Dubai: 'అమ్మా'నుషం.. నెలల పసికందును ఆస్పత్రిలోనే వదిలి.. స్వదేశానికి పారిపోయిన మహిళ.. కోర్టు తీర్పు ఇదీ!

ABN , First Publish Date - 2022-05-20T15:16:48+05:30 IST

నెలల పసికందును ఆస్పత్రిలోనే వదిలేసి స్వదేశానికి పారిపోయిందో మహిళ. ఈ అమానుష ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది.

Dubai: 'అమ్మా'నుషం.. నెలల పసికందును ఆస్పత్రిలోనే వదిలి.. స్వదేశానికి పారిపోయిన మహిళ.. కోర్టు తీర్పు ఇదీ!

దుబాయ్: నెలల పసికందును ఆస్పత్రిలోనే వదిలేసి స్వదేశానికి పారిపోయిందో మహిళ. ఈ అమానుష ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం దుబాయ్ కోర్టును ఆశ్రయించడంతో సదరు మహిళకు రెండు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఆమె కోసం దుబాయ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆసియాకు చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం దుబాయ్‌లో ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాన్పు కోసం చేరింది. ఆమెకు ఆడపిల్ల పుట్టింది. అయితే, పసికందుకు ఆరోగ్య సమస్యలు ఉండడంతో వైద్యులు నెలలు నిండని శిశువుల కోసం ఉండే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచారు. ఈ క్రమంలో మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడం జరిగింది. కానీ, డిశ్చార్జి అయిన తర్వాత ఆమె తిరిగి బిడ్డను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లలేదు. అలా మూడు నెలలు గడిచిపోయాయి. 


దాంతో ఆస్పత్రి యాజమాన్యం మహిళ కోసం ఆమె కాన్పుకు వచ్చినప్పుడు ఇచ్చిన ఇంటి అడ్రస్‌కు వెళ్లి వాకాబు చేశారు. కానీ, ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయి చాలా రోజులు గడిచినట్లు తెలిసింది. దాంతో చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సదరు మహిళ కోసం వెతికారు. కానీ, ఆమె దొరకలేదు. ఆమె అప్పటికే యూఏఈ వదిలి స్వదేశానికి వెళ్లిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాజాగా ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో న్యాయస్థానం నెలల పసికందును యూఏఈలో వదిలి స్వదేశానికి పారిపోయిన మహిళకు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఆమెను తిరిగి దుబాయ్‌కు రప్పించాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు దుబాయ్ పోలీసులు సదరు మహిళ కోసం దర్యాప్తు చేస్తున్నారు.            


Updated Date - 2022-05-20T15:16:48+05:30 IST