యాప్‌తో పరేషాన్‌..!

ABN , First Publish Date - 2021-10-09T05:01:39+05:30 IST

గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరును విశ్లేషించేందుకు, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు తీసుకొచ్చిన డైలీ శానిటేషన్‌ రిపోర్టు (డీఎ్‌సఆర్‌) యాప్‌ వారికి ఇబ్బందికరంగా మారుతున్నది. ఇప్పటికే పనిభారంతో సతమవతమవుతున్న తమకు ఈ యాప్‌ మెడపై కత్తిలా మారిందని కార్యదర్శులు వాపోతున్నారు. పంచాయతీ పరిధిలో

యాప్‌తో పరేషాన్‌..!

మార్పులు, చేర్పులతో నూతన  డైలీ శానిటేషన్‌ రిపోర్టు యాప్‌

తప్పనిసరిగా పని ప్రదేశంలో ఉండేలా రూపకల్పన

ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశం

వ్యతిరేకిస్తున్న పంచాయతీ కార్యదర్శులు

ప్రభుత్వం పునరాలోచించాలని విన్నపం



ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, అక్టోబరు 8 : గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరును విశ్లేషించేందుకు, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు తీసుకొచ్చిన డైలీ శానిటేషన్‌ రిపోర్టు (డీఎ్‌సఆర్‌) యాప్‌ వారికి ఇబ్బందికరంగా మారుతున్నది. ఇప్పటికే పనిభారంతో  సతమవతమవుతున్న తమకు ఈ యాప్‌ మెడపై కత్తిలా మారిందని కార్యదర్శులు వాపోతున్నారు. పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, పల్లెప్రగతి పనుల పురోగతి నమోదు కోసం ప్రభుత్వం డీఎ్‌సఆర్‌ యాప్‌ తీసుకొచ్చింది. పల్లెప్రగతి పనులు పరిశీలన, వీధులను శుభ్రం చేయడం, రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, మరణాల నమోదు, విద్యుత్‌ బిల్లులు.. ఇలా గ్రామానికి చెందిన ప్రతీ సమాచారాన్ని ఈ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇటీవల ఈ యాప్‌లో మార్పులు చేశారు. మరిన్ని ఆంశాలను జతచేశారు. 


ఐదు నిమిషాలు ఆలస్యమైనా..

కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని జిల్లాలోని 462 పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. కొత్త యాప్‌లో పంచాయతీ కార్యాలయ అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పనిచేస్తుంది. పంచాయతీ కార్యదర్శులు కచ్చితంగా పని ప్రదేశంలోనే ఉండేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. దీని ప్రకారం కార్యదర్శులు తెల్లవారుజాము 5 గంటల లోపు విదులకు హజరై, స్వీయ చిత్రం తీసుకుంటేనే హజరు నమోదవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా యాప్‌లో హాజరు అంగీకరించదు. అనంతరం డైయిలీ శానిటేషన్‌ రిపోర్టును ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతీరోజు పంచాయతీ కార్యాలయం చిత్రాలను లోపలి నుంచి ఒకటి, బయటి నుంచి మరొకటి తీసి యాప్‌కు అనుసంధానం చేయాలి. రోడ్లు, వీధుల్లో పారిశుధ్య పనులకు సంబంధించిన ఐదు ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. పాత తేదీన తీసిన ఫొటోలో అప్‌లోడ్‌ కావు. 


అంతా అయోమయం

ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న తమకు కొత్త నిబంధనలు ఇబ్బందికరంగా మారుతున్నాయని కార్యదర్శులు వాపోతున్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు తెల్లవారుజామునే లేచి బయలుదేరితే తప్ప 8 గంటల లోపు తాము పనిచేసే పంచాయతీ కార్యాలయానికి చేరుకునే పరిస్థితి లేదు. ఈ నేథ్యంలో మహిళా కార్యదర్శుల బాధలు వర్ణణాతీతం. వేళాపాలా లేకుండా విధులు, కుటుంబానికి దూరంగా విధులు నిర్వహించాల్సిరావడంతో వారు కుమిలిపోతున్నారు. జిల్లాలో పలు పంచాయతీల్లో సెల్‌ఫోన్‌ సంకేతాలు సరిగ్గా అందకపోవడంతో మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నవారికి సంకటంగా మారింది.


యాప్‌తో పంచాయతీ కార్యదర్శులకు పెరిగిన కష్టాలు

–ఎస్‌. బలరాం, పంచాయతీ కార్యదర్శుల ఫోరం మెదక్‌ జిల్లా అధ్యక్షుడు

కొత్త డీఎ్‌సఆర్‌ యాప్‌ మెడపై కత్తిలా మారింది. ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్నాం. ఉపాధిహామీ క్షేత్రసహాయకుల పనులు కూడా చేస్తున్నారు. పలు ఇతర శాఖల పనులను కూడా మాతోనే చేయిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వస్తే ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తున్నది. 

Updated Date - 2021-10-09T05:01:39+05:30 IST