దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వాయిదా

Sep 24 2021 @ 14:37PM

గుంటూరు: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక శనివారం మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఎంపీపీ ఎన్నికకు కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి రామ్ ప్రసన్న వాయిదా వేశారు. 18 మంది ఎంపీటీసీలకు గాను 8 మంది సభ్యులే హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఎంపీపీ పదవికి ఒక్కరే నామినేషన్ వేశారని, నామినేషన్‌ల సమయం కూడా ముగిసిందని రామ్ ప్రసన్న తెలిపారు. ఎంపీపీ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎంపీపీ స్థానం బీసీ మహిళలకు రిజర్వు అయింది. టీడీపీ -జనసేన కూటమి పదిమంది సభ్యులలో చిలువూరు-1 నుంచి గెలుపొందిన టీడీపీ అభ్యర్థిని షేక్‌ జమీనా ఒక్కరే బీసీ మహిళ. సరిగ్గా ఈ పాయింట్‌ను క్యాచ్‌ చేసిన వైసీపీ తన అధికార బలాన్ని ఇక్కడ వినియోగించుకుంటోంది. జమీనాకు బీసీ కుల ధ్రువీకరణపత్రం సకాలంలో మంజూరు కాకుండా తహసీల్దారుపై ఒత్తిడి తెస్తూ గేమ్‌ ఆడిస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం రాకపోయింది. శుక్రవారం ఉదయానికి కులధ్రువీకరణ పత్రం రాకుంటే జమీనాకు ఎంపీపీ స్థానానికి పోటీచేసే అవకాశం దూరమవుతుంది. వైసీపీకి చింతలపూడి ఎంపీటీసీ సభ్యురాలు దానబోయిన సంతోషరూపవాణి బీసీ కోటాలో సిద్ధంగా ఉంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.