ఆకతాయిల అరాచకం

ABN , First Publish Date - 2022-06-29T06:24:30+05:30 IST

నగరంలో ఆకతాయిలు, చిల్లర రౌడీలు పేట్రేగిపోతున్నారు.

ఆకతాయిల అరాచకం
దొండపర్తిలో మంగళవారం పట్టపగలు రోడ్డు పక్కన మద్యం సేవిస్తున్న దృశ్యం

పట్టపగలు రోడ్లపై మద్యం, గంజాయి సేవనం

ఆ మార్గంలో వెళుతున్న వారితో గొడవలు

మహిళలపై అసభ్యకర కామెంట్లు

ఇబ్బందిపడుతున్న జనం

వారితో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు

జనావాసాల మధ్య ఖాళీ స్థలాలు, నిరుపయోగంగా ఉన్న భవనాల్లో చీకటి కార్యకలాపాలు

మత్తులో కొట్లాటలు, హత్యలు

నగరంలో కొరవడిన పోలీసుల నిఘా, పెట్రోలింగ్‌

ఇదే అదనుగా రెచ్చిపోతున్న అసాంఘిక శక్తులు

ఇప్పటికైనా నగర పోలీస్‌ కమిషనర్‌ సీరియస్‌గా తీసుకోకపోతే శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


నగరంలో ఆకతాయిలు, చిల్లర రౌడీలు పేట్రేగిపోతున్నారు.  పట్టపగలే రహదారుల పక్కన, జనావాసాల నడుమ గల ఖాళీ స్థలాలు, నిరుపయోగంగా వున్న భవనాల్లో మద్యం, గంజాయి సేవిస్తున్నారు. కత్తులు చేత బట్టుకుని ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారితో గొడవలకు దిగుతూ దాడులకు తెగబడుతున్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరికి వారు...వెనకడుగు వేస్తున్నారు.

ప్రశాంత నగరంగా పేరొందిన విశాఖలో మందుబాబులు, ఆకతాయిల ఆగడాలు రోజురోజుకీ పెచ్చుమీరుతుండడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. రోడ్లు పక్కనే గుంపులు గుంపులుగా చేరి పట్టపగలే మద్యం సేవిస్తున్నారు. మరికొందరైతే గంజాయి దట్టించిన సిగరెట్లు, మత్తు కలిగించే మందులను వినియోగిచేస్తున్నారు. ఆ దారి వెంట వెళ్లేవారెవరైనా చూస్తారనో, పోలీసులు వస్తారేమోననే భయం ఏమాత్రం వారిలో వుండడం లేదు. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

గతంలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ దొంగలు, ఆకతాయిలు, రౌడీషీటర్లపై పోలీసులు ఓ కన్నేసి ఉంచేవారు. రక్షక్‌ వాహనాలు, బ్లూ కోల్ట్స్‌, డీ కోల్ట్స్‌ పేరుతో రాత్రి, పగలు  పెట్రోలింగ్‌ చేస్తుండేవారు. ఆకతాయిలు ఎక్కడైనా రోడ్డుపై గుమిగూడినా, నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపించినా స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించేవారు. ఆ తర్వాత కుటుంబసభ్యులను పిలిచి పూచీకత్తుపై విడిచిపెట్టేవారు. అలాగే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూడా మఫ్టీలో నగరమంతటా తిరుగుతూ పోకిరీలను గుర్తించేవారు. దీంతో అల్లరిమూకలు అదుపులో ఉండేవి. ఇప్పుడు నగరంలో పోలీసింగ్‌ పూర్తిగా మారిపోయింది. ఎందుకోగానీ పెట్రోలింగ్‌, నిఘాకు స్టేషన్ల అధికారులు ప్రాధాన్యం తగ్గించేశారు. ఇది ఆకతాయిలు, అసాంఘిక శక్తులకు కలిసివచ్చింది. పట్టపగలే నడిరోడ్డుపై రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కసారి వారి మధ్య గొడవలు తలెత్తి  పరస్పరం దాడులు, హత్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల మాధవధారలో ఒక కేబుల్‌ ఆపరేటర్‌పై మద్యం మత్తులో వున్న స్నేహితులే దాడి చేయడంతో...అతను ప్రాణాలు కోల్పోయాడు. కొన్నాళ్ల కిందట శివాజీపాలెంలో కేజీహెచ్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న వ్యక్తి, మరొకరు కలిసి మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో వార్డు బాయ్‌ తలపై అవతలివ్యక్తి సుత్తితో మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 


