డ్రమ్ములో వృద్ధురాలి శవం

ABN , First Publish Date - 2022-05-17T13:19:15+05:30 IST

స్థానిక నీలాంగరైలో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మృతదేహాన్ని కుమారుడు ఓ డ్రమ్ములో వుంచి, దానిని తెరిచేందుకు వీలు లేకుండా.. చుట్టూ

డ్రమ్ములో వృద్ధురాలి శవం

- నీలాంగరైలో కలకలంఫ ఆమెది హత్యా, సహజ మరణమా?

- పోలీసుల ముమ్మర దర్యాప్తు

- కుమారుడి మానసిక స్థితి సరి లేదంటున్న స్థానికులు


చెన్నై: స్థానిక నీలాంగరైలో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మృతదేహాన్ని కుమారుడు ఓ డ్రమ్ములో వుంచి, దానిని తెరిచేందుకు వీలు లేకుండా.. చుట్టూ సిమెంట్‌ పూయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని మానసిక స్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతుండగా, అతను తల్లిని హత్య చేశాడా? లేక మరణించాక దాచి పెట్టాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీలాంగరైలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు  ..

  సరస్వతి నగర్‌ రెండో మెయిన్‌రోడ్డు సమీపంలో సెంబగం (86) అనే వృద్ధురాలు తన కుమారుడు సురేష్‌ (53)తో కలసి నివసిస్తోంది. సురేష్ కు వివాహమై భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇటీవల అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే అప్పుడప్పుడూ వచ్చి ఆమె తన అత్త యోగక్షేమాలు చూసుకుని వెళ్తుండేది. ఈ నేపథ్యంలో రెండు వారాలుగా సెంబగం కనిపించపోవడంతో తన బావ బాబుకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. సోమవారం ఇంటికొచ్చిన సెంబగం పెద్దకుమారుడు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అతడిని సురేష్‌ అడ్డుకున్నాడు. ఎట్టకేలకు లోపలికెళ్లి చూడగా ఇంట్లో తల్లి కనిపించలేదు. ఏం జరిగిందని తమ్ముడిని నిలదీయడంతో అతను అసలు విషయం బయటపెట్టాడు. రెండు రోజుల క్రితం తల్లి చనిపోయిందని, అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఆమె శవాన్ని డ్రమ్ములో పెట్టి, వాసన బయటకు రాకుండా సిమెంటు పూశానని చెప్పాడు. దీంతో బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో డ్రమ్ముతో సహా శవాన్ని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే సెంబగం మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-05-17T13:19:15+05:30 IST