UAEలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రవాసులు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి!

ABN , First Publish Date - 2022-06-18T17:30:43+05:30 IST

ఇక కరోనా పీడ వదిలింది అనుకుంటున్న తరుణంలో మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. భారత్ సహా యూఏఈలో కూడా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం భారీ మొత్తంలో కొవిడ్ కేసులు నమోదైనట్లు యూఏఈ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

UAEలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రవాసులు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి!

ఎన్నారై డెస్క్: ఇక కరోనా పీడ వదిలింది అనుకుంటున్న తరుణంలో మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. భారత్ సహా యూఏఈలో కూడా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం భారీ మొత్తంలో కొవిడ్ కేసులు నమోదైనట్లు యూఏఈ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ క్రమంలోనే కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కొత్త కొవిడ్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అక్కడ అమలవుతున్న నియమాలు.. ప్రవాసులతోపాటు యూఏఈకి వెళ్లే ప్రయాణికులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


గ్రీన్‌పాస్‌ల కాల పరిమితి కుదింపు

రెండు డోసుల కొవిడ్ తీసుకున్న ప్రజలకు గతంలో 30 రోజుల కాల పరిమితితో కూడిన గ్రీన్‌పాస్‌లను యాప్ ద్వారా అందించేవారు. అయితే కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. గ్రీన్ పాస్ గడువును 14 రోజులకు కుదించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బిల్డింగ్‌లలోకి ప్రవేశానికి గ్రీన్‌పాస్‌లు తప్పనిసరి.



మాస్క్ తప్పనిసరి

యూఏఈలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం అనేది మన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే.. ఇన్‌డోర్ ప్రదేశాల్లో మాత్రం మాస్క్ తప్పనిసరి. ఎవరైనా మాస్క్ ధరించనట్లైతే.. 3000 దిన్హార్ల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. 


10 రోజుల ఐసోలేషన్

కొవిడ్ లక్షణాలతో సంబంధం లేకుండా.. కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరూ 10 రోజులపాటు ఐసోలేషన్‌లోకి వెళ్లాలి. రెసిడెంట్లు అందరూ కొవిడ్-19 డీఎక్స్‌బీ స్మార్ట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. 


యూఏఈ వెళ్లే ప్రయాణికులు

యూఏఈకి వెళ్లే ప్రయాణికులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని.. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా పొంది ఉండాలి. కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై క్యూఆర్ కోడ్ తప్పనిసరి. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులు ప్రయాణానికి 48 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ సర్టిఫికెట్‌ను పొంది ఉండాలి. ఈ సర్టిఫికెట్‌పై కూడా క్యూఆర్ కోడ్ తప్పనిసరి.


Updated Date - 2022-06-18T17:30:43+05:30 IST