మళ్లీ తెరపైకి డంపింగ్‌యార్డు!

ABN , First Publish Date - 2021-01-25T06:10:58+05:30 IST

గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో డంపింగ్‌యార్డు ఏర్పాటు ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సేకరించిన చెత్తను ఇక్కడికి తరలించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ తెరపైకి డంపింగ్‌యార్డు!
ప్యారానగర్‌

ప్యారానగర్‌లో ప్రభుత్వ భూమిలో ఏర్పాటు!

ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న 10 గ్రామాల ప్రజలు

ప్రజలతో కలిసి ఉద్యమిస్తామంటున్న ప్రతిపక్షాలు

సమాచారం లేదని తేల్చిన రెవెన్యూ అధికారులు


గుమ్మడిదల, జనవరి 24 :  గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో డంపింగ్‌యార్డు ఏర్పాటు ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సేకరించిన చెత్తను ఇక్కడికి తరలించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్యారానగర్‌ ప్రధాన రోడ్డును బీటీగా మార్చేందుకు రెవెన్యూ  శాఖ నుంచి జీహెచ్‌ఎంసీ అధికారులు సమాచారం సేకరించారనే వార్తలు వస్తున్నాయి. డంపింగ్‌యార్డు ఏర్పాటు కోసమే రోడ్డు నిర్మాణానికి పూనుకుంటున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించామని, ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో డంపింగ్‌యార్డు ఏర్పాటు ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సేకరించిన చెత్తను ఇక్కడికి తరలించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలియడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్యారానగర్‌ గ్రామ శివారులోని 152 ఎకరాల ప్రభుత్వ భూమిలో డంపింగ్‌యార్డు నిర్మాణానికి ఐదేళ్ల క్రితం ప్రభుత్వం పూనుకున్నది. కానీ స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత ఎదురవడంతో వెనక్కి తగ్గింది. తాజాగా మరోసారి ప్యారానగర్‌ శివారులో డంపింగ్‌యార్డు నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకురావడంతో స్థానికులు భగ్గుమంటున్నారు. డంపిగ్‌యార్డు ఆలోచనను విరమించుకోకపోతే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. రెండురోజుల క్రితం ప్యారానగర్‌ ప్రధాన రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు, మండల రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం సేకరించారని తెలియవచ్చింది. డంపింగ్‌యార్డు నిర్మాణానికే రోడ్డు నిర్మాణానికి పూనుకుంటున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా 10 పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి అధికారులకు అందజేస్తున్నాయి. ఈ విషయంపై వివరణ కోరగా డంపింగ్‌యార్డు ఏర్పాటుపై తమకు ఎలాంటి సమాచారం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 


పర్యావరణానికి తీరని నష్టం 

ప్యారానగర్‌లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. పచ్చని ప్రకృతి, వన్యప్రాణులకు ఈ ప్రాంతం నెలవు. ఇక్కడ డంపింగ్‌యార్డు ఏర్పాటుచేస్తే పర్యావరణానికి తీరని నష్టం కలుగుతుందని స్థానికులు అంటున్నారు. చెత్త, దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు నివసించలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో పలుచోట్ల డంపింగ్‌యార్డుల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఉదాహారణగా చూపుతున్నారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ స్పందించి  డంపింగ్‌యార్డు ఏర్పాటును నిలుపుదల చేయాలని వేడుకుంటున్నారు.


తక్షణమే విరమించుకోవాలి : దోమడుగు శంకర్‌, నల్లవల్లి సర్పంచ్‌

నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్‌ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో డంపింగ్‌యార్డు ఏర్పాటును జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే విరమించుకోవాలి. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం.


జడ్పీ సమావేశంలో లేవనెత్తుతా : కుమార్‌గౌడ్‌, జడ్పీటీసీ 

ప్యారానగర్‌ శివారులో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. పర్యావరణం కూడా కాలుష్యమవుతుంది. గ్రామ ప్రజలకు ఇబ్బంది కలిగే ఈ విషయాన్ని జరగబోయే జడ్పీ సమావేశంలో లేవనెత్తుతా. అలాగే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తా. 


ఎలాంటి సమాచారం లేదు : సతీష్‌, డిప్యూటీ తహసీల్దార్‌

ప్యారానగర్‌ శివారులో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖకు ఎలాంటి సమాచారం లేదు. గతంలో ఉమ్మడి జిన్నారం మండలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ భూముల వివరాలు జీహెచ్‌ఎంసీ అధికారులకు పంపించాం. 


Updated Date - 2021-01-25T06:10:58+05:30 IST