వేడుకగా దసరా

ABN , First Publish Date - 2021-10-17T04:40:47+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో దసరా వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని అంబేడ్కర్‌ స్టేడియంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించారు. పట్టణవాసులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలిరావడంతో స్టేడియం జనసంద్రమైంది.

వేడుకగా దసరా
సంగారెడ్డిలో పాలపిట్టను వదులుతున్న జగ్గారెడ్డి తదితరులు

జనసంద్రమైన సంగారెడ్డి అంబేడ్కర్‌ స్టేడియం

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు


సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 16 : సంగారెడ్డి జిల్లాలో దసరా వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని అంబేడ్కర్‌ స్టేడియంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించారు. పట్టణవాసులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలిరావడంతో స్టేడియం జనసంద్రమైంది. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గాయకురాలు మంగ్లీ పాటలతో అలరించారు. సినిమా పాటలకు జగ్గారెడ్డి ఉత్సాహంగా చిందేశారు. నక్షత్ర డ్యాన్స్‌ అకాడమీ విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. జై భవానీ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాంమందిర్‌ నుంచి స్టేడియం వరకు నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా సాగింది. వేదిక వద్ద మహేశ్వరశర్మ సిద్దాంతి ఆధ్వర్యంలో జమ్మి వృక్షానికి పూజ చేసి,  పాలపిట్టను వదిలిపెట్టారు. అనంతరం రావణాసుర దహనం చేశారు. అలయ్‌బలయ్‌ తీసుకుంటూ ప్రజలు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, వారి కూతురు జయారెడ్డి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంతకిషన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


మాట తప్పితే తప్పుకుంటా : జగ్గారెడ్డి

అధికారంలో ఉంటే శాసిస్తానని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తానని.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని.. మాట తప్పితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ దళితులకు రూ.10 లక్షలు ఇస్తామని చెబుతుండగా, తాను మాత్రం సంగారెడ్డి నియోజకవర్గంలోని పేదలందరికీ రూ.60 లక్షలు ఇవ్వనున్నానని తెలిపారు. పేద కుటుంబాలకు 120 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు పోరాటం చేస్తున్నానని, ఇందుకు ప్రజల సహకారం కావాలని కోరారు. వీలైతే సీఎం కేసీఆర్‌ను ఒప్పిస్తానని, లేకుంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తానే ఇస్తానన్నారు.  శాసనసభ్యుడిగా ఐఐటీ, మంజీరనీళ్లు, పాలిటెక్నిక్‌ కాలేజీ, అగ్రికల్చర్‌ కాలేజీ, రాజీవ్‌ పార్కు, స్విమ్మింగ్‌ పూల్‌, గంగారం నుంచి సంగారెడ్డి మీదుగా జహీరాబాద్‌ వరకు నాలుగు లేన్ల రహదారిని ఏర్పాటు చేయించింది తానేనని గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ మంజూరు చేయించానని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ను తాను తిట్టడం లేదని, తిడితేనే జోష్‌ వస్తదని కొందరు అంటున్నారని, అయితే తిట్టడం కావాలా? పని కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-17T04:40:47+05:30 IST