మళ్లీ డ్రగ్స్‌ కలకలం

ABN , First Publish Date - 2022-08-08T06:10:34+05:30 IST

నగరంలో గంజాయితోపాటు ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌, ఎండీఎంఏ పౌడర్‌ వంటి సింథటిక్‌ డగ్స్‌ వినియోగం చాపకిందనీరులా విస్తరిస్తోంది.

మళ్లీ డ్రగ్స్‌ కలకలం

నగరంలో విస్తరిస్తున్న సంస్కృతి 

ఎప్పటికప్పుడు పట్టుబడుతున్న ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌, ఎండీఎంఏ పౌడర్‌ 

పెరుగుతున్న కొకైన్‌ వినియోగం 

హైదరాబాద్‌, బెంగళూరు, గోవా నుంచి దిగుమతి

డార్క్‌ వెబ్‌సైట్‌ ద్వారా క్రిప్టో కరెన్సీతో క్రయ విక్రయాలు

వాట్సాప్‌ గ్రూప్‌ల్లో రహస్యంగా సరఫరా

ఉక్కుపాదం మోపుతామంటున్న సీపీ శ్రీకాంత్‌

యాంటీ డ్రగ్స్‌ నార్కోటిక్‌ సెల్‌ ద్వారా నిఘా


 (విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో గంజాయితోపాటు ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌, ఎండీఎంఏ పౌడర్‌ వంటి సింథటిక్‌ డగ్స్‌ వినియోగం చాపకిందనీరులా విస్తరిస్తోంది.  ఖరీదైన కొకైన్‌ కూడా ఉన్నత ఆదాయవర్గాలకు చెందిన పిల్లలు వినియోగిస్తున్నారని సమాచారం. ఏజెన్సీలో లభ్యమవుతున్న గంజాయికి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గిరాకీ ఉంది. దీంతో అక్కడికి గంజాయిని తరలిస్తున్న నగరంలోని కొంతమంది యువకులు హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, గోవా ప్రాంతాల్లో సులభంగా లభ్యమయ్యే ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌, ఎండీఎంఏ పౌడర్‌తో పాటు ఖరీదైన హెరాయిన్‌, కొకైన్‌ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ను గుట్టుగా నగరానికి చేరుస్తున్నారు.  


నగరంలో యువత డ్రగ్స్‌ మత్తులో జోగుతోంది. నిన్నమొన్నటి వరకు గంజాయి, గంజాయి, ఫోర్ట్విన్‌ ఇంజక్షన్లు వంటి  మత్తుమందుల వినియోగం అధికంగా ఉండేది. కానీ ఇప్పుడు  ఖరీదైన ఎండీఎంఏ పౌడర్‌, ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌ను దాటి  కొకైన్‌ వినియోగించేస్థాయికి చేరిపోయింది. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా కొంతమంది యువకులే వ్యాపారుల అవతారమెత్తి కొరియర్‌, అమెజాన్‌, ఇండియన్‌ పోస్ట్‌ ద్వారా పార్శిళ్ల రూపంలో నగరానికి డ్రగ్స్‌ చేరుస్తున్నారు. మరికొందరైతే తమతోపాటే లగేజీలో తెచ్చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో సింథటిక్‌ డ్రగ్స్‌ తక్కువ ధరకే లభ్యమవుతుండగా... నగరంలో వాటిని నాలుగైదు రెట్లకు కొనుగోలు చేసేవారుండడంతో ఇటీవల దిగుమతి పెరిగిపోతోంది. డ్రగ్స్‌ను ఎవరు తీసుకొస్తున్నారనేది గుర్తించడం చాలాక్లిష్టమైన విషయం కావడంతో పోలీసులు కూడా డ్రగ్స్‌ పెడ్లర్స్‌(సరఫరాదారులు)ను పట్టుకోలేకపోతున్నారు. పక్కా సమాచారం ఉంటేనే తప్ప గుర్తించలేని పరిస్థితి. దీనిని అలుసుగా తీసుకుంటున్న కొంతమంది సులభంగా డబ్బు సంపాదించేందుకు  డ్రగ్స్‌ను తెచ్చి నగరంలో స్నేహితులు, తెలిసినవారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 


సరదాతో మొదలై...

నగరంలో ఇంటర్‌, ఇంజనీరింగ్‌ చదువుతున్నవారితో పాటు ఐటీ ఉద్యోగాలు చేస్తున్న కొంతమంది సరదా కోసం మొదట డ్రగ్స్‌ వినియోగించి, క్రమేణా వాటికి అలవాటుపడుతున్నారు. కొన్నాళ్లకు తమకు అవసరమైన మేరకు డ్రగ్స్‌ను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో డ్రగ్‌ పెడ్లర్స్‌గా మారుతున్నారు. దీంతో తమ అవసరం తీరడంతోపాటు స్నేహితులకు విక్రయించేందుకు వీలుగా మోతాదు పెంచి కొనుగోలు చేసి పూర్తిస్థాయి పెడ్లర్స్‌గా అవతరిస్తున్నారు. 