చాలాచోట్ల ఇదే పరిస్థితి

నగరంలో ఎక్కడ చూసినా ఆకతాయిలు కనిపిస్తున్నారు. రుషికొండ, బీచ్‌రోడ్డు, దసపల్లా లేఅవుట్‌, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, కొబ్బరితోట, అల్లిపురం, ద్వారకా కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌, జ్ఞానాపురం, ఏయూ ఇంజనీరింగ్‌ మైదానం, శివాజీ పార్కు, పెదవాల్తేరు, దసపల్లా హిల్స్‌, ఎంవీపీ కాలనీ ఏఎస్‌ రాజా గ్రౌండ్స్‌, పోర్టు క్వార్టర్స్‌, దొండపర్తి, రైల్వే న్యూకాలనీ, అక్కయ్యపాలెం, ముస్లిం తాటిచెట్లపాలెం, అబిద్‌నగర్‌, కైలాసపురం, మురళీనగర్‌, మాధవధార వంటి ప్రాంతాల్లో ఆకతాయిలు ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై దాడులు, బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో తమకెందుకు వచ్చిన తంటా అనే భావనతో ఎవరికివారు మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా నగరంలో అసాంఘిక శక్తులపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ దృష్టిసారించకపోతే భవిష్యత్తులో శాంతిభద్రతలకు విఘాతం కలగడం ఖాయమని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలో మాదిరిగా గస్తీ, పెట్రోలింగ్‌ నిర్వహించాలని సంబంధిత స్టేషన్ల అధికారులను ఆదేశించాల్సిందిగా కోరుతున్నారు.


విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు

నగరంలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొంతమంది ఏజెన్సీ నుంచి రహస్యంగా తీసుకువచ్చి కిరాణా దుకాణాలు, పాన్‌షాపులకు సరఫరా చేస్తున్నారు. వారంతా చిన్న ప్యాకెట్లుగా చేసి తమకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే విక్రయిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలతోపాటు ఎంవీపీ కాలనీ, రుషికొండ, జోడిగుళ్లపాలెం, శివాజీపాలెం, రేసపువానిపాలెం, సీతమ్మధార, తాటిచెట్లపాలెం, రైల్వే న్యూకాలనీ, కైలాసపురం, కంచరపాలెం, జ్ఞానాపురం, కప్పరాడ వంటి ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. నగరం, శివారుల్లోని పలు కళాశాలల పరిసరాల్లో వుండే పాన్‌షాపుల్లో  గంజాయి దట్టించిన సిగరెట్లను విక్రయిస్తున్నారు. ఏజెన్సీ నుంచి 12 కిలోల గంజాయిని తీసుకొచ్చి పెందుర్తి సమీపంలోని వేపగుంట వద్ద చిన్నప్యాకెట్లుగా మార్చి నగరంలో వ్యాపారులకు సరఫరా చేస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం రేసపువానిపాలెంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని త్రీటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రతిరోజూ గంజాయి పట్టుబడుతుండడం నగరంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా తయారవుతున్నదనే విషయం స్పష్టం చేస్తున్నది.


ఎక్కడెక్కడ అంటే...


ఫ రాత్రి 8 గంటలు దాటితే ఎంవీపీ కాలనీ రైతుబజార్‌ మందుబాబుల అడ్డాగా మారుతోంది. మద్యం సేవించిన అనంతరం సీసాలను అక్కడే పడేసి, బీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో రైతుబజార్‌ పరిసరాలు దారుణంగా మారుతున్నాయి. 

ఫ భీమిలి లాల్‌బహదూర్‌శాస్త్రి మునిసిపల్‌ మార్కెట్‌ షెడ్లు మందుబాబులకు అడ్డాగా మారాయి. ఇక్కడ వ్యాపార వ్యవహారాలు సాగకపోవడంతో వీటిని మద్యపానానికి వినియోగిస్తున్నారు. అంతేకాకుండా చీకటిపడితే బీచ్‌, జోనల్‌ కార్యాలయం వెనుక భాగం, నిరుపయోగంగా వున్న ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు మందుబాబులు భారీగా చేరి మద్యం సేవిస్తుంటారు. 

ఫ గ్రేటర్‌ 15, 16వ వార్డుల పరిధిలోని పార్కులు, ఖాళీ స్థలాలు, పాడుబడ్డ స్టీల్‌ప్లాంట్‌ క్వార్టర్స్‌ మందుబాబుల నిలయాలుగా మారాయి. ఈ ప్రాంతాల్లో మద్యంతో పాటు గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సేవిస్తున్నారు. హెచ్‌బీకాలనీ జంక్షన్‌ వద్ద రాత్రి సమయంలో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. మద్యం సీసాలను రోడ్డుపైనే పగలగొట్టి పడేస్తున్నారు.  

