దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమాలో కరోనా ఆంక్షలు తొలగింపు.. కొత్త మార్గదర్శకాలివే..

ABN , First Publish Date - 2022-02-17T17:01:46+05:30 IST

మహమ్మారి కరోనా ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమా పలు కోవిడ్-19 ఆంక్షలను తొలగించాయి.

దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమాలో కరోనా ఆంక్షలు తొలగింపు.. కొత్త మార్గదర్శకాలివే..

ఎన్నారై డెస్క్: మహమ్మారి కరోనా ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమా పలు కోవిడ్-19 ఆంక్షలను తొలగించాయి. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌సీఈఎంఏ) ఫిబ్రవరి 9వ తేదీన చేసిన సూచనల మేరకు దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమా నగరాలు తాజాగా కరోనా ఆంక్షలను సడలించాయి. దీనిలో భాగంగా దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమాలోని స్థానిక అధికారులు వివిధ కార్యకలాపాలు, కార్యక్రమాల కోసం ప్రోటోకాల్‌ను ప్రకటించారు. దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమాలో ఆంక్షల సడలింపు తర్వాత కొన్ని కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


దుబాయ్..

దుబాయ్ సంక్షోభం, విపత్తు నిర్వహణ సుప్రీం కమిటీ, ఎన్‌సీఈఎంఏ ద్వారా ఆమోదించబడిన నిర్ణయాలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు:

• అన్ని వాణిజ్య, పర్యాటక, వినోద సౌకర్యాలు, షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా, సామాజిక సమావేశాలు పూర్తి సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చు.

• మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం, సాధారణ శానిటైజేషన్ వంటి కోవిడ-19 నివారణ చర్యలు మాత్రం యధావిధిగా అమలులో ఉంటాయి.

• అదే సమయంలో మహమ్మారి నుంచి అత్యున్నత స్థాయి రక్షణ కోసం వ్యాక్సిన్, బూస్టర్‌ తీసుకోవడం ప్రాముఖ్యతను సుప్రీం కమిటీ నొక్కి చెప్పింది.


షార్జా..

షార్జా స్థానిక అత్యవసర, సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ బృందం మార్గదర్శకాలు:

• వివిధ ఆర్థిక, పర్యాటకం, వినోదం, షాపింగ్ కేంద్రాలలో అన్ని కార్యకలాపాలు, ఈవెంట్‌ల సామర్థ్యాన్ని అధికార యంత్రాంగం ఎత్తివేసింది. ఇందులో ఎమిరేట్‌లో ప్రజా రవాణా సౌకర్యాలు కూడా ఉన్నాయి.

• మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాలలో సామాజిక దూరం ఒక మీటరుకు తగ్గించబడింది.

• వివాహాలు, అంత్యక్రియలు వంటి సామాజిక కార్యక్రమాలను 100 శాతం సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చు.

• కోవిడ్-19 పరిమితులను తొలిగించినప్పటికీ ప్రజలు మాస్క్ ధరించడం, వ్యాక్సిన్, బూస్టర్ డోసులను తీసుకోవడం వంటి నివారణ చర్యలను తప్పక పాటించాలని అథారిటీ పేర్కొంది.


రాస్ అల్ ఖైమా..

రాస్ అల్ ఖైమా పోలీస్ విభాగం ఫిబ్రవరి 16న తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

• మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల వద్ద ఒక మీటర్ సామాజిక దూరం.

• గరిష్ట సామర్థ్యంతో ఆర్థిక, పర్యాటక, వినోద, షాపింగ్ కేంద్రాలు మరియు ప్రజా రవాణా నిర్వహణ.

• వివాహాలు, అంత్యక్రియలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు పూర్తి సామర్థ్యం

• Al Hosn యాప్‌లోని గ్రీన్ పాస్ సిస్టమ్ యధావిధిగా ఎమిరేట్‌లో అమలు చేయబడుతుంది.


Updated Date - 2022-02-17T17:01:46+05:30 IST