ఎండు తెగులుతో ఎండిపోతున్న శనగ పంట

ABN , First Publish Date - 2022-01-23T04:41:52+05:30 IST

ప్రకృతి వైపరీత్యాలు రైతును దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. ఈ ఏడాది అతివృష్టితో కకావికలమవుతున్న రైతుకు మరో కష్టం వచ్చిపడింది. ఈ ఏడాది రబీలో సాగుచేసిన శనగ పంటకు ఎండుతెగులు సోకడంతో పంట నిలువునా ఎండిపోతోంది. మళ్లీ సాగుచేద్దామన్నా పైర్లు వేసేందుకు అదును దాటి పోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచక రైతులు అల్లాడి పోతున్నారు.

ఎండు తెగులుతో ఎండిపోతున్న శనగ పంట
నిలువునా ఎండిపోతున్న శనగ పైరును చూసి ఆవేదన చెందుతున్న పొందూరు రైతు

టంగుటూరు, జనవరి 22 : ప్రకృతి వైపరీత్యాలు రైతును దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. ఈ ఏడాది అతివృష్టితో కకావికలమవుతున్న రైతుకు మరో కష్టం వచ్చిపడింది. ఈ ఏడాది రబీలో సాగుచేసిన శనగ పంటకు ఎండుతెగులు సోకడంతో పంట నిలువునా ఎండిపోతోంది. మళ్లీ సాగుచేద్దామన్నా పైర్లు వేసేందుకు అదును దాటి పోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచక రైతులు అల్లాడి పోతున్నారు. మండలంలో రబీ సీజన్‌కు ప్రధానమైన పంట శనగ. ప్రస్తుత సీజన్‌కు సుమారు 12వేల ఎకరాల్లో సాగువుతోంది. పది రోజుల క్రితం విత్తనం మొదలు రెండు నెలలు దాటిన శనగ పంటలు సాగులో ఉన్నాయి. మండలంలోని తూర్పు గ్రామాల పొలాలు ఆరక శనగ విత్తడంలో జాప్యం జరిగింది. ఆలస్యంగా శనగ ఎదపెట్టడం ప్రారంభమైనా ఇంతలో మళ్లీ సంక్రాంతికి ఎడతెరపి లేని వర్షాలు కురవడంతో కొన్ని తోటల్లో శనగ విత్తడం మరింత ఆలస్యం అయింది. పడమర గ్రామాలైన కొణిజేడు, పొందూరు, ఎం నిడమలూరు, కారుమంచి లాంటి కొన్ని గ్రామాల్లో శనగ వేసి రెండు నెలలు గడుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో తూర్పుగ్రామాల్లో శనగ సాగు జాప్యం జరిగినా పడమర ప్రాంతంలో అదునుకు పంటలు సాగుకావడంతో ఆయా గ్రామాల రైతులు ఆనందపడ్డారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు తూర్పుతీర గ్రామాల్లో భారీ వర్షాలు పడగా పడమర గ్రామాల్లో తక్కువగానే పడ్డాయి. పంటల పెరుగుదలకు సరిపడా వర్షం పడినందున రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తోటలకు నీరు కట్టే అవసరం కూడా తప్పిందని అంతా ఆశించారు

 నిలువునా ఎండిపోతున్న శనగ పంట

 శనగ పంటలను ఎండు తెగులు ఆశించడంతో శనగ వేరు ఎండిపోయి చేలు నిలువునా ఎండిపోతున్నాయి. ప్రధానంగా రెండు నెలల కాలం దాటిన తోటల్లో ఈసమస్య కనిపిస్తోంది. ముందు చేలల్లో అక్కడక్కడా కనిపించిన ఎండు మొక్కలు ఇప్పుడు పొలమంతా విస్తరిస్తున్నాయి. ఈ ఇబ్బందులు గతంలోనూ ఉన్నా ఈసారి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. 60 రోజులు పంట కాలం గడవగానే ఈసమస్య ఎక్కువగా వస్తోంది. ప్రస్తుతం పొందూరు, కొణిజేడు, ఎం నిడమలూరు గ్రామాల్లో శనగ చేలు ఎండు తెగులు దెబ్బకు ఎండిపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. వ్యవసాయాధికారులు సైతం చేతులెత్తేయడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  పొందూరులో మేరుగ ఆనంద్‌, బి పరమయ్య మరికొంత మంది రైతులు ఇప్పటికే ఎండిపోయిన శనగ పంటను దున్ని వేశారు. కొణిజేడు రైతులు కొందరు కొన్నాళ్ల క్రితమే ఎండిన పంటలను తీసివేశారు. ఇంకొందరు రైతులు ఎండిన శనగ పంటను తీసివేసేందుకు సిద్ధమవుతున్నారు. పంట కాలం గడిచేకొద్దీ ఎండు తెగులు సమస్య ఎక్కువవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూమిలో సేంద్రియ కర్బనం లేకనే ..

 భూమిలో సాధారణంగా ఉండే సేంద్రియ కర్బనం లేక సిలీంద్రాలు(బ్యాక్టీరియా) ఉత్పన్నమై శనగ పంటను ఎండు తెగులు ఆశిస్తున్నదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పశువుల పేడ, ఇతర దిబ్బల్లోని ఎరువులను వాడక పోవడం, సేంద్రియ ఎరువుల స్థానంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, అలాగే పంట మార్పిడి చేయక పోవడం, పచ్చిరొట్ట ఎరువుల వినియోగించకపోవడం లాంటి కొన్ని పరిస్థితుల వలన పంటలను వివిధ తెగుళ్లు ఆశిస్తున్నట్లు వ్యవసాయ సిబ్బంది తెలియజేస్తున్నారు.  ట్రైకోడెర్మావిరిడీతో విత్తనశుద్ధి చేసి పొలంలో ఎదపెట్టాలని చెప్పినా కొందరు రైతులు అంతగా పట్టించుకోలేదని చెబుతున్నారు.

అదును దాటింది, ఇప్పుడేమి చేయాలి

 పంట సాగుకు అదును దాటి పోవడంతో తీసివేస్తున్న శనగ స్థానంలో ఏమి సాగుచేయాలా అని రైతులు అయోమయంలో పడ్డారు. చేలల్లో పదును లేదని, ఏది విత్తినా మొలక రాదని రైతులు భయపడుతున్నారు. కుదిరితే మినుము, నువ్వు పంటలు సాగు చేయాలని ఆశిస్తున్న రైతులు సాగైతే ఫలితం ఉంటుందా అన్న మీమాంసలో ఉన్నారు.


Updated Date - 2022-01-23T04:41:52+05:30 IST