స్వచ్ఛ సంకల్పమేదీ!

ABN , First Publish Date - 2022-06-29T06:24:09+05:30 IST

ఒక చిన్న సమస్య.. ఐదున్నర దశాబ్ద్దాలుగా కొవ్వూరు పట్టణాన్ని పట్టి పీడిస్తూనే ఉంది.

స్వచ్ఛ సంకల్పమేదీ!
గౌరీపట్నం క్వారీ గోతుల్లో కొవ్వూరు చెత్త

ఐదు దశాబ్దాలుగా వేధిస్తున్న చెత్త సమస్య

డంపింగ్‌యార్డులేక ఇబ్బందులు

నేటికీ లభించని పరిష్కారం

పట్టించుకోని నాయకగణం


కొవ్వూరు, జూన్‌ 28 : ఒక చిన్న సమస్య.. ఐదున్నర దశాబ్ద్దాలుగా కొవ్వూరు పట్టణాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇక్కడ నుంచే ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. అయినా చెత్త సమస్య నేటికి పరిష్కరించలేకపోయారు. నిన్నటి వరకు పట్టణ నడిబొడ్డున ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన డంపింగ్‌యార్డు స్థలాన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేటాయించ డంతో మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పటికీ డంపింగ్‌ యార్డుకు స్థలం ఉన్నా అక్కడ వేద్దామంటే స్థానికులు అడ్డుకుంటున్నారు. ప్రతి రోజు వచ్చే 23 టన్నుల చెత్తను ఎక్కడ వేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పేరుకు హోంమంత్రి ఉన్న నియోజకవర్గం అయినా అంతటా అపరిశుభ్రతే. ఇకనైనా మంత్రి వనిత ప్రత్యేక దృష్టి సారించి డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది. 

కొవ్వూరు పట్టణానికి డంపింగ్‌ యార్డు తీరని సమస్యగా మారింది. 1965 ఫిబ్రవరి ఒకటవ తేదీన కొవ్వూరు పురపాలక సంఘం ఏర్పడింది. నాటి నుంచి డంపింగ్‌యార్డు సమస్య పట్టిపీడిస్తూనే ఉంది. 16.23 కిలోమీటర్లు విస్తరించి ఉన్న కొవ్వూరు పట్టణంలో 23 వార్డులు 50వేలకు పైగా జనాభా ఉన్నారు. 13 వేల నివాస గృహాలు ఉన్నాయి. 23 వార్డుల నుంచి ప్రతిరోజు 23 టన్నులు చెత్త వస్తోంది. నందమూరు రోడ్‌లో సుమారు 2 ఎకరాల భూమిని సేకరించేందుకు గతంలో అధికారులు చర్యలు చేపట్టగా భూ యజమాని కోర్టును ఆశ్రయించడంతో డంపింగ్‌యార్డు సమస్య ఎటూ తేలలేదు. దీంతో ఒకటో వార్డు రాజీవ్‌కాలనీలో నివాసాలను ఆనుకుని ఉన్న మునిసిపల్‌ చెరువు మూసివేసి చెత్తను డంపింగ్‌ చేసేవారు. కాలనీవాసులు ఆం దోళన చేపట్టడంతో చెత్త వేయడం నిలుపుదల చేశారు. ఇటీవల కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో జిల్లా పరిషత్‌కు చెందిన 7 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌  కొవ్వూరు పట్టణంలో సేకరించిన చెత్తను పారవేయడానికి డంపింగ్‌ యార్డుకు కేటాయించారు. పంగిడి ప్రజలు విషయం తెలుసుకుని సుమారు 11 కిలోమేటర్లు దూరం నుంచి చెత్తను తీసుకువచ్చి పంగిడి గ్రామంలో వేయడానికి వీల్లేదని అభ్యంతరాలు తెలపడంతో సమస్య తీరకుండా పోయింది. పట్టణంలో సేకరించిన చెత్త వేయడానికి స్థలం లేకపోవడంతో పవిత్ర గోదావరి తీరం గోష్పాదక్షేత్రానికి సమీపంలోని పాతరైలు వంతెన వద్ద గోదావరి గట్టుపై కాటన్‌ విగ్రహం వద్ద మునిసిపల్‌ ఖాళీ స్థలంలో పారబోస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని పట్టణ పోలీస్టేషన్‌, సబ్‌జైలు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు కేటాయించారు. పోలీసు అదికారులు చెత్తను తొలగించి, మోడల్‌ పోలీస్టేషన్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో డంపింగ్‌యార్డు సమస్య తీరనిదిగా మారింది. ఎటూ దారిలేకపోవడంతో దేచర్ల క్వారీ గోతుల్లో పారబోస్తున్నారు. అయితే దేచర్లకు తరలింపు ఖర్చుతో కూడుకున్నది కావడంతో అధికారులు సమాలోచనలో పడ్డారు.కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఇద్దరు మంత్రులుగా ఎన్నికయ్యారు. ఒకరి హయాంలో సమస్య ఎటూ తేలలేదు. ప్రస్తుత హోంమంత్రి హయాంలో అయినా పరిష్కారం దొరుకుతుందని ఆశించిన పట్టణవాసులకు నిరాశే ఎదురవుతోంది. ఇంటింటా సేకరించిన చెత్తను ఎక్కడవేయాలో తెలియక అధికారులు అవస్థలు పడుతున్నారు. మునిసిపల్‌ ఆస్తుల బదలాయింపుపై అధికారపక్షం కౌన్సిలర్లు చూపిస్తున్న శ్రద్ధ పట్టణంలో అత్యవసరంగా  పరి ష్కరించాల్సిన సమస్యలపై చూపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.  


ప్రజల పక్షాన పోరాడతా..


డంపింగ్‌యార్డుకు పంగిడి గ్రామంలో 7 ఎకరాలు ఇచ్చామంటున్నారు. స్థానికుల అడ్డుకుంటున్నారని సాకుగా చూపిస్తున్నారు.కొవ్వూరులో సేకరించిన చెత్తను దేచర్ల క్వారీ గోతుల్లో వేయమంటున్నారు. అంతదూరం చెత్త తరలింపు అదనపు భారం. డంపింగ్‌ యార్డు సమస్యపై టీడీపీ తరపున కార్యాచరణ రూపొందించి ప్రజలపక్షాన పోరాడుతాం. 

- సూరపనేని చిన్ని, టీడీపీ నాయకుడు, కొవ్వూరు


రాజీవ్‌కాలనీలో చెత్త డంప్‌ చేస్తున్నాం..

కాటన్‌ విగ్రహం వద్ద చెత్త డంపింగ్‌చేస్తున్న స్థలం రెవెన్యూ అధికారులు పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికి కేటాయించారు. పంగిడి గ్రామంలో కేటాయించిన స్థలం లో చెత్త వేయడానికి గ్రామస్థులు అభ్యంతరం తెలుపుతున్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు తాత్కాలికంగా పట్టణంలోని రాజీవ్‌కాలనీ మునిసిపల్‌ స్థలంలో చెత్త డంప్‌ చేయిస్తున్నాం.

 - టి.రవికుమార్‌, కమిషనర్‌, కొవ్వూరు


Updated Date - 2022-06-29T06:24:09+05:30 IST