నా కొడుకుపై చేయని నేరాన్ని మోపారు..

ABN , First Publish Date - 2021-01-16T05:20:44+05:30 IST

తన కొడుకుని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చేయని నేరాన్ని బలవంతంగా ఒప్పించారని మండలంలోని పెదవడ్లపూడికి చెందిన కోటేశ్వరమ్మ శుక్రవారం డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

నా కొడుకుపై చేయని నేరాన్ని మోపారు..
మాట్లాడుతున్న శ్రీహరిచారి, కోటేశ్వరమ్మ దంపతులు

డీఎస్పీకి ఫిర్యాదు చేసిన తల్లి

మంగళగిరి, జనవరి 15: తన కొడుకుని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చేయని నేరాన్ని బలవంతంగా ఒప్పించారని మండలంలోని పెదవడ్లపూడికి చెందిన కోటేశ్వరమ్మ శుక్రవారం డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన ఇంటి ఓనరు భావన రత్తమ్మ గత ఏడాది నవంబరు 23 రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. ఘటన జరిగిన రోజు తాను భర్తతో కలిసి నరసరావుపేటలోని కూతురి వద్దకు వెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా మృతురాలి ఒంటిపై నగలు మాయం కాగా.. ఆమె మేనల్లుడు వెంకట ప్రసాద్‌పై బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కాగా ఇదే విషయంలో ఈనెల 10వ తేదీ మంగళగిరి రూరల్‌ పోలీసులు జగదీష్‌ను విచారణ పేరుతో తీసుకువెళ్లి నేటికీ పోలీస్‌స్టేషన్‌లోనే అక్రమంగా నిర్భంధించడంతో పాటు వేధింపులకు గురి చేసి చేయని నేరాన్ని బలవంతంగా ఒప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి రూరల్‌ సీఐ శేషగిరిరావు, సిబ్బంది వల్ల తమకు ప్రాణహాని జరుగుతుందని వారి నుంచి తమకు రక్షణ కల్పించి  న్యాయం చేయాలని కోటేశ్వరమ్మ డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-16T05:20:44+05:30 IST