తాజాగా శనివారం గోవా నుంచి నగరానికి 50  ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌తో పాటు 4.4 ఎండీఎంఏ అనుమానిత పౌడర్‌ను తీసుకొస్తుండగా రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు నగరంలో అతనికి సహాయంగా ఉన్న మరో నలుగురిని అరెస్టు చేశారు. ఏడాది కిందట నగరానికి చెందిన ఒక రౌడీషీటర్‌ ఆధ్వర్వంలో రామాటాకీస్‌ వద్ద ముగ్గురు యువకులు కొకైన్‌ త రలిస్తుండగా ఇంటెలిజెన్స్‌ అధికారులు, నగర పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ  చేయగా 29 గ్రాముల కొకైన్‌ లభ్యమైంది. ఏజెన్సీ నుంచి గంజాయి దిగుమతి చేసుకుని ప్యాకెట్లుగా, సిగిరెట్ల రూపంలోకి మార్చేసి నగరంలోని చాలా ప్రాంతాల్లోని పాన్‌షాప్‌ల్లో విక్రయిస్తున్నారు. వీటిని వాడుతున్నవారిలో కాలేజీ విద్యార్థులు, యువత ఉండడం సరత్రా ఆందోళనకు గురిచేస్తోంది. 


డార్క్‌ వెబ్‌సైట్‌ ద్వారా  కొనుగోలు 

గోవా, బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చే స్తున్నవారంతా డార్క్‌వెబ్‌సైట్ల ద్వారా విక్రేతలను సంప్రదిస్తున్నారు. ఆ వెబ్‌సైట్లలో తమకు కావాల్సిన డ్రగ్స్‌ను ఆర్డర్‌ చేస్తున్నారు. వాటిని ఇవ్వాల్సిన మొత్తాన్ని కిప్ర్టో కరెన్సీ రూపంలో చెల్లిస్తున్నారు. దీనివల్ల పోలీసులకు దీనికి సంబంధించిన వివరాలను సేకరించడం క్లిష్టంగా మారుతోంది. డ్రగ్స్‌ క్రయ, విక్రేతలతో రహస్యంగా ఒక గ్రూప్‌ను ఏర్పాటుచేసి, ఏదైనా మెసేజ్‌ పెడితే 24 గంటల్లో ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయిపోయేలా ఆప్షన్‌ పెడుతున్నారు. దీనివల్ల ఒకవేళ ఎవరైనా పట్టుబడినా ఇతర లింక్‌లను గుర్తించడానికి అవకాశం ఉండదు. 


‘టాటామోటార్స్‌లో సేల్స్‌ప్రమోటర్‌గా పనిచేస్తున్న నగరంలోని బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన ఓరుగంటి రవికుమార్‌(23) ఏజెన్సీ నుంచి గంజాయిని గోవా తీసుకెళ్లి విక్రయిస్తున్నాడు. అక్కడ సింథటిక్‌ డ్రగ్స్‌ను కొనుగోలుచేసి నగరానికి తెచ్చి కొంతమందితో కలిసి విక్రయిస్తుండగా నిఘా ఉంచిన పోలీసులు శనివారం రాత్రి ఐదుగురిని అరెస్టుచేశారు. రవికుమార్‌ ను గతంలో గోవా పోలీసులు గంజాయితో అరెస్టు చేశారు.

‘ఏప్రిల్‌ 13న చినవాల్తేరులోని ఒక అపార్టుమెంట్‌పై పోలీసులు దాడిచేసి డ్రగ్స్‌ కలిగి ఉన్న బెంగళూరుకి చెందిన తరుణ్‌, శ్రీకర్‌తోపాటు నగరానికి చెందిన రౌతు అవినాష్‌, వనకొండ అవినాష్‌, శ్రీవాత్సవ్‌ను అరెస్టుచేశారు. వీరి నుంచి 63 ఎల్‌ఎస్‌డీ బోల్డ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఇంటర్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఒకే కళాశాలలో చదువుకున్నవారే కావడం విశేషం.

‘మూడు నెలల కిందట హైదరాబాద్‌కు చెందిన యువతి హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు ట్రావెల్‌ బస్సు లో నగరానికి డ్రగ్స్‌ తీసుకొచ్చి ఎన్‌ఏడీ జంక్షన్‌లో బస్సు దిగి కారు ఎక్కివెళుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను తనిఖీ చేయగా ఎండీఎంఏ పిల్స్‌ 18, ఎండీ క్రిస్టల్‌ పౌడర్‌ రెండు గ్రాములు లభ్యమైంది. నగరంలోని తన స్నేహితుడి కోరికమేరకు ఆమె డ్రగ్స్‌ను వేరొక యువతి నుంచి తీసుకుని తెచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.’ 


ఉక్కుపాదం మోపుతాం

నగరంలో డ్రగ్స్‌ సంస్కృతి  పెరుగుతున్నందున ఉక్కుపాదం మోపాలని నిర్ణయించాం. ఇందుకోసం యాంటీ నార్కోటిక్‌ సెల్‌ను బలోపేతం చేస్తున్నాం. టాస్క్‌ఫోర్స్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో సంయుక్తంగా డ్రగ్స్‌ పెడ్లర్స్‌, వినియోగదారులపై నిఘా పెడుతున్నాం. సమాచారం అందగానే  దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై దృష్టిపెట్టాలి. డ్రగ్స్‌కు అలవాటుపడితే ప్రాథమిక దశలోనే గుర్తించి కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. అవసరమైతే మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లాలి. పోలీస్‌శాఖ పరంగా ఎవరికైనా సహాయం కావాలంటే అందించేందుకు సిద్ధం. డ్రగ్స్‌కు అలవాటుపడిన వారికి విముక్తికల్పించేందుకు పోలీస్‌శాఖ తరఫున స్వర్ణభారతి స్టేడియంలో రూమ్‌ నంబరు 12లో ప్రతి మంగళవారం ‘మార్పు’పేరుతో కౌన్సెలింగ్‌ చేపడుతున్నాం.  

- సీహెచ్‌ శ్రీకాంత్‌, నగర పోలిస్‌ కమిషనర్‌ 

Updated Date - 2022-08-08T06:10:34+05:30 IST