో విపరీతమైన ధరలకు విక్రయించారు. కరోనా సమయంలో ప్రజలను విపరీతంగా దోచుకొన్నారని పత్రికల్లో అనేక వార్తలు వచ్చాయి. ఇటీవల ఐటీ అధికారులు ఈ కంపెనీపై దాడులు జరిపితే బీరువాల్లో, అట్టపెట్టెల్లో కుక్కి పెట్టిన నగదు కట్టలు దొరికాయి. అవి లెక్కపెడితే రూ.142 కోట్లుగా తేలింది. కరోనా సమయంలో ప్రజలను విపరీతంగా దోచుకొందని ఆరోపణలకు గురైన వ్యక్తి కోసం జగన్‌రెడ్డి పైరవీ చేసి తెలంగాణ సీఎంతో మాట్లాడి రాజ్యసభ సీటు ఇప్పించారు’’ అని విమర్శించారు. ట్విటర్‌లో ఇతరుల గురించి జుగుప్సాకరంగా అసభ్యంగా ట్వీట్లు పెట్టే విజయసాయిరెడ్డి తన వియ్యంకుడి కంపెనీ ఘన కార్యం గురించి అవే ట్వీట్లు పెట్టాలని పట్టాభి అన్నారు. 

Updated Date - 2022-06-29T08:10:43+05:30 IST