ఉత్తుంగ భద్ర

ABN , First Publish Date - 2022-05-22T06:56:18+05:30 IST

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది.

ఉత్తుంగ భద్ర
తుంగ డ్యాం నుండి కిందకు వస్తున్న జలాలు

డ్యాంలోకి భారీగా వరద నీరు

ఆదివారానికి నీటి నిల్వలు

40 టీఎంసీలకు చేరే అవకాశం

బళ్లారి, మే 21 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. గత మూడునాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం పైభాగంలో ఉండే  తుంగ, భద్ర, సుంకేసుల రిజర్వాయర్లు నిండిపోయాయి. శనివారం సాయంత్రం అధికారుల లెక్కల ప్రకారం 96,956 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఆదివారానికి ఇన్‌ఫ్లో  లక్ష  క్యూసెక్కులు దాటే అవకాశం ఉన్నట్లు బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదివారం సాయంత్రానికి డ్యాంలో సుమారు 40 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉన్నట్లు బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. డ్యాం నీటి మట్టం 1633 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా, శనివారం నీటి నిల్వ 23.545 టీఎంసీలకు చేరింది. ఆదివారం ఉదయం, సాయంత్రం మొత్తం ఇనఫ్లో కలిపితే సుమారు 40 టీఎంసీల వరకూ నీరు చేరుతుంది.  బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం డ్యాంలోకి 50 టీఎంసీలు నీరు చేరితే ఆయకట్టు భూములకు కాల్వల ద్వారా నీరు విడుదల చేయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి తుంగభద్ర డ్యాం నుండి ఆయకట్టుకు జూన్‌లోనే ఖరీఫ్‌ సాగుకు నీరు విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-05-22T06:56:18+05:30 IST