ఫ ఎండాడ, సాగర్‌నగర్‌ పరిధిలోని ఖాళీ స్థలాలు, షెడ్లు, పార్కులు మందుబాబుల అడ్డాగా మారాయి. ఎండాడ చెరువు, బీసీ కాలనీలోని పార్కు, దుర్గానగర్‌లో ఖాళీ స్థలాలు, శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌కు వెళ్లే మార్గం, పెద రుషికొండ, ఐటీ సెజ్‌ రోడ్ల పక్కన రాత్రి ఎనిమిది నుంచి మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. ఖాళీ సీసాలను పగలగొట్టి రోడ్డుపైనే విసిరేస్తున్నారు. సాగర్‌నగర్‌ చుట్టుపక్కల పార్కులు కూడా మందుబాబుల ఆవాసాలుగా మారాయి. అర్ధరాత్రి సమయంలో యువకులు బైక్‌లపై వచ్చి మద్యం సేవించడంతో పాటు రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. 

ఫ మురళీనగర్‌ దరి బర్మా క్యాంపు నూకాలమ్మ గుడి పక్కన ఖాళీగా వున్న పీహెచ్‌సీ భవనం, బర్మా కాంపు సచివాలయం ప్రాంగణం మందుబాబులకు అడ్డాగా మారాయి. ఈ ప్రాంతంలో ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి.

ఫ మాధవధారలో మాధవస్వామి దేవాలయం రహదారి, మెట్ల మార్గంలో మందుబాబులు హల్‌చల్‌ చేస్తున్నారు. రహదారిపై మద్యం తాగుతూ స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు.

ఫ గోపాలపట్నం శ్మశాన వాటిక, ఆ పక్కన నిరుపయోగంగా వున్న చేపలబజారు, పాత గోపాలపట్నంలోని జువ్వాలమ్మ ఆలయ పరిసరాల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా మందుబాబులు యథేచ్ఛగా మద్యం సేవిస్తున్నారు.

ఫ నార్త్‌ సింహాచలం రైల్వే క్వార్టర్స్‌ తలుపులు తెరిచి వాటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పలువురు మార్చుకున్నారు.

ఫ మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ పరిసరాలు, నరవ రోడ్డులోని ఎంఈఎస్‌ పంపుహౌస్‌ ప్రాంతం, కొత్తపాలెం శివారు ధారాలమ్మ ఆలయ సమీపంలోని రైల్వే ట్రాక్‌ ప్రాంతాలను మందుబాబులు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా గంజాయి, మత్తుపదార్థాలు వినియోగించే యువత నిత్యం సంచరిస్తుంటారు. మత్తులో వున్న వారిని ప్రశ్నించేందుకు కూడా ఎవరూ సాహసించరు.

ఫ చీకటిపడితే ఇసుక కొండ రహదారి మందుబాబులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అసంపూర్తిగా రహదారి నిర్మాణం జరగడంతో జన సంచారం అంతగా లేకపోవడంతో మందుబాబులు ఇక్కడకు చేరుతున్నారు.

ఫ అక్కయ్యపాలెం వేణుగోపాలస్వామి ఆలయం ఎదురు వీధి, ఎన్‌జీజీఓస్‌ కాలనీ, శాంతిపురం వద్ద ఉన్న లాల్‌బహుదూర్‌ శాస్ర్తి పార్కులో మందుబాబులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు.

ఫ డాబాగార్డెన్స్‌ సరస్వతి పార్కులో కూడా కొందరు గుట్టుచప్పుడు కాకుండా మద్యం సేవిస్తూ, సీసాలను అక్కడే విడిచిపెడుతున్నారు.

ఫ రైల్వే స్టేషన్‌ జ్ఞానాపురం వైపు ప్రవేశద్వారం రహదారిలో రాత్రివేళ బహిరంగంగా మద్యం తాగుతున్నారు. ఎవరైనా అడిగిన వారిపై దాడులు నిర్వహిస్తున్నారు. 

ఫ అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారికి ఇరువైపులా వుండే సర్వీస్‌ రోడ్లు మందుబాబులుగా అడ్డాలుగా మారుతున్నాయి.

ఫ దొండపర్తి మెయిన్‌ రోడ్డులో పగలు, రాత్రి తేడా లేకుండా మందుబాబులు రహదారిపై బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. మద్యం షాపులకు సమీపంలో ఖాళీగా వున్న దుకాణాల ఆవరణలో మందుబాబులు గుంపులు గుంపులుగా చేరుతున్నారు. ఆ ప్రాంతంలో ఓ మద్యం దుకాణానికి ఆనుకుని ఖాళీగా ఉన్న దుకాణం మందుబాబులతో నిత్యం కిటకిటలాడుతుంటుంది.



Updated Date - 2022-06-29T06:24:30+05:30 IST