తూర్పు దూబగుంటలో నగదు స్వాహాపై విచారణ

ABN , First Publish Date - 2022-07-08T02:40:06+05:30 IST

మండలంలోని తూర్పు దూబగుంట పంచాయతీలో సర్పంచు కుమారుడు కళ్యాణ్‌, కార్యదర్శి ప్రతాప్‌లు కుమ్మక్కై సుమారు

తూర్పు దూబగుంటలో నగదు స్వాహాపై విచారణ
నిధుల స్వాహాపై విచారణ చేస్తున్న ఎంపీడీవో కళాధర్‌రావు, ఈవోఆర్డీ వెలుగోటి మధు

కలిగిరి, జూలై 7: మండలంలోని తూర్పు దూబగుంట పంచాయతీలో సర్పంచు కుమారుడు కళ్యాణ్‌, కార్యదర్శి ప్రతాప్‌లు కుమ్మక్కై సుమారు రూ.7.90లక్షల నగదును స్వాహా చేసినట్టు గ్రామంలో గురువారం ఎంపీడీవో కళాధర్‌, ఈవోఅర్డీ వెలుగోటి మధుల సమక్షంలో జరిపిన బహిరంగ విచారణలో తేలింది.  ఏకగ్రీవ పంచాయతీ ప్రోత్సాహకానికి జమ అయిన ఐదులక్షల్లో రూ.3.16లక్షలు, ఉపాధిహామీ పనుల కింద మొక్కలు నాటడం, నీరు పట్టడం కింద జమ అయిన వాటిలో రూ. 4.73లక్షల నగదును ఎలాంటి పనులు చేయకుండా, బిల్లులు లేకుండా సంబంధిత వ్యక్తులకు చెల్లించకుండా కార్యదర్శి ప్రతాప్‌, సర్పంచు ధనమ్మ భర్త, కుమారుడి పేరిట చెక్‌లను తయారు చేసి అక్రమంగా బ్యాంకు నుంచి డ్రాచేశారు. ఈ నగదును వారు స్వప్రయోజనాలకోసం వాడుకున్నట్లు తెలిసింది. ఉపాధి కూలీలు తమకు రావాల్సిన నగదును అడగడంతో ఈ వ్యవహారం బయటపడింది. వైసీపీ నాయకుల సమక్షంలో నెల పాటు గుట్టుగాచేసిన రాజీ ప్రయత్నాలు విఫలమవడం, ఆ నగదును తిరిగి జమచేయడంలో కళ్యాణ్‌కు, ప్రతాప్‌కు విభేదాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


 తనదే తప్పు : కళ్యాణ్‌


సర్పంచు కుమారుడు కళ్యాణ్‌కు శ్రీరామ్‌చిట్‌ఫండ్‌లో కార్యదర్శి ప్రతాప్‌ ష్యూరిటీ సంతకం పెట్టిన కారణంతో కొంత సొమ్మును అప్పుగా తీసుకొని ప్రోనోటు రాసివ్వడం జరిగిందని, తిరిగి  ఏకగ్రీవ పంచాయతీ నిధులు అకౌంట్లో జమ అయినపుడు రూ.2లక్షలు అవసరం అని కార్యదర్శి చెప్పడంతో సర్పంచు ధనమ్మ భర్త పేరుతో చెక్‌ తయారు చేసి వాటిని డ్రాచేసి తమ అవసరాలకు వాడుకున్నట్టు  తేలింది. అయితే ఈ విషయాలేమి తన తల్లి, సర్పంచు ధనమ్మకు తెలియదని, అది తన తప్పేనని కళ్యాణ్‌ తెలిపాడు. ఎంపీడీవో కళాధర్‌రావు మాట్లాడుతూ పంచాయతీ నిధులు అనుమతులు లేకుండా డ్రా చేసిన విషయంపై సర్పంచు ధనమ్మ, ఆమె కుమారుడు కళ్యాణ్‌, కార్యదర్శి ప్రతాప్‌లతోపాటు, గ్రామస్థుల వద్ద రాతపూర్వక వివరణ తీసుకున్నామని, నివేదికను డీపీవోకి అందజేసి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-07-08T02:40:06+05:30 